పెడబొబ్బలతో దద్దరిల్లిన హున్సా
హోలీ అనంతరం రెండు గ్రూపులుగా వీడిపోయి గుద్దుకున్న గ్రామస్తులు
తిలకించేందుకు తరలివచ్చిన చుట్టుపక్కల ఊర్ల జనం
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గ్రామస్తులంతా ఒక చోటకు చేరుకున్నారు. తాడుకు ఒక వైపు కొందరు, ఇంకో వైపు మరికొందరు నిలబడ్డారు. అనంతరం ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. అలా పది నిమిషాల పాటు సాగగా.. అనంతరం తాడు తొలగించగానే ఒకరినొకరు ఆలింగనం చేసుకొని వెళ్లిపోయారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సాలో బుధవారం పిడిగుద్దుల వర్షం కురిసింది. హున్సాలో హోలీ సంప్రదాయ ఆట రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచిన విషయం విధితమే. బుధవారం సైతం హోలీ అనంతరం హోరా హోరీగా సాగింది. హున్సా గ్రామంలో బుధవారం ముందుగా ఉదయం నుంచి హోలీ సంబరాలు, కుస్తీ పోటీలు నిర్వహించుకున్నారు.
సాయంత్రం 5 గంటల సమయంలో.. డప్పుల దరువులతో గ్రామంలోని కులపెద్దలను ఆట ఆడే క్రమంలో గ్రామ నడిబొడ్డుకు ఆహ్వానించారు. 15 నిమిషాల్లో ఊరందరూ అక్కడికి చేరుకున్నారు. చౌరస్తాలో ఇరువైపున పెద్ద దుంగలను కట్టి దానికి బలమైన తాడును కట్టారు. గ్రామస్తులు తాడుకు రెండు వైపులా చేరారు. ఒక్కసారిగా తాడును పట్టుకోగానే పిడిగిద్దులు గుద్దుకున్నారు. ఒకచేతితో తాడును పట్టుకొని మరో చేతితో ఎదుటి వ్యక్తులపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. అలా పది నిమిషాల పాటు సాగిన అనంతరం తాడును తొలగించగానే ఆట నిలిచిపోయింది. ఈ సందర్భంగా గ్రామస్తులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని వెళ్లిపోయారు. పలువురు గ్రామస్తులు గాయపడ్డట్టు సమాచారం. పిడిగుద్దులాటను చూసేందుకు చుట్టుపక్కన గ్రామస్తులతో పాటు మహారాష్ట్ర నుంచి వస్తుంటారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బోధన్ రూరల్ పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.



