హరీశ్ రాణాకు ప్రాణాధార చికిత్సను తొలగించవచ్చన్న సుప్రీం
న్యూఢిల్లీ : దేశంలోనే తొలిసారిగా కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు బుధవారం ఆమోద ముద్ర వేసింది. సుదీర్ఘకాలంగా జీవచ్ఛవంలా మంచానికే పరిమితమైన 32ఏండ్ల హరీశ్ రాణాకు ప్రాణాధార చికిత్సనందించే వ్యవస్థను ఉపసంహరించేందుకు అంగీకరించింది. ఢిల్లీకి చెందిన రాణా గత 13ఏండ్లుగా కోమాలో వున్నాడు. చండీఘడ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతున్న రాణా 2013 ఆగస్టు 20న నాల్గవ అంతస్తు పైనుండి పడిపోవడంతో మెదడుకు గాయమై కోమాలోకి వెళ్లాడు. ఇప్పటివరకు ఆయనకు క్లినికల్లీ అసిస్టెడ్ న్యూట్రిషన్ అండ్ హైడ్రేషన్ (సీఏఎన్‌హెచ్)ను అందిస్తూ వచ్చారు. అయితే రాణా ఆరోగ్య పరిస్థితిలో ఎటువంటి మార్పు లేకపోవడంతో కారుణ్య మరణానికి ఆమోదించాలంటూ ఆయన తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. లైఫ్ సపోర్ట్ వ్యవస్థను ఉపసంహరించడమంటే రోగులను పరిత్యజించడమని కాదని జస్టిస్ జె.బి.పార్దివాలా, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. రోగులకు అత్యుత్తమమైన చికిత్సనందించే ఉద్దేశంతోనే ఈ లైఫ్ సపోర్ట్ వ్యవస్థనందిస్తారు.
కానీ ఈ కేసులో ఈ చికిత్స వల్ల రోగి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని నిర్ధారించినందువల్ల, పైగా రోగి తల్లిదండ్రులు కూడా అభ్యర్ధిస్తున్నందువల్ల న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. రాణా కుటుంబంతో సుదీర్ఘకాలం పాటు బెంచ్ సంప్రదింపులు, చర్చలు సాగించిన అనంతరం తీర్పు వెలువరించింది. అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యా భటి నేతృత్వంలోని బృందం రాణా నివాసానికి వెళ్ళి ప్రత్యక్ష సాక్షుల నివేదికను కోర్టుకు అందచేసింది. అనంతరం బెంచ్ కూడా వ్యక్తిగతంగా రాణా తల్లిదండ్రులను, తోబుట్టువులను కలిసి మాట్లాడింది. తమ కుమారుడిని ఇంక బాధ పెట్టకూడదని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కారుణ్య మరణం కోరే వ్యక్తికి నేరుగా ప్రాణం పోయేలా ఔషధాలు ఇవ్వకుండా, ఆ వ్యక్తికి అందే చికిత్సను నిలిపివేసి సహజ మరణాన్ని ప్రసాదించేందుకు కోర్టు నిబంధనలు రూపొందించింది. 2011లో అరణా షాన్‌బాగ్ కేసులో మొదటిసారిగా కారుణ్య మరణాన్ని భారత అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది.
దేశంలో తొలి కారుణ్య మరణానికి అనుమతి
- Advertisement -
- Advertisement -



