Wednesday, May 7, 2025
Homeక్రైమ్నాగోల్‌లో అగ్ని ప్రమాదం

నాగోల్‌లో అగ్ని ప్రమాదం

- Advertisement -

సాయినగర్‌ కాలనీలో సుమారు 30 గుడిసెలు దగ్ధం
బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే, మాజీ ఎంపీ
నవతెలంగాణ- నాగోల్‌

హైదరాబాద్‌ నాగోల్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాయినగర్‌ గుడిసెల కాలనీలో ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లే విద్యుత్‌ వైరు షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టమూ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గత వారం కుంట్లూరు లోనూ అగ్ని ప్రమాదం జరిగి పెద్దఎత్తున గుడిసెలు కాలిపోయిన విషయం విదితమే. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
సాయినగర్‌ గుడిసెల కాలనీలో మజీద్‌ సమీపంలో ఉదయం 11:30 గంటల సమయంలో ఒక గుడిసెపై విద్యుత్‌ వైర్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మండుతూ ఉంది. అది పెరుగుతుండటంతో పరిసర ప్రాంతాల వారు కేకలు వేస్తూ గుడిసెల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో గుడిసెకు మంటలు అంటుకుని ఇతర గుడిసెలకు వ్యాపించడంతో సుమారు 30 గుడిసెలు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో గుడిసెల్లోని వంటగ్యాస్‌ సిలిండర్లు పేలి మంటలు ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న నాగోల్‌ సీఐ ఏ.సూర్యనాయక్‌, పోలీసు సిబ్బంది, అగ్నిమాపక అధికారులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఫైర్‌ ఇంజన్లతో మంటలను ఆర్పారు. ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌, ఉప్పల్‌, మల్కాజిగిరి ఏసీపీలు, వివిధ పోలీస్‌ స్టేషన్ల సీఐలు ఎస్‌ఐలు, సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఏమాత్రం ఆలస్యం జరిగినా ప్రమాదం మరింత పెరిగిపోయే ఉండేదని స్థానికులు చెబుతు న్నారు. సకాలంలో అధికారులు స్పందించడం పట్ల ప్రాణ నష్టం తప్పిందని తెలిపారు. అగ్నిప్రమాదానికి గుడిసెల్లో నగదు, సరుకులు, బంగారు ఆభరణాలు, సర్టిఫికెట్లు కాలి పోయాయని బాధితులు కన్నీరు పెట్టుకున్నారు.
బాధితులకు ఎమ్మెల్యే, మాజీ ఎంపీ పరామర్శ
అగ్ని ప్రమాద బాధితులకు తక్షణమే రూ.50వేల ఆర్థిక సహాయం చేసి.. రూ.10 లక్షల నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అగ్ని ప్రమాద బాధితులను ఆయన పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుడిసెవాసులను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌, మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్‌ కూడా పరామర్శించారు. ప్రమాదంలో సర్వం కోల్పోయిన గుడిసె వాసులకు ఇందిరమ్మ ఇంటి పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం, పక్కా గృహాలు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు న్యాయం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. వ్యక్తిగతంగా బాధిత కుటుంబాలకు రూ.3వేల చొప్పున తక్షణ సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు తక్షణం రూ.6 వేల చొప్పున, బియ్యం అందించేందుకు కలెక్టర్‌, ఆర్డీవో, తహసీల్దార్‌ అంగీకరించారని తెలిపారు. కానీ రూ.12 వేల చొప్పున ఇవ్వాలని కలెక్టర్‌తో మాట్లాడినట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -