Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపేదలకు పింఛన్లు ఇచ్చే వరకు పోరాటం

పేదలకు పింఛన్లు ఇచ్చే వరకు పోరాటం

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌
మేడ్చల్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

నవతెలంగాణ-కీసర
అర్హులైన పేదలందరికీ పింఛన్లు ఇచ్చే వరకు సీపీఐ(ఎం) పోరాటం చేస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు భాస్కర్‌ అన్నారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేండ్లు పూర్తయినా వాగ్దానాలను అమలు పరచడంలో విఫలమైందన్నారు. కొత్త ఆసరా పింఛన్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. తక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్లు ఇవ్వాలని, పింఛన్‌ డబ్బులను పెంచాలని డిమాండ్‌ చేశారు. ఆరు గ్యారెంటీల కోసం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు తీసుకున్నారని, వాటిని అమలు చేయకుండా ప్రజా పాలన పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, రేషన్‌ కార్డులు, గృహజ్యోతి, మహాలక్ష్మి తదితర పథకాల కోసం 9.2 లక్షల మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారన్నారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆసరా పింఛన్ల అమలులో తీవ్ర లోపం జరుగుతోందన్నారు. పారిశ్రామిక కార్మికులు, పేదలందరికీ ఆసరా పెన్షన్‌లు ఇవ్వాలని కోరారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వికలాంగుల పింఛన్‌ రూ.6,000, ఇతర పింఛన్లు రూ.4,000కు పెంచుతామని కాంగ్రెస్‌ చేసిన వాగ్దానం ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఏపీలో వికలాంగులకు రూ.6000, ఇతరులకు రూ.4000 పింఛన్‌ ఇస్తున్నారని గుర్తు చేశారు. వాగ్దానాలు అమలు చేయాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి సచివాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ విజేందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జె.చంద్రశేఖర్‌, కోమటి రవి, ఏ.అశోక్‌, ఏం.వినోద, మీసాల శ్రీనివాస్‌, ఐ.రాజశేఖర్‌, నాయకులు ఎన్‌.శ్రీనివాస్‌, రాథోడ్‌ సంతోష్‌, లింగస్వామి, నరేష్‌, లక్ష్మణ్‌, సబిత, ఎం.శంకర్‌, గణేష్‌, మంగ, స్వామి, రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -