ఏం సాధించారు?

– మాటలు ఘనం… చేతలు శూన్యం
– కీలక రంగాలకు మొండిచేయి
– మోడీ పాలనకు తొమ్మిదేండ్లు
            మోడీ పాలనకు తొమ్మిదేండ్లు. ఓసారి వెనక్కి తిరిగి చూసి, ఈ తొమ్మిదేండ్లలో ఆయన ఏం చేశారు అని సింహావలోకనం చేస్తే…నోట్ల రద్దు మొదలు పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరల పెంపుతో పాటు అక్కరకు రాని నిన్న మొన్నటి రాజదండం వరకూ గుర్తుకురావడం ఖాయం. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని ఆయన ఏం చేశారని మరోసారి ఆలోచిస్తే, ఉన్న ప్యాసింజర్‌ రైళ్లకు స్పెషల్‌ అని ట్యాగ్‌లైన్‌ కట్టి ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల చార్జీలు వసూలు చేయడం, భగ్గుమంటున్న నిత్యవసరవస్తువుల ధరలు కనిపిస్తున్నాయి. మోడీ పాలనలో సాధారణ పౌరుడికి ఒనగూరిన ప్రయోజనం ఏంటో దుర్భిణి వేసి వెతికినా ఏమీ కనిపించకపాయే! రోడ్లేశాం…బ్రిడ్జిలు కట్టాం అంటూ గోడీ మీడియా ప్రచారం చేసినా, అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా అవే పనులు కదా చేసేది! కొత్తగా మోడీ చేసింది ఏంటి అనే సజీవ ప్రశ్న సశేషంగానే కనిపిస్తున్నది. తొమ్మిదేండ్ల ప్రజానుభవంలో తమకోసం మోడీ ఏం చేయట్లేదనే విషయాన్ని మాత్రం ఓటర్లు గుర్తించేశారు. వరుస ఓటముల్ని బహుమానంగా ఇస్తూ, ఇక చాలించు నీ పాలన అంటూ చూపుడు వేలిపై సిరాచుక్కల్ని చూపిస్తూ హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిది సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. ఆయన తొలిసారిగా 2014 మే 26న ప్రధాని పదవిని చేపట్టారు. దేశంలో ఎక్కువ కాలం ఆ పదవిలో కొనసాగిన నాలుగో నేతగా, తొలి కాంగ్రెసేతర నాయకుడిగా రికార్డుకెక్కారు. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఎక్కువ కాలం ఆ పదవిని నిర్వహించినా వారంతా కాంగ్రెస్‌కు చెందిన వారే. ఇక మోడీ హయాంలో దేశం అభివృద్ధి చెండడం మాట అటుంచి తిరోగమన బాట పట్టిందని ఈ తొమ్మిదేండ్లూ నిరూపిస్తున్నాయి. ప్రచార పటాటోపమే తప్పించి దేశానికి చేసిందేమీ కన్పించడం లేదు. విద్య, ఆరోగ్యం వంటి అనేక కీలక రంగాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ వివరాలను పరిశీలిస్తే…
వృద్ధిరేటులో అసమానతలు
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో మన దేశం ఐదో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్‌, జర్మనీ దేశాల తర్వాతి స్థానం మనదే. అయినప్పటికీ ఇటీవలి సంవత్సరాలలో భారత జీడీపీ వృద్ధి రేటులో అసమానతలు కన్పిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణంగా కోవిడ్‌ను చెప్పవచ్చు. అయితే అంతకుముందు కూడా దేశ ఆర్థిక పరిస్థితి ఏమంత బాగా లేదనే చెప్పాలి. 2016-17లో 8% వృద్ధిరేటు నమోదు కాగా ఆ తర్వాత అది కింది చూపులు చూస్తూనే వచ్చింది. 2017-18లో వృద్ధిరేటు 6.8 శాతానికి పడిపోయింది. ఆ సంవత్సరంలోనే జీఎస్‌టీని ప్రవేశపెట్టారు. 2018-19లో వృద్ధిరేటు 6.45 శాతానికి, 2019-20లో 3.87 శాతానికి తగ్గింది. 1920-21లో…అంటే కోవిడ్‌ కాలంలో ఈ రేటు -5.83 శాతానికి తగ్గినా 2021-22లో తిరిగి పుంజుకొని 9.05 శాతానికి చేరింది. కానీ 2022-23లో మళ్లీ తగ్గి 7% వద్ద నిలిచింది. తలసరి ఆదాయంలో కూడా అసమానతలే కన్పించాయి. గత తొమ్మిది సంవత్సరాలలో వార్షిక తలసరి ఆదాయం -8.86% నుండి 7.59 మధ్య కొనసాగింది.
