గాజాలో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండ ప్రస్తుతానికి ఆగింది. ఇజ్రాయిల్, హమాస్ కాల్పుల విరమణకు తొలిదశ ఒప్పందాన్ని అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం నాడు ప్రకటించాడు. దీన్ని అన్ని పక్షాలూ నిర్ధారించినట్లు వార్తలు వచ్చాయి. బుధవారం రాత్రి కొన్ని చోట్ల వీధుల్లో ఎక్కడా జనసంచారం లేదని, తాత్కాలిక గుడారాల్లో పాలస్తీనియన్లు ప్రశాంతంగా నిద్రించినట్లు కొందరు జర్నలిస్టులు చెప్పారు. యావత్ సభ్య సమాజం ఇజ్రాయిల్ మీద తెచ్చిన తీవ్ర ఒత్తిడి ఫలితమే ఈ ఒప్పందం. అయితే ఇదే సమయంలో మరికొన్ని చోట్ల ఇజ్రాయిల్ మిలిటరీ జరిపిన దాడుల్లో గడిచిన 24 గంటల్లో పది మంది మరణించగా 49 మంది గాయపడినట్లు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎలాగూ వెనక్కు వెళుతున్నాం గదా దొరికినవారిని చంపేద్దామన్న దుష్ట ఆలోచన ఈ దుర్మార్గానికి ప్రేరేపించి ఉండవచ్చు.
యూదు దురహంకారులు ఈ ఒప్పందం పట్ల సానుకూలంగా లేరనే వైఖరిని కూడా ఇది వెల్లడిస్తున్నది.ముందు శాంతి కావాలని పాలస్తీనియన్లు తెచ్చిన ఒత్తిడి కూడా హమాస్ మీద పని చేసి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. ఈ సంప్రదింపుల్లో ప్రధాన మధ్యవర్తిగా ఉన్న కతార్ కూడా దీన్ని ధృవీకరించింది. ఆక్రమణ నుంచి వెనక్కు తగ్గటం, సహాయాన్ని అనుమతించటం, ఖైదీల మార్పిడికి ఒప్పందం కుదిరినట్లు హమాస్ కూడా బహిరంగ ప్రకటన చేసింది. గురువారం నాడు తమ మంత్రివర్గానికి వివరాలను నివేదించి అనుమతి తీసుకుంటానని ప్రధాని నెతన్యాహు చెప్పాడు.కొద్ది రోజుల క్రితం అమెరికా అధ్యక్ష భవనంలో ట్రంప్-నెతన్యాహు ఉమ్మడిగా నిర్వహించిన పత్రికా గోష్టిలో మాట్లాడినపుడే ఈ ఒప్పందం గురించి చెప్పారు. హమాస్ మెడమీద కత్తిపెట్టి అంగీకరించకపోతే వేటు వేస్తామని బెదిరించిన సంగతి కూడా తెలిసిందే.2023 అక్టోబరు ఏడు నంచి ఇప్పటివరకు యూదు ముష్కరుల మారణ కాండలో 67,183 మంది మరణించినట్లు, 1,69,841 మంది గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు.
మరికొన్ని వేల మంది శిధిలాల కింద మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. గాజా నుంచి ఉపసంహరించుకొనేది లేదని, పాలస్తీనా అధారిటీని అక్కడ అనుమతించేది లేదని, గాజారక్షణ, పాలనా బాధ్యతలను తామే పర్యవేక్షిస్తామంటూ ఇజ్రాయిల్, అక్కడి పౌరులను వేరేచోట్లకు తరలించి ఒక విహార కేంద్రంగా మారుస్తామని డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కుదిరిన ఒప్పందం వారి దుష్ట పథకాలు, వాంఛలకు వ్యతిరేకంగా ఉంది. భవిష్యత్‌లో హమస్‌కు పాత్ర లేకుండా చేస్తామని చెప్పిన అంశం మీద ఏం చేస్తారన్న ది చూడాల్సి ఉంది. ఒప్పందం పూర్తిగా అమలుచేయాలంటే మూడు, నాలుగేండ్లు పడుతుందని వచ్చిన వార్తలు సందేహాలకు అవకాశమిస్తున్నాయి. నెతన్యాహు మీద జనంలో, స్వపక్షంలో వ్యతిరేకత ఉందని గతంలోనే వార్తలు వచ్చాయి.
బందీల విడుదల జరిగి, ఒప్పందం అమల్లోకి వచ్చిన తరువాత మరోసారి గాజాపై దాడి కష్టమేనని, యూదు దురహంకారులకు మింగుడు పడని ఈ ఒప్పందం కుదుర్చుకున్నందుకు వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా నెగ్గుకు రాగలడనే ప్రశ్నలు తలెత్తాయి. మధ్యంతర ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. నిజానికి నెతన్యాహు వంటి దుర్మార్గుడు తిరిగి అధికారానికి వచ్చినా, రాకున్నా ప్రపంచానికి వచ్చే నష్టమేమీ ఉండదు. నిజంగా ఇజ్రాయిలీలు అతడిని అధికారానికి దూరం చేస్తే అలాంటి దుర్మార్గాలకు పాల్పడాలనే వారికి ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. ఒప్పందం వెనుక ఎవరి మీద ఎంత ఒత్తిడి పనిచేసింది, తదుపరి పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇజ్రాయిల్ మీద నమ్మకం లేని కారణంగా షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా ఎవరికి వారు మినహాయింపులతో అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
మార్చి నెలలో కుదిరిన ఒప్పందాన్ని ఏకపక్షంగా ఇజ్రాయిల్ ఉల్లంఘించింది, అయినప్పటికీ అమెరికా వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోగా హమాస్ మీదనే ఒత్తిడిని పెంచింది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ ఒప్పందాన్ని సక్రమంగా అమలు జరుపుతుందా అనే అనుమానాలు లేకపోలేదు. కుదిరిన అవగాహన ప్రకారం నాలుగు రోజుల్లో హమాస్ తన దగ్గర ఉన్న బందీలలో సజీవులుగా ఉన్నవారిని, మరణించిన వారి భౌతిక కాయాలను అందచేసిన తరువాత తిరిగి నెతన్యాహు దాడులను ప్రారంభిస్తే ఏమిటన్నది ప్రశ్న. అదే జరిగితే ఇజ్రాయిల్ దాడులు, నిర్బంధాల మధ్య పుట్టి పెరిగి మరణిస్తూ దశాబ్దాల తరబడి మాతృదేశం కోసం సాగిస్తున్న పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటం మినహా పాలస్తీని యన్లకు మరోదారి లేదు. ఎన్ని సందేహాలు ఉన్నప్పటికీ గాజాలో మారణకాండ నిలిపివేతకు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని యావత్ ప్రపంచం ఆహ్వానిస్తున్నది.
ఎట్టకేలకు..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES