Saturday, May 17, 2025
Homeప్రధాన వార్తలుమహిళలకు ఆర్థిక స్వావలంబన

మహిళలకు ఆర్థిక స్వావలంబన

- Advertisement -

– రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రణాళికలు
– పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో ఐదు మహిళా పెట్రోల్‌ బంకులు
– రూ.2 కోట్ల వ్యయంతో సంగారెడ్డిలో నిర్మాణం పూర్తి
– సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు నిత్యావసరాలు, కాస్మోటిక్స్‌ సరఫరా బాధ్యతలు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం వ్యాపార రంగంలో రాణించేందుకు వీలుగా భారీ ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మహిళా సమాఖ్యలు వ్యాపారాలు చేసేందుకు జిల్లా కేంద్రాల్లో వాణిజ్య భవన సముదాయాల్ని సమకూర్చింది. ముందుగా మహిళా శక్తి పథకం కింద తొలిసారిగా మహిళా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయబోతుంది. పైలెట్‌ ప్రాజెక్టుగా సంగారెడ్డి జిల్లాలో 5 పెట్రోల్‌ బంకుల ఏర్పాటు కోసం కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సంగారెడ్డిలో బంకు నిర్మాణం పూర్తయ్యింది. సీఎం రేవంత్‌రెడ్డి మరో అడుగుముందుకేసి రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టల్స్‌తో పాటు గురుకులాలకు కూడా విద్యార్థులకు అవసరమైన నిత్యావసరాలు, కాస్మోటిక్స్‌్‌ను సరఫరా చేసే అవకాశాన్ని మహిళా సంఘాలకు అప్పజెప్పాలని నిర్ణయించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు హాస్టళ్లు, గురుకులాలకు అవసరమైన నిత్యావసర సరుకుల్ని స్వయం సహాయక మహిళా సంఘాలు సరఫరా చేసేందుకు వీలుగా సెర్ప్‌ ఉన్నతాధి కారులు ప్రణాళికలు రూపొంది స్తున్నారు. స్వయం సహాయక మహిళా సంఘాల పనితీరు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వ్యక్తిగత పొదుపు, రుణాల చెల్లింపు విషయంలో వందకు వంద శాతం సక్సెస్‌ సాధిస్తున్నాయన్న పేరుంది. బ్యాం కుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల్లో మహిళా సంఘాలే నెంబర్‌ వన్‌గా నిలుస్తున్నాయి. బ్యాంకు రుణాలు పొందిన మహిళలు ఇప్పటి వరకు చిరు వ్యాపారాలకే పరిమితమయ్యారు. ఎస్‌హెచ్‌జీ సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా కొన్ని నిర్ణయాలు చేసింది. మహిళా సంఘాలను పెద్ద పెద్ద వ్యాపారాల్లోనూ రాణించేందుకు వీలుగా రాష్ట్రంలో తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు కింద సంగారెడ్డి, జహీరాబాద్‌, పటాన్‌చెరు, ఆందోల్‌, నారాయణఖేడ్‌ పట్టణాల్లో 5 మహిళా పెట్రోల్‌ బంకులను ఏర్పాటు చేయబోతుంది. తొలుత సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బైపాస్‌ రోడ్లులో ఉన్న పాత వెలుగు కార్యాలయం ఆవరణలో 8 గుంటల స్థలాన్ని కేటాయించారు. గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పెట్రోల్‌ బంక్‌ను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు పనులు పూర్తి చేస్తున్నారు. మిగతా నాలుగు కేంద్రాల్లోనూ మహిళా సమాఖ్యలకు పెట్రోల్‌ బంకుల కోసం స్థల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టణ కేంద్రాల్లో జన సమూహం ఉన్న.. పక్కన పెట్రోల్‌ బంకుల్లేని ఏరియాల్లో ప్రభుత్వ స్థలాల్ని సేకరిస్తున్నారు. పెట్రోల్‌ బంకుల వ్యాపారం, నిర్వహణ పెద్ద పెద్ద వ్యాపారులే చేశారు. కొంత కాలంగా జైళ్లు, పోలీస్‌ బెటాలియన్లు, జిల్లా కేంద్రం పోలీస్‌ విభాగం ఆధ్వర్యంలోనే పెట్రోల్‌ బంకుల నిర్వహణ చేస్తున్నాయి. ఇక నుంచి మహిళా పెట్రోల్‌ బంకులు కూడా రానున్నాయి. సంగారెడ్డిలో ఐఓసీఎల్‌తో 20 ఏండ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. బంక్‌ నిర్వహణ కోసం 15-20 మంది టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదివిన యువతులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. బంకు పక్కనే వాణిజ్య భవన సముదాయాన్ని నిర్మించి మహిళా సమాఖ్యకు కేటాయించడం వల్ల తక్కువ అద్దెలతో మహిళలు వ్యాపారాలు చేసుకుంటారనేది ప్రభుత్వం ఆలోచన.
హాస్టళ్లు, గురుకులాలకు
నిత్యవసరాల సరఫరా బాధ్యత
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు 2000 వరకు ఉన్నాయి. వీటిల్లో 3 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఐదు సొసైటీల పరిధిలో 1000 గురుకులాలున్నాయి. వీటిల్లోనూ మూడు లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన నిత్యావసరాలు, కాస్మోటిక్స్‌, ఇతర వస్తువుల్ని గుత్తేదార్లు సరఫరా చేస్తున్నారు. చాలా వరకు ముదిరిన కూరగాయలు, కుళ్లిన పండ్లు, నాణ్యతలేని పప్పులు, నూనెలు, గుడ్లు, చికెన్‌, మటన్‌ ఇతర వస్తువుల్ని సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దాంతో రాష్ట్రంలో వందలాది గురుకులాలు, హాస్టళ్లల్లో నాసిరకం వస్తువుల వల్ల ఫుడ్‌ పాయిజన్‌కు గురై ఈ ఏడాది 500 మంది వరకు ఆస్పత్రి పాలయ్యారు. ఈ పరిస్థితుల్లోనే విద్యార్థులకు నాణ్యమైన సరుకుల్ని అందించడంతో పాటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వనున్నట్టు ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సెర్ప్‌ సీఈఓ నేతృత్వంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మహిళలకు అప్పజెప్పడం వల్ల స్థానికంగా తాజా కూరగాయలు, పండ్లు అందనున్నాయి.కాస్మోటిక్స్‌ కోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అవసరమైన వస్తువుల్ని కొనుగోలు చేసుకునే వీలుంటదని ప్రభుత్వం భావిస్తుంది. అయితే విద్యార్థులకు కావాల్సిన ప్లేట్స్‌, గ్లాస్‌లు, బాక్సులు, టై, బెల్ట్స్‌, బకీట్లు, బూట్లు, స్పోర్ట్స్‌ డ్రెస్‌లకు మాత్రం రాష్ట్ర స్థాయిలో టెండర్లు పిలవనున్నారు.
త్వరలోనే పెట్రోల్‌ బంకు ప్రారంభం : జంగారెడ్డి, ఎపీడీ, డీఆర్‌డీఓ సంగారెడ్డి
సంగారెడ్డి బైపాస్‌ రోడ్డులో నిర్మించిన మహిళా పెట్రోల్‌ బంకును రాష్ట్ర మంత్రుల చేతుల మీదుగా త్వరలోనే ప్రారంభం కానుంది. రూ.2 కోట్ల వ్యయంతో బంకు నిర్మాణం పూర్తయ్యింది. ఐఓసీఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నందున మంచి వ్యాపారం సాగనుంది. మిగతా చోట్ల కూడా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -