– వారిలో అల్‌జజీరా సీనియర్ రిపోర్టర్ అనాస్ అల్-షరీఫ్
– ఆయనపై ‘ఉగ్రవాది’ ముద్ర వేసిన నెతన్యాహూ ప్రభుత్వం
– ఇజ్రాయిల్ దాడుల్లో ఇప్పటివరకు 200 మంది మీడియా సిబ్బంది మరణం
గాజా సిటీ : గాజాలో ఇజ్రాయిల్ సేనల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తాజాగా అల్ జజీరా ఛానల్‌లో పనిచేస్తున్న ఐదుగురు పాత్రికేయులు ఇజ్రాయిల్ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఓ ప్రముఖ రిపోర్టర్ సహా ఇద్దరు ప్రతినిధులు, ముగ్గురు కెమెరా సిబ్బంది ఉన్నారు. దాడిలో మరణించిన రిపోర్టర్ అనాస్ అల్-షరీఫ్‌ను ఉగ్రవాది అంటూ ఇజ్రాయిల్ ముద్ర వేసింది. అతనికి హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనీ, అందుకే ఆయన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేశామని తెలిపింది. గాజాలో విధినిర్వహణలో ఉన్న పాత్రికేయులను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. గాజాలో పాత్రికేయులు ఉంటున్న శిబిరంపై ఇజ్రాయిల్ జరిపిన దాడిలో ఈ ఐదుగురు చనిపోయారని ఖతార్‌కు చెందిన ప్రసార సంస్థ తెలిపింది. ఆసుపత్రి ప్రధాన ద్వారం బయట పాత్రికేయుల కోసం ఓ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై జరిగిన దాడిలోనే 28 సంవత్సరాల అల్-షరీఫ్ చనిపోయారు. ఈయన ఓ అరబిక్ కరస్పాండెంట్. ఉత్తర గాజా నుంచి ఆయన అనేక యుద్ధ వార్తలు అందించారు. ఇజ్రాయిల్ దాడిలో అల్-షరీఫ్‌తో పాటు తమ ప్రతినిధి మహమ్మద్ క్రీఖే, కెమెరా ఆపరేటర్లు ఇబ్రహీం జాహెర్, మహమ్మద్ నౌఫాల్, మొమెన్ అలీవా చనిపోయారని అల్ జజీరా ఛానల్ ధృవీకరించింది.
అల్-షరీఫ్ జర్నలిస్టుగా నటిస్తున్న ఉగ్రవాది అని ఇజ్రాయిల్ ఆరోపించింది. ‘ఉగ్రవాది అల్-షరీఫ్‌ను కొద్దిసేపటి క్రితం కాల్చి చంపాము. అతను అల్ జజీర్ నెట్‌వర్క్ కోసం జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు’ అని ఇజ్రాయిల్ సైన్యం టెలిగ్రామ్ సందేశాన్ని పంపింది. అతను హమాస్‌లో ఉగ్రవాద విభాగానికి అధిపతిగా పనిచేశాడని, ఇజ్రాయిల్ ప్రజలు, ఐడీఎఫ్ దళాలపై రాకెట్ దాడులకు వ్యూహకర్త అని తెలిపింది. పాత్రికేయుల శిబిరంపై జరిపిన దాడిని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ సమర్ధించారు. ఇజ్రాయిల్ దాడుల కారణంగా ఇప్పటివరకూ సుమారు 200 మంది మీడియా సిబ్బంది చనిపోయారు. అల్ జజీరా కోసం గాజాలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న పాత్రికేయుల్లో అల్-షరీఫ్ మంచి గుర్తింపు పొందారు. గాజాలో ఇజ్రాయిల్ దళాల ఆగడాలపై ఆయన క్రమం తప్ప కుండా ప్రతి రోజూ నివేదికలు పంపేవారు. చని పోవడానికి ముందు అల్-షరీఫ్ చివరిసారిగా ఇజ్రాయిల్ దాడులకు సంబంధించిన ఓ వీడియోను తన ఛానల్‌కు పంపారు. కమిటీ టూ ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (సీపీజే) అనే సంస్థ జూలైలో ఆయన రక్షణ కోసం ఓ ప్రకటన కూడా చేసింది. తాజా దాడిపై సీపీజే ఆందోళన వ్యక్తం చేసింది. విశ్వసనీయమైన ఆధారాలేవీ చూపకుండా జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్రవేసి చంపడం దారుణమని, పత్రికా స్వేచ్ఛపై ఆ దేశానికి ఏ మాత్రం గౌరవం లేదని విమర్శించింది. ఇజ్రాయిల్, అల్ జజీరా ఛానల్ మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది. ఇజ్రాయిల్‌లో ఆ ఛానల్‌ను నిషేధించారు. దాని కార్యాలయాలపై దాడులు చేశారు.
ఇజ్రాయిల్ దాడుల్లో ఐదుగురు జర్నలిస్టులు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES