Wednesday, July 16, 2025
E-PAPER
Homeమానవిబోనాల రుచులు

బోనాల రుచులు

- Advertisement -

తెలంగాణ పండుగలలో బోనాలు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. బోనాలకు పెట్టే నైవేద్యాలతో పాటు, ఇంటిల్లిపాదికీ కమ్మని విందు భోజనం చేయడం ఆనవాయితీ. ఈ బోనాల సందడిలో తప్పకుండా ఉండాల్సిన వంటకాలు కొన్ని ఉన్నాయి. నాటుకోడి కూర, పులిహౌర, దద్దోజనం, పొంగలి, చలివిడి ఇలా రకరకాల వంటకాలతో ఇండ్లన్నీ ఘుమఘుమలాడిపోతాయి. మరి మీ ఇంట్లో బోనాల పండుగ వాతావరణం మరింత సందడిగా మార్చే ఈ ప్రత్యేకమైన వంటకాలను ప్రయత్నించండి…
నాటుకోడి కూర
కావలసిన పదార్థాలు: నాటుకోడి మాంసం: కిలో (మధ్యస్థ ముక్కలుగా కోసి శుభ్రం చేయండి), ఉల్లిగడ్డ: పెద్దది ఒకటి(సన్నగా తరగాలి), పచ్చిమిర్చి: 4-5 (మధ్యకు చీల్చినవి), అల్లం వెల్లుల్లి పేస్ట్‌: రెండు టేబుల్‌ స్పూన్లు, కారం: రెండు మూడు టేబుల్‌ స్పూన్లు (మీ కారానికి తగ్గట్టు), పసుపు: టీస్పూను, ధనియాల పొడి: రెండు టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర పొడి: టీస్పూను, గరం మసాలా: టీస్పూను, కొబ్బరి పొడి/ఎండు కొబ్బరి తురుము: రెండు టేబుల్‌ స్పూన్లు (లేదా కొద్దిగా వేయించి పేస్ట్‌ చేసిన కొబ్బరి), నువ్వులు: టేబుల్‌ స్పూను (వేయించి పొడి చేసినవి), గసగసాలు: 1 టీస్పూన్‌ (నానబెట్టి పేస్ట్‌ చేసినవి), నూనె: మూడు నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, కరివేపాకు: కొద్దిగా, కొత్తిమీర: కొద్దిగా (తరిగినది, అలంకరణకు), నీళ్లు: తగినంత.
తయారీ విధానం: శుభ్రం చేసిన నాటుకోడి మాంసానికి టీస్పూన్‌ పసుపు, టేబుల్‌ స్పూన్‌ కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టండి. ఒక మందపాటి గిన్నె లేదా కుక్కర్‌ తీసుకుని నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక, సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు పసుపు, మిగిలిన కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపండి. సువాసన వచ్చే వరకు సుమారు నిమిషం పాటు వేయించండి. కొబ్బరి, నువ్వుల పేస్టు వేసి బాగా కలపండి. మరికొద్దిసేపు వేయించండి. మసాలాలో మ్యారినేట్‌ చేసిన నాటుకోడి మాంసాన్ని వేసి, మసాలా అంతా మాంసానికి పట్టేలా బాగా కలపండి. ఐదు నుండి ఏడు నిమిషాలు మీడియం మంటపై వేయించండి. మాంసం ముక్కలు మునిగే వరకు లేదా మీకు కావలసిన పులుసు చిక్కదనాన్ని బట్టి తగినంత నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు సర్దుబాటు చేయండి. ప్రెషర్‌ కుక్కర్‌ మూత పెట్టి ఐదు నుండి ఏడు విజిల్స్‌ వచ్చే వరకు లేదా మాంసం మెత్తబడే వరకు ఉడికించండి. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా సమయం పడుతుంది. ఈ నాటుకోడి పులుసును వేడి వేడి అన్నం, జొన్న రొట్టె లేదా సజ్జ రొట్టెతో వడ్డించండి. బోనాల పండుగకు ఇది చాలా బాగుంటుంది.


