Sunday, July 27, 2025
E-PAPER
Homeజాతీయంవీడని భయం

వీడని భయం

- Advertisement -

– ఉరి రహదారికి ఇరువైపులా ఇండో-పాక్‌ ఘర్షణ నష్టం అవశేషాలు
– బాధితులను పరామర్శించి, ఓదార్చిన సీపీఐ(ఎం) ప్రతినిధులు
– కాశ్మీర్‌లో పర్యటించిన బృందం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కాశ్మీర్‌, పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లను వేరుచేసే నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉరి పట్టణంలో సంఘర్షణ భయం ఇంకా తొలగిపోలేదు. ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత ఉరి, దాని పరిసర ప్రాంతాల్లో జరిగిన ఇండో-పాక్‌ ఘర్షణల్లో నియంత్రణ రేఖ వెంబడి అత్యధిక నష్టం జరిగింది. శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే రహదారిలో ఉరికి చేరుకుంటుండగా ఆ రహదారికి ఇరువైపులా ఘర్షణ వల్ల జరిగిన నష్టం అవశేషాలే కనిపిస్తాయి. అంతేకాక భారత్‌-పాకిస్తాన్‌ మధ్య వివాదం జరిగినప్పుడల్లా ఈ నియంత్రణ రేఖ సరిహద్దులోని సామాన్యులే నష్టాన్ని భరించాల్సి వస్తోంది. అయితే ఈ నష్టాన్ని ప్రత్యక్షంగా చూడటానికి, నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న వారిని ఓదార్చడానికి జమ్మూకాశ్మీర్‌లోని ఉరి పట్టణానికి వెళ్లిన సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి మంగళవారం అక్కడి వారి నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త, రిటైర్డ్‌ వైద్యాధికారి డాక్టర్‌ బషీర్‌ చల్కు సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి అక్కడి సమస్యను వివరించారు. ”ఉరి, సమీప ప్రాంతాల్లో కేవలం 69 బంకర్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ షెల్లింగ్‌, హింస కొనసాగుతోంది. ఈసారి కూడా భారీ షెల్లింగ్‌ జరిగినప్పుడు బంకర్‌లు నిండిపోయాయి. చాలా మంది ప్రజలు తమ సొంత ఆశ్రయాలను సిద్ధం చేసుకోవడం ద్వారా తమను తాము రక్షించుకున్నారు. పాకిస్తాన్‌ షెల్లింగ్‌ సరిహద్దు గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. ఒకే ఒక మరణం నమోదైనప్పటికీ, పిల్లలతో సహా చాలా మంది గాయపడ్డారు. ఇండ్లు, ఆస్తులను కోల్పోయిన వారికి తగిన పరిహారం అందలేదు. పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి మాత్రం రూ. 1.30 లక్షలు కేటాయించారు. ఇది పూర్తిగా సరిపోదు” అని ఆయన వారితో అన్నారు.
సీపీఐ(ఎం) ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ బాధితులకు పరిహారం అందించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ బృందంలో లోక్‌సభ సభ్యుడు, పొలిట్‌ బ్యూరో సభ్యులు అమ్రారామ్‌, లోక్‌సభ పక్షనేత కె.రాధాకృష్ణన్‌, ఎంపీలు ఎఎ రహీమ్‌, ఎస్‌. వెంకటేశన్‌, బికాశ్‌ రంజన్‌ భట్టాచార్య, కేంద్ర కమిటీ సభ్యుడు ముహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -