స్త్రీ జననేంద్రియ వైకల్యం గురించి ఎంత మందికి తెలుసు? ఇప్పుడు ఐక్యరాజ్య సమితి స్త్రీ జననేంద్రియ వైకల్యాన్ని ఇక సహించేది లేదని, 2030 నాటికి అసలు ఆ పద్ధతే తుడిచిపెట్టుకుపోవాలని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఫిబ్రవరి 6వ తేదీ అంతర్జాతీయ స్త్రీ జననేంద్రియ వైకల్య నిరోధక దినంగా ప్రకటించింది. ఈ సందర్భంగా భారతీయ సమాజంలో, అందులోనూ తెలుగు రాష్ట్రాలలో ఇందుకు సంబంధించిన కొంత అవగాహన పెంచాలనే ఉద్దేశ్యంతో ఈ వ్యాసం అందిస్తున్నాం.
సున్తీ, ఖత్నా… ఇటువంటి పదాలు ఎప్పుడైనా విన్నారా? ముస్లిం సమాజంలో వినిపించే పేర్లు ఇవి. మానవ జననేంద్రియ వ్యవస్థలపై అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ వ్యాసంలో చెప్పబోయే అంశాలపై కచ్చితంగా అవగాహన ఉంటుంది. పురుష జననేంద్రియ వ్యవస్థ వేరు. స్త్రీ జననేంద్రియ వ్యవస్థ వేరు. ఇప్పటిదాకా చాలామంది విన్నది కేవలం పురుషులకు మాత్రమే సున్తీ లేదా ఖత్నా ముఖ్యమని. ఈ విధానం ద్వారా జననాంగంపై ఉన్న అదనపు చర్మాన్ని కత్తిరిస్తారు. ఇది ముస్లిం వర్గాల్లో కచ్చితంగా చేస్తారు. కత్తిరించిన గాయం మానేదాకా బలవర్థకమైన ఆహారం అందించి, మానిన తరువాత దావత్ చేస్తారు. దీనిని ఇస్లామ్‌లో ‘సున్నత్’గా పరిగణిస్తారు. ఎవరైనా ముస్లింగా మారాలంటే పురుషులు కచ్చితంగా సున్తీ చేయించుకోవలిసిందే. అప్పుడే వారికి ముస్లింగా గుర్తింపు లభిస్తుంది. అబ్బాయిలకు సున్తీ చేయడం ద్వారా సుఖవ్యాధులు సోకే ప్రమాదం తగ్గుతుందని వైద్యులు సైతం ధృవీకరిస్తున్నారు. భవిష్యత్తులో లైంగిక సమస్యలు ఎదుర్కొనకుండా ఉండేందుకు సున్తీ సురక్షితమని తమ వద్దకు వచ్చే రోగులకు సలహాలు ఇస్తున్నారు. ఇదంతా ఒక కోణమైతే మహిళలకు కూడా ఖత్నా చేయడాన్ని ‘సున్నత్’గా భావించే కొన్ని తెగలు ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన ఆందోళన అంతా ఆ తెగల గురించే.

ఎవరీ దావూదీ బొహ్రాలు
బొహ్రా అనే పదం గుజరాతీ నుంచి వచ్చింది. వొహ్రువు/ వ్యవహార్ అనే పదాల నుంచి ఉద్భవించిన పదం ఇది. వ్యాపారం చేయడం, వ్యాపారి అని దీనికి అర్థం. ఈ సమాజానికి చెందిన వారు చారిత్రకంగా వ్యాపారం, వ్యాపార వృత్తులు చేసేవారు. మనదేశంలో గుజరాత్, ముంబై ప్రాంతాల్లో ఈ సమాజానికి మంచి గుర్తింపు ఉంది. వీరు వ్యాపారం, విద్యలతోపాటు సమాజ సేవలోనూ ముందు ఉంటారు. దావూదీ బొహ్రా సమాజంలో షియా శాఖకు చెందిన ఇస్మాయిలీ ఉపశాఖలో ఒక భాగం. వారి ఆచారాలు సాంస్కృతిక, మతపరమైన, సామాజికాంశాలుగా మిళితమై ఉంటాయి. ఈ ఆచారాలను ఫాతిమిద్ ఇమామ్‌ల మూలాలను కలిగి ఉన్నారు. అలాగే గుజరాతీ, అరబిక్, యెమెనీ సంస్కృతుల సమ్మేళనంగా చెప్పవచ్చు. ఈజిప్ట్‌లో కైరో, అల్-అజ్హర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించినవారే ఈ ఫాతిమిద్ ఇమామ్‌లు. బొహ్రాలు 1067లో యెమెన్ నుంచి భారత్‌లోని గుజరాత్‌కు వచ్చారు. 1597లో విభజన తరువాత దావూద్ బిన్ కుతుబ్‌షా అనుచరులు ఈ సముదాయాన్ని ఏర్పరిచారు. వీరికి సంబంధించిన ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
జనాభా
బొహ్రాలు ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది జనాభా ఉంటారని ఒక అంచనా. భారత్‌లో గుజరాత్, మహారాష్ట్రలలో వ్యాపించి ఉన్నారు. పాకిస్తాన్, యెమెన్, తూర్పు ఆఫ్రికా, యూరప్, అమెరికా తదితర 40కి పైగా దేశాలలో వీరి జనాభా విస్తరించి ఉంది. వీరి ఆధ్యాత్మిక నాయకుడిని అల్-దాయి-ముత్లఖ్ అంటారు. ప్రస్తుతం సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ 53వ దాయిగా కొనసాగుతున్నారు. వారు భారత్‌కు చేరి 450 సంవత్సరాలు గడవడంతో గుజరాతీ ఆధారిత భాష మాట్లాడతారు. ఆ భాషను లిసాన్ అద్-దావత్ అని పిలుస్తున్నారు. అరబిక్, ఉర్దూ, పర్షియన్‌ల మిశ్రమమే ఈ లిసాన్-అద్-దావత్.
ఆహార్యం
బొహ్రా వారి సమూహం మిగతా ముస్లింలకంటే భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం జనాభాలో సున్నీ తెగకు చెందినవారు 90శాతం ఉంటే మిగతా 10 శాతం షియాకు చెందినవారు. సాధారణంగా ముస్లింలలో నిరుపేదలు ఎక్కువగా కనిపిస్తుంటారు. బొహ్రాలు మటుకు విద్య, వ్యాపారాలతో సుసంపన్నంగా కనిపిస్తారు. వారి సమూహాలు హైదరాబాద్‌లోనూ కనిపిస్తూనే ఉంటాయి. వారిలో పురుషులు తెల్లటి కుర్తా, పైజామా, టోపీ ధరిస్తే, మహిళలు రంగురంగుల రిదా ధరిస్తారు. సాధారణ భాషలో చెప్పాలంటే ముస్లిం మహిళలు ధరించే నల్లటి బుర్ఖాను వీరు ఎంతో అందమైన రంగుల్లో, పూల డిజైన్లలో ధరిస్తారు. దాని పేరు రిదా.

జనాభా తక్కువ-సమస్య ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా పది లక్షలు మాత్రమే ఉన్న జనాభాలో ఐక్యరాజ్య సమితి గుర్తించి సంస్కరణలు తీసుకురావల్సిన అవసరం ఏముంది? బొహ్రా సముదాయం పది లక్షలు ఉండొచ్చు అని ఇదమిత్థంగా ఒక అంచనాకు వస్తే అందులో సుమారు 50శాతం జనాభా మహిళలు ఉండొచ్చని నిపుణుల అంచనా. అంటే అయిదు లక్షల మంది ఆడవారు ఉండొచ్చు. వీరిలో 75 నుంచి 85శాతం మంది ఖత్నాకు గురయ్యారు. గురవుతున్నారు. పురుషులకు మాత్రమే చేసే ఖత్నా/ సున్తీ సంప్రదాయం బొహ్రా సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది. ముస్లింలలోని ఇతర సమూహాల్లో అక్కడక్కడా కనిపించినా బొహ్రాలు మటుకు కచ్చితంగా ఆడపిల్లలకు ఖత్నా చేయడానికి ఆధ్యాత్మికతను జోడించి ఆచారంగా వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లలకు చేసే ఖత్నాను తహారా అని కూడా పిలుస్తారు. ప్రధాన సున్నీ సంప్రదాయంలో ఈ ఆచారం లేదు. షియాలలోనూ చాలామంది ఈ ఆచారాన్ని అనుమతించరు. నిజానికి ఖురాన్‌లో, హదీసులలో ఇందుకు సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ బొహ్రాలు దీనిని ఆచరించడానికే మొగ్గు చూపుతున్నారు.
ఇంతకీ ఖత్నా అంటే ఏమిటి?
ఆడపిల్లలకు ఖత్నా చేయడం అంటే జననేంద్రియంలోని క్లిటోరిస్‌ను తొలగించడం. దీనికి వీరు ఎన్నెన్ని పర్యాయపదాలు వాడినప్పటికీ యుక్తవయసులో కలిగే లైంగిక వాంఛల నుంచి వారిని దూరం చేయడానికే చేస్తున్న ఒక దురాచారం. వైద్య సదుపాయాలు లేని రోజుల్లో నాటు పద్ధతుల్లో దానిని తొలగించేవారు. ఇప్పుడు వైద్యాభివృద్ధి ఇంతగా ఉన్నప్పటికీ ఆడపిల్లలకు ఖత్నా చేయరాదనే నిబంధనతో వైద్యులు నిరాకరిస్తుండటంతో ఇప్పటికే అవే మోటు పద్ధతులను అనుసరిస్తున్నారు. దీని ద్వారా ఆడపిల్లలు పక్కదారి పట్టకుండా కాపాడుతున్నామని, ఇది అల్లా ఆదేశమని చెబుతుంటారు. కచ్చితంగా చెప్పాలంటే ఇది స్త్రీల లైంగికతను అణచివేయడమే. పైగా ఖత్నా చేసిన భార్యతో లైంగిక ఆనందం పొందలేకపోతున్నామని చెబుతూ పురుషులే పక్కదార్లు పడుతున్న ఉదాహరణలు కోకొల్లలు.

ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్
ఆడపిల్లలకు ఖత్నా అంటే ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్. దీనిని వైద్య పరిభాషలో ఎఫ్‌జిఎమ్‌గా వ్యవహరిస్తున్నారు. ఎఫ్‌జిఎమ్ అనేది మహిళలు, బాలికల బాహ్య జననేంద్రియాలను తొలగించడం. లేదా పూర్తిగా తొలగించడం. లేదా గాయపరచడం. శతాబ్దాలుగా ఆడవారు ఈ అత్యాచారానికి గురవుతున్నారు. ఇప్పటిదాకా 230 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఈ ఆచారానికి బలయ్యారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ఆసియా దేశాలలో ఈ దురాచారం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్‌జిఎమ్‌ను నాలుగు రకాలుగా వర్గీకరిస్తుంది. క్లిటోరల్ గ్లాన్స్ లేదా ప్రీవ్యూస్ తొలగించడాన్ని టైప్ 1గా, క్లిటోరల్ గ్లాన్స్, లాబియా మినోరా తొలగించడాన్ని టైప్ 2గా, ఇన్ఫిబ్యులేషన్ – వజైనల్ ఓపెనింగ్‌ను సంకుచితం చేయడాన్ని టైప్ 3గా, ఇతర హానికరమైన ప్రక్రియలు అంటే ప్రిక్కింగ్ లేదా స్క్రాపింగ్‌ను టైప్ 4గా గుర్తించింది.
ఈ దురాచారం కొనసాగకుండా…
ఈ వ్యవహారం బయటి ప్రపంచానికి తెలియకుండా జరిగేందుకు చాలామంది టైప్ 4నే అనుసరిస్తున్నారని అంచనా. వీరు ధనవంతులైనప్పటికీ, విద్యావంతులైనప్పటికీ, వ్యాపారస్తులు అయినప్పటికీ ఇంకా పాత కాలంనాటి ప్రమాదకరమైన వ్యవహారాన్ని ఆచరించడానికి ఏమాత్రం వెనకడుగు వేయడంలేదు. పైగా దీని వల్ల నష్టమే తప్ప ఎటువంటి ఉపయోగం లేదని వైద్య నిపుణులు తేటతెల్లం చేశారు. ఈ దురాచారం కొనసాగకుండా పూర్తిగా రూపుమాపేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకొచ్చింది. 2030నాటికల్లా దీనిని అంతం చేయడమే ధ్యేయంగా పని చేస్తుంది.
మతపరమైన ఆదేశంగా
ఎఫ్‌జిఎమ్ వలన మహిళలకు భవిష్యత్తులో అనేక అనారోగ్య సంభవిస్తాయి. దావూదీ బొహ్రాలు అందరిలా ఇస్లామిక్ మూల సిద్ధాంతాలనే అనుసరిస్తారు. వీరి విశ్వాసం ఇమామ్‌లపైనే ఆధారపడి ఉంటుంది. వారి నాయకుడు అల్-దాయి-ముత్లక్ ముందు యుక్తవయస్సులో ఉన్న 13ఏళ్ల ఆడ పిల్లలను, 14-15 సంవత్సరాల మగ పిల్లలకు దైవానికి కట్టుబడి ఉంటామనేలా ఒప్పందం చేస్తారు. దీనిని మతపరమైన ఆదేశంగా భావించి తప్పక ఆచారించాలనే పురుషస్వామ్య వ్యవస్థ నిర్ధారిస్తుంది. ఈ వ్యవహారాన్ని బాలికలను కౌమార దశకు ఆహ్వానంగా భావిస్తున్నట్లు కొందరు బొహ్రాలు అభిప్రాయపడుతున్నారు. ఖత్నా చేయని స్త్రీలు మతపరమైన ఉత్సవాలలో పాల్గొనలేరని, వధువులకు దురదృష్టం తెస్తారని నమ్ముతారు.
లాభం లేకపోగా నష్టాలే అధికం
నిజానికి మహిళలకు ఖత్నా చేయడం ద్వారా ఎటువంటి లాభాలు లేవు. పైగా నష్టాలు అధికంగా ఉన్నాయి. టీనేజ్‌లోకి అడుగుడుతున్న ఆడపిల్లకు ఇదో భయానక అనుభవం. గాయాలు, భయం, సిగ్గు, అపరాధ భావన, ఒంటరితనం తదితర అంశాలు ఆమె భావి జీవితాన్ని నరకప్రాయం చేస్తాయి. ఒకరకంగా చెప్పాలంటే ఇది భద్రత, శారీరక సమగ్రత, జీవిత హక్కుల ఉల్లంఘన. శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం ఖత్నా వలన వస్తున్న ఆరోగ్య సమస్యల కోసం 1.4 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతున్నాయి. ఖత్నా చేసినప్పుడు బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. విపరీతమైన నొప్పి, అధిక రక్తస్రావం, జననేంద్రియాల కణజాలం వాపుకు గురికావడం, జ్వరం, మూత్ర సమస్యలు, గాయాలు బాగు చేయలేకపోవడం, షాక్, సెప్టిక్ షాక్‌కు గురవడం వంటివి అన్నీ జీవితానికి ముప్పు కలిగించేవే. ఇది బాలికలకు భావోద్వేగపరమైన నష్టం కలిగిస్తుంది. తీవ్రమైన ట్రామాలో ఉండిపోతారు. మూత్ర సమస్యలు జీవితకాలం ఉండిపోతాయి. మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి, రుతుస్రావం సమయంలో నొప్పి, స్కార్ టిష్యూ, కెలాయిడ్ ఏర్పడటం, సంభోగ సమయంలో నొప్పి, అసంతృప్తి, ప్రసవ సమయంలో తప్పనిసరిగా సిజేరియన్ అవసరం ఏర్పడటం, తల్లీ బిడ్డల మరణాలు, నవజాత శిశు మరణాల రేటు పెరగటం తదితర సమస్యలు ఎక్కువగా ఉన్నాయి.
