– ఇద్దరు మహిళా రైతులకు గాయాలు
– అర్ధరాత్రి నుంచి అన్నదాతల అవస్థలు
నవతెలంగాణ-కుభీర్
ఆరుగాలం కష్టపడి పండించిన రైతుకు ఆది నుంచి కష్టాలే, పంట విత్తుకోవడం నుంచి పంట అమ్ముకునే వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు చివరకు మద్దతు ధర లభించడం లేదు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్‌ఫెడ్ ద్వారా శనివారం నుంచి సోయా కొనుగోళ్లు కొరకు టోకెన్‌లు పంపిణీ చేస్తామని అధికారులు చెప్పడంతో రైతులు శుక్రవారం అర్దరాత్రి నుంచి బారులు తీరారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో సోయా రైతులు తరలి రావడంతో క్యూలైన్ల పరిస్థితి గందరగోళంగా మారింది. సహకార సంఘం కార్యాలయం గద్దె వద్ద టోకెన్ల కోసం తోపులాటలో పలువురు మహిళలు కింద పడ్డారు. కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఉన్నప్పటికీ రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై కృష్ణారెడ్డి, బైంసా రూరల్ సీఐ నైలు నాయక్ టోకెన్లు జారీ చేసే కేంద్రం వద్దకు చేరుకొని .. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్ పత్రాలను ముందుగా తీసుకొని టోకెన్లను జారీ చేయాలని సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. తహసీల్దార్ శివరాజ్, ఏఓ సారిక, సహకార సంఘం కార్యదర్శి క్రాంతి కుమార్ హాజరై మలేగాం, పల్సి, చాత గ్రామాలలో సోయా కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తొమ్మిది వ్యవసాయ క్లస్టర్లలో గల రైతు వేదికల్లో ఏఈఓలతో టోకెన్ల జారీ చేసే పక్రియను కొనసాగించాలని కోరారు. కలెక్టర్ దృష్టి సారించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లాలోనే 43 జీపీలు కలిగిన అతి పెద్ద మండలం కుభీర్ కావడం విశేషం. మండలంలో 76గ్రామాలు ఉండగా, 43 గ్రామపంచాయతీలు ఉన్నాయి. సుమారు 23వేల ఎకరాల్లో రైతులు సోయా పంటను సాగుచేశారు.
‘సోయా’ టోకెన్ల కోసం రైతుల తోపులాట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