ఆరోగ్య రంగంపై శీతకన్ను
మోడీ ప్రభుత్వం ఆరోగ్య రంగంపై శీతకన్ను వేసింది. కోవిడ్‌ మహమ్మారి దేశాన్ని కుదిపేసినా ఈ రంగంపై చేసిన ఖర్చులో పెరుగుదల కన్పించడం లేదు. 2014-15 నుండి 2022-23 వరకూ ఈ రంగంపై పెట్టిన ఖర్చు జీడీపీలో కేవలం 1.2%-2.2% మధ్యే ఉంది. ప్రజారోగ్యంపై పెడుతున్న ఖర్చులో కేంద్ర ప్రభుత్వ వాటా కేవలం 12 శాతమే. కానీ దేశ ప్రజలు మాత్రం తమ ఆదాయంలో 52% వరకూ ఆరోగ్యంపై ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.
పెద్ద నోట్ల రద్దుతో ఒరిగింది శూన్యం
పెద్ద నోట్ల రద్దు ఓ పెద్ద సాహసోపేత నిర్ణయమని ప్రభుత్వం డాంబికాలు పలికినా ఒరిగింది ఏమీలేకపోగా ఆర్థికవ్యవస్థకు నష్టమే మిగిల్చింది. నల్లధనాన్ని వెలికితీయడం మాట అటుంచితే పన్ను-జీడీపీ దామాషా ఏ మాత్రం పెరగలేదు. నగదు వినియోగం కూడా తగ్గలేదు. ఉదాహరణకు గత తొమ్మిది సంవత్సరాలలో పన్ను-జీడీపీ నిష్పత్తి 4.78-6.02% మధ్యన ఉన్నది. దీనికి భిన్నంగా కరెన్సీ- జీడీపీ నిష్పత్తి 2014-15లో 11.6% ఉంటే 2020-21లో 14.4 శాతానికి పెరిగింది. అయితే ఆ తర్వాతి సంవత్సరం అది కొంత తగ్గింది. డిజిటల్‌ లావా దేవీలను ఎంతగా ప్రోత్సహించినప్పటికీ ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదు.
ఎగుమతులూ అంతంతే
మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ భారత్‌ వంటి చర్యలు ఎన్ని తీసుకుంటున్నప్పటికీ దేశం నుండి సరుకుల ఎగుమతులు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రపంచ సరుకుల ఎగుమతులలో మన వాటా 2014లో 1.69% ఉంటే 2021 నాటికి 1.77% మాత్రమే పెరిగింది.
నత్తనడకన భారీ ప్రాజెక్టులు
దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో భారీ ప్రాజెక్టులు ఇప్పటికీ నత్తనడ కనే సాగుతున్నాయి. బులెట్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌ అయితే ఇంకా పట్టాలు ఎక్కనే లేదు.
ఎఫ్‌డీఐలు పెరిగినా…
మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (ఎఫ్‌డీఐలు) పెరుగుదల కన్పించింది. 2014-15లో 45 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు 2021-22 నాటికి 84.83 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అయితే 2022-23లో మన దేశానికి 70 బిలియన్‌ డాలర్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన, స్వచ్ఛభారత్‌ మిషన్‌, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల యోజన, పీఎం ముద్ర యోజన, పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన వంటి పలు పథకాలు ప్రవేశపెట్టినా అవి పేదల బతుకులను ఏ మాత్రం మార్చలేకపోయాయనే చెప్పాలి.
విద్య పైనా చిన్నచూపే
విద్యా రంగాన్ని కూడా మోడీ సర్కారు చిన్నచూపు చూస్తోంది. నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పు కుంటున్నప్పటికీ గత తొమ్మిది సంవత్సరాలలో జీడీపీలో విద్యా రంగంపై పెట్టిన వ్యయం 2.8%-2.9% దాటలేదు.
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కరువు
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేరుతున్న లబ్దిదారుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. అయితే ఇది సానుకూల సంకేతమేమీ కాదు. గ్రామీణ ప్రాంత ప్రజలకు చేయడానికి తగిన పనేమీ లభించకపోవడం వల్లనే తప్పనిసరి పరిస్థితులలో ఈ పథకంలో చేరుతున్నారు. 2014-15లో 4.14 కోట్ల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకోగా ఆ సంఖ్య 2020-21 నాటికి 7.25 కోట్లకు చేరింది. గత సంవత్సరం 6.18 కోట్ల కుటుంబాలు ఈ పథకం కింద లబ్ది పొందాయి.

Spread the love