కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు
కపాస్ కిసాన్ యాప్ అమలుతో సీసీఐని నీరుగార్చే యత్నం : పత్తి రైతుల
రాష్ట్ర సదస్సులో ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-జనగామ
”దేశానికి అన్నం పెట్టే రైతులు అప్పులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. కానీ అందుకు కారకులైన కార్పొరేట్ సంస్థలకు కేంద్రం రాయితీలు ఇవ్వడం సిగ్గుచేటు..” అని ఆల్ ఇండియా కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. జనగామలోని కామాక్షి ఫంక్షన్‌హాల్‌లో శనివారం తెలంగాణ పత్తి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ పుచ్చకాయల కృష్ణారెడ్డి అధ్యక్షతన ”పత్తి రైతుల” రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్రలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులతో మోసపోయి దిగుబడి సరిగా రాక.. పెట్టిన పెట్టుబడులు ఎల్లక.. రైతులు అప్పుల పాలవుతున్నారని తెలిపారు. దిక్కుతోచని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం వదిలేసి రైతులు ఇతర రంగాలకు ఉపాధి కోసం పోతున్నారని, దీనికి కారణం బీజేపీ ప్రభుత్వ విధానాలేనని అన్నారు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం.. గిట్టుబాటు ధరలు పత్తి క్వింటాల్‌కు రూ.10,075 అమలు చేయాలని డిమాండ్ చేశారు.
దేశంలో పత్తి పంట మార్కెట్లోకి వచ్చే సమయంలోనే 11శాతం దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి ధరలు పడిపోయి రైతులు పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్య చేసుకునే దుస్థితి వస్తుందని అన్నారు. కేంద్రం దొడ్డిదారిన మార్కెట్ల ముసాయిదా చట్టం, విద్యుత్ సవరణ చట్టం, ప్రైస్ డెబిసిటీ పేమెంట్ స్కీమ్, కపాస్ కిసాన్ యాప్‌ని తీసుకొచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకునే విధంగా ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ పత్తి రైతు సంఘం రాష్ట్ర కోకన్వీనర్ మూడ్ శోభన్ మాట్లాడుతూ.. సీసీఐ కొనుగోలు కేంద్రాలను వెంటనే అన్ని జిల్లాల్లో రైతులకు అనుకూలమైన ప్రదేశాల్లో అవసరమైనవన్ని ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పత్తిలో తేమశాతం 8 నుంచి 12 శాతం ఉన్న దాన్ని 10 నుంచి 15శాతానికి మార్చాలని కోరారు. ఈ సదస్సులో రాష్ట్ర కో కన్వీనర్ భూక్యా చందునాయక్, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య, నాయకులు మంగ బీరయ్య, చిలుకూరి రాము, వాంకుడోత్ కోబల్, ఎం.కనకాచారి, జి.రామన్న, చిలుక బాల్‌రెడ్డి, ఎర్రనాయక్, షేక్ సైదా, సుధాకర్, చల్ల నరసింహారెడ్డి, చింతల రజనీకాంత్, కొప్పుల రజిత, ప్రసాద్, వెంకట్ మావో, జనగామ జిల్లా జిల్లా నాయకులు రమావత్ మీటియా నాయక్, మాచర్ల సారయ్య, పయ్యాముల బిక్షపతి, నక్క యాకయ్య, కుమారస్వామి, బోడ రాములు, బెల్లంకొండ వెంకటేష్, జాటోత్ శ్రీను నాయక్, ఎల్లేష్, ఉపేందర్, రవీందర్ రెడ్డి, రాజవ్వ, బచ్చు, శ్రీలత, గురజాల లక్ష్మీనరసింహారెడ్డి, వివిధ జిల్లాల ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
అప్పులు తీరక రైతుల ఆత్మహత్యలు.. కార్పొరేట్ సంస్థలకు రాయితీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