జీవిత కాలం ప్రభావితం చేస్తాయి
ఆరోగ్యకరమైన జననేంద్రియ కణజాలాన్ని తొలగించడం వలన శరీర సహజ క్రియలు దెబ్బతింటాయని ఇటీవలి నివేదికలలో వెల్లడైంది. కణతులు ఏర్పడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, కణజాలం దెబ్బతినడం వంటి సమస్యలు ఇతర మహిళలకంటే రెండు రెట్లు అధికంగా ఉంటుంది. టైప్ 1, టైప్ 2 విధానాల వలన సమస్యలు 9 రెట్లు అధికంగా వస్తాయట. ప్రసవం తరువాత పెరినియల్ టియర్స్ 2.2 రెట్లు, ఆసుపత్రిలో ఉండాల్సిన అత్యవసరం 2.8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్, యాంక్జైటీ, పోస్ట్-ట్రామటిక్ స్ట్రెస్ డిసార్డర్ (పిటిఎస్‌డి), లో సెల్ఫ్-ఎస్టీమ్ వంటివి వీరిలో సర్వసాధారణం. ఇవి జీవిత కాలం ప్రభావితం చేసే సమస్యలు.
అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
ఒక స్టడీ ప్రకారం ఎఫ్‌జిఎమ్ చేసిన వారికి మానసిక ఆరోగ్య సమస్యలు అన్ని కోణాలలో ప్రభావితం చేస్తాయి. ఏటా 44,320 అదనపు మరణాలు సంభవిస్తున్నాయని ఒక అంచనా. ఇది అయిదు సంవత్సరాల మరణరేటును 0.075శాతానికి పెంచుతుంది. బాలికలు, యువతుల మరణాలకు ప్రధాన కారణం ఎంటరిక్ ఇన్ఫెక్షన్లు, శ్వాస సంబంధిత సమస్యలు, మలేరియాకు గురవటం ఎక్కువగా కనిపిస్తుంది. 15 సంవత్సరాల బాలిక జీవిత కాలంలో 0.23 సంవత్సరాల జీవితాన్ని కోల్పోతుంది. సగటున మహిళలు 0.07 సంవత్సరాల వయసును పొగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం 68 మిలియన్ల మంది బాలికలు 2030నాటికి ఖత్నా దురాచారం అంచున ఉంటారని డబ్ల్యుహెచ్‌ఓ అంచనా వేసింది.
చట్టాలు ఏం చెప్తున్నాయి?
ఎఫ్‌జిఎమ్‌ను హానికరమైన విధానంగా గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. దీనిని మానవ హక్కుల ఉల్లంఘనగా చూస్తుంది. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు తమ వద్దకు వచ్చిన వారికి ఈ విషయంపట్ల అవగాహన పెంచాలని పిలుపునిచ్చింది. ఆడపిల్లలకు ఖత్నా చేయాలని వారి తల్లిదండ్రులు ఎంత ఒత్తిడి చేసినా దీనిని పూర్తిగా వ్యతిరేకించాల్సిందేనని స్పష్టం చేసింది. దీనిని చట్టబద్దం చేయాలనే యోచనలో ఉన్నట్లు డబ్ల్యుహెచ్‌ఓ ప్రకటించింది. ఇందుకోసం ప్రివెన్షన్, కాంప్లికేషన్స్ మేనేజ్‌మెంట్, కంట్రీ ఇంప్లిమెంటేషన్ తదితరమైనవాటిని ముఖ్యమైన అంశాలుగా భావిస్తున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఇంటర్ ఏజెన్సీ స్టేట్‌మెంట్స్, గైడ్‌లైన్స్‌ను అభివృద్ధి చేసింది. 2008 వరల్డ్ హెల్త్ అసెంబ్లీ రెసల్యూషన్ (డబ్ల్యుహెచ్‌ఎ 61.16) ప్రకారం ఆరోగ్యం, విద్య, ఆర్థిక స్థిరత్వం, న్యాయం, మహిళా విభాగాలలో పని చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతుంది. దీని ప్రకారం ఆయా దేశాలు ఆడపిల్లలకు చేసే ఖత్నా నిరోధక చర్యలు చేపట్టాలని, అప్పుడే ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆచారం సమూలంగా నశించి పోతుందని మానవహక్కుల కార్యకర్తలు భావిస్తున్నారు. అలాగే మానవ హక్కులు, ఆరోగ్య సమానత్వం మాత్రమే ప్రపంచాన్ని ముందుకు తీసుకువెళ్లేలా చేస్తాయని నిపుణులు అంచనావేస్తున్నారు.
– నస్రీన్ ఖాన్
9652432981



