లబ్దిదారుల్ని తగ్గించేందుకా? అర్హుల్ని గుర్తించేందుకా?
మూడు లక్షల మంది తొలగింపు
మహిళలు, వయోవృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు
రాజకీయాలకతీతంగా సాగితేనే అందరికీ న్యాయం
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్లో ఆందోళన
‘ఉపాధి’ నుంచి గుణపాఠాలు నేర్వని సర్కార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ కులగణన సర్వే 2024-2025 ప్రకారం రాష్ట్రంలో 1,12,15,034 కుటుంబాలున్నాయి. మొత్తం జనాభా 3.54 కోట్లకు పైగా ఉందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇందులో 90 శాతానికి పైగా కుటుంబాలు సర్కార్ నుంచి వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్నారు. ఆసరా పింఛన్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, 200లోపు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు తదితర పథకాలు వీరికి వర్తిస్తున్నాయి. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొన్ని కేటగిరీల్లో ప్రయోజనాలు పొందుతున్న వారికి ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.
”ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నైజేషన్) చేపట్టాలి. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్ట డంతో 3 లక్షల మంది అనర్హుల పేర్లు తొలగించగలిగాం. సాంకేతికతను సక్రమంగా వినియోగించుకోకపోవడంతోనే ఇంత పెద్ద సంఖ్యలో పొరపాట్లు దొర్లాయి. అర్హులకు లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు” అని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం ఏ రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపైనే ఇప్పుడు ప్రభుత్వ అధికారులతో పాటు సామాన్య ప్రజల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే సాంకేతికంగా ఫేషియల్ రికగ్నైజేషన్ విధానం అన్ని పథకాలకు సరిపోదు. కేంద్ర ప్రభుత్వం కూడా ఉపాధి హామీ పథకం అమలుకు ఇదే విధానాన్ని అమల్లోకి తెచ్చి, అభాసుపాలయ్యింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇదే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెస్తే వికలాంగులు, వయో వృద్ధులు సహా లబ్దిదారులందరిలోనూ ఆందోళనలు రేకెత్తడం సర్వసాధారణం.
60 ఏండ్లు దాటిన వయో వద్ధుల్లో చాలామందికి వేలిముద్రల గుర్తింపు సమస్య ఉంది. అలాగే ఐరిష్ సమస్యా ఉంది. రేషన్‌కార్డుల్లో కుటుంబ సభ్యులందరి వేలిముద్రల్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలాసార్లు ప్రకటించాయి. ఆ గడువును ప్రతిసారీ పొడిగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల వేలిముద్రలు మ్యాచ్ కాకపోవడంతో పౌరసరఫరాల శాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో లబ్దిదారులు, అధికారులకు ఎదురవుతున్న సమస్యలు. కొందరికి చేతి వేళ్లు అరిగిపోయి వేలి ముద్రలు పడటం లేదు. మరికొంత మందికి కంటి శుక్లాల సమస్య వల్ల ఆపరేషన్ చేయించుకున్న వారికి, కంటిలో ఏదైనా సమస్య ఉన్న వారికి కండ్లు స్కాన్ కాకపోవడంతో పింఛన్లు అందుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ గుర్తింపును అమలు చేస్తే ఆసరా పెన్షన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేకమందికి ఇబ్బందులు తప్పవు.
ఈ పద్ధతిని ఉపాధి హామీ కూలీలకు అమలు చేయడంతో ఆ ప్రభావం వారి హాజరుపై పడుతున్నది. పనిచేసినా, హాజరు నమోదు కాని సందర్భాలు అనేకం ఉన్నాయి. దీనివల్ల పనిదినాల సంఖ్య తగ్గిపోతున్నది. పనిదినాలను బట్టే కేంద్రం రాష్ట్రానికి నిధుల్ని విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వలస కూలీలకు ముఖ గుర్తింపుతో మరిన్ని కష్టాలు తప్పవు. పని లేక పొట్ట చేతపట్టుకుని పట్టణాలకు వలసలు వచ్చి, రోజు కూలీ చేసుకునే వారు లబ్ది పొందేందుకు విధిగా ప్రతి నెలా సొంతూళ్లకు వెళ్లడం వ్యయంతో కూడిన సమస్యగా మారే అవకాశం ఉంది. గడచిన రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారుల గుర్తింపు పేరిట చేపట్టిన అనేక చర్యలు అనుమానాస్పదంగానే ఉన్నాయనే ప్రచారం జరుగుతున్నది. ఖజానాపై ఆర్థిక భారం తగ్గించుకొనేందుకు అసరా పింఛన్లు, రేషన్ కార్డులు తగ్గించుకోవడం కోసమే ఈ తతంగం నడుస్తున్నదనే ఆందోళనలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఇవే అంశాలను ప్రచారాస్త్రాలుగా మార్చుకుంటున్నాయి.
సాపీగా జరిగితేనే…
రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికకు ముఖ గుర్తింపు సాఫీగా జరిగితేనే నిజమైన అర్హులకు న్యాయం జరుగుతుంది. అలా కాకుండా రాజకీయ కోణం తీసుకుంటే అర్హులైన వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. గత రెండేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొన్ని పథకాల్లో అనుసరించిన విధానాలు ప్రజల్లో అనుమానాలకు తావిస్తున్నాయి. రైతు రుణమాఫీలో రూ.2 లక్షల లోపు రుణమాఫీని దాదాపు 30 శాతం మంది రైతులు పొందలేకపోయారు. గ్రామాల్లో ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న ముఖ్యులు నిర్ణయించిన వారికే రుణమాఫీ వచ్చిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. అలాగే రూ.500 గ్యాస్ కనెక్షన్ లబ్దిదారుల్లో ఎంత మందికి పడుతుందో తెలియని పరిస్థితి. రైతు భరోసా లబ్ధిదారుల్లో సైతం అదే ఆందోళన కొనసాగుతోంది. లబ్ధిదారుల ఎంపిక రాజకీయ రూపం దాల్చకుండా ఉంటేనే సర్కార్ అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. అదే సందర్భంలో సాంకేతికంగా ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది.
లబ్దిదారులను తగ్గించేందుకే…
యం అడివయ్య, ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల్లో లబ్దిదారులను తగ్గించేందుకే ముఖ గుర్తింపు విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. 2024 నుంచి అనర్హుల పేరిట తొలగించిన 3 లక్షల ఆసరా పింఛన్లలో చాలామంది వేలి ముద్రలు, ముఖ గుర్తింపు రాకపోవడం వల్ల నష్టపోయారు. వృద్ధులకు, వికలాంగులకు ముఖ గుర్తింపు నుంచి మినహాయింపు ఇవ్వాలి.




