సుమారు రూ.3 కోట్ల ఆస్తి నష్టం
నవతెలంగాణ-కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని శ్రీ సమర్థ్ కోటేక్స్ కాటన్ మిల్లులో ఆదివారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తి మిల్లు నుంచి మినీ ట్రాక్టర్ ద్వారా పత్తిని తరలిస్తున్న క్రమంలో ట్రాక్టరులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో ఫ్యాక్టరీలోకి క్షణాల్లో మంటలు వ్యాపించి చుట్టుపక్కల ఉన్న పత్తిని అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఖేడ్ డీఎస్‌పీ వెంకటరెడ్డి, కంగ్టి సీఐ, ఎస్‌ఐ.. పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును ఫ్యాక్టరీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కాగా, ఈ ప్రమాదంలో 3వేల టన్నులకు పైగా పత్తి కాలిపోయిందని, సుమారు రూ.3 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సంస్థ యజమాని తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.



