మోడీ సర్కార్‌వి దుర్మార్గ చట్టాలు
ఉత్తరాది నుంచి సీపీఐ(ఎం) ”జన్ ఆక్రోశ్” జాతాలు షురూ…మార్చి 24 న ఢిల్లీలో ర్యాలీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 24న ఢిల్లీలో సీపీఐ(ఎం) నిర్వహించే ”జన్ ఆక్రోశ్” జాతాలు ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. మార్చి 8న జమ్మూ కాశ్మీర్ నుంచి జార్ఖండ్ వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో జాతాలు ప్రారంభమయ్యాయి. రాజస్తాన్‌లో కూడా ఫిబ్రవరి చివరి వారంలో జన్ ఆక్రోశ్ జాతా ప్రారంభమైంది. బీజేపీ ప్రభుత్వ విధానాలైన లేబర్ కోడ్‌ల అమలు, ఉపాధి హామీ చట్టాన్ని దెబ్బతీయడం, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన బిల్లు, అమెరికాతో వాణిజ్య ఒప్పందం వంటి వాటికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ర్యాలీ నిర్వహించనుంది. జాతాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
ఉత్తర భారతదేశంలోని గ్రామాలు, పని ప్రదేశాలకు చేరుకునే జాతాలకు ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతారు. రాజస్తాన్‌లో జరిగే జాతాకు పొలిట్‌బ్యూరో సభ్యులు, ఎంపీ అమ్రా రామ్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న శ్రీ గంగానగర్ జిల్లాలోని అనుప్‌గఢ్ నుంచి ప్రారంభమైన ఈ మార్చ్ మార్చి 23 వరకు కొనసాగుతుంది. బీహార్‌లో ఐదు గ్రూపులుగా ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించనున్నారు. ఈ మార్చ్‌కు పొలిట్ బ్యూరో సభ్యులు అశోక్ ధావ్లే, మరియం ధావ్లే, కేంద్ర కమిటీ సభ్యులు ఎఆర్ సింధు, విక్రమ్ సింగ్, బాదల్ సరోజ్ నాయకత్వం వహిస్తున్నారు. హర్యానాలో రెండు మార్చ్‌లు జరుగుతున్నాయి.
జార్ఖండ్‌లో రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్‌చంద్, సెక్రెటేరియట్ సభ్యుడు ఇంద్రజిత్ సింగ్ ఈ మార్చ్‌కు నాయకత్వం వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో మార్చ్‌కు సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు బృందా కరత్ నాయకత్వం వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహిస్తున్న జాతాకు సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు రాకేష్ సిన్హా, రాష్ట్ర కార్యదర్శి సంజయ్ చౌహాన్ నాయకత్వం వహిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లో ప్రారంభమైన మార్చ్‌కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ముహమ్మద్ అబ్బాస్ రాథర్ ప్రారంభించారు. పంజాబ్‌లో మార్చ్‌కు పొలిట్ బ్యూరో సభ్యులు నీలోత్పల్ బసు నాయకత్వం వహిస్తున్నారు.