బొబ్బర్ల కూర
కావలసిన పదార్థాలు: బొబ్బర్లు: కప్పు, నూనె: రెండు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు: టీస్పూను, జీలకర్ర: టీస్పూను, ఎండుమిర్చి: రెండు మూడు, ఉల్లిగడ్డ: ఒకటి (సన్నగా తరిగినది), పచ్చిమిర్చి: రెండు మూడు (సన్నగా తరిగినవి), అల్లం-వెల్లుల్లి పేస్ట్‌: టీస్పూను, పసుపు: అర టీస్పూను, కారం: టీస్పూను (లేదా రుచికి తగినంత), ధనియాల పొడి: టీస్పూను, గరం మసాలా: అర టీస్పూను, ఉప్పు: రుచికి తగినంత, కొత్తిమీర: కొద్దిగా (సన్నగా తరిగినది), నీరు: ఒకటి రెండు కప్పులు
తయారీ విధానం: బొబ్బర్లను శుభ్రంగా కడిగి నాలుగైదు గంటల పాటు నానబెట్టాలి. స్టౌ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. పసుపు, కారం, ధనియాల పొడి వేసి వేయించాలి. నానబెట్టిన బొబ్బర్లు, ఉప్పు, నీరు వేసి బాగా కలిపి, మూత పెట్టి 20-25 నిమిషాలు లేదా బొబ్బర్లు మెత్తబడే వరకు ఉడికించాలి. చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి దించేయాలి. వేడి వేడిగా అన్నం లేదా చపాతీతో వడ్డించాలి.


పొంగలి
కావలసిన పదార్థాలు: బియ్యం – కప్పు, పెసర పప్పు – కప్పు, బెల్లం – రెండు కప్పులు, నీళ్ళు – నాలుగున్నర కప్పులు, జీడిపప్పు – పది, కిస్‌మిస్‌ – పది, ఎండుకొబ్బరి ముక్కలు – అర కప్పు, ఏలకుల పొడి – అర టీ స్పూను, నెయ్యి – అర కప్పు.
తయారు చేయు విధానం: ముందుగా స్టౌ మీద పాన్‌ పెట్టి అందులో నెయ్యి మొత్తాన్ని వేసుకోవాలి. ఎండుకొబ్బరి ముక్కలను కొంచెం ఎర్రగా మంచి సువాసన వచ్చేదాకా వేయించుకుని దానిలోనే జీడిపప్పు, కిస్‌మిస్‌ కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని బియ్యం, పెసరపప్పు కలిపి కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి స్టౌ మీద పెట్టుకోవాలి. దాన్ని అన్నం వండినట్లుగానే ఉడికించుకుంటూ (అన్నం మొత్తం పలుకు లేకుండా ఉడకాలి. ఎసరు లేకపోతే కొంచెం నీరు పోసుకోవచ్చు) కొంచెం నీరు ఉన్నప్పుడే దానిలో బెల్లం తురుము వేసి కరిగేదాకా మధ్యలో కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్‌మిస్‌తో పాటుగా నెయ్యి వేసి బాగా కలపాలి. అంతే.. ఎంతో రుచికరమైన స్వీట్‌ పెసర పప్పు పొంగలి రెడీ.


చలిమిడి
కావాల్సిన పదార్థాలు: రేషన్‌ బియ్యం – రెండున్నర కప్పులు, చక్కెర – ముప్పావు కప్పు, నెయ్యి – నాలుగు టేబుల్‌ స్పూన్లు, ఎండుకొబ్బరి ముక్కలు – పావు కప్పు, జీడిపప్పు – పావు కప్పు, యాలకుల పొడి – టీస్పూను.
తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో రేషన్‌ బియ్యం తీసుకొని రెండు మూడుసార్లు శుభ్రంగా కడగండి. ఆపై సరిపడా నీళ్లు పోసి ఎనిమిది గంటలపాటు నానబెట్టుకోవాలి. అనంతరం బియ్యంలోని నీళ్లు వంపేసి జల్లించే గిన్నెలోకి తీసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాటన్‌ క్లాత్‌పై పోసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో కొద్దికొద్దిగా బియ్యం వేసుకుంటూ మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ బియ్యం పిండిని ఒక బౌల్లోకి జల్లించి తీసుకోండి. పిండి జల్లించగా వచ్చిన రవ్వని మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో బియ్యం వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఈ పిండిని కూడా బౌల్లోకి జల్లించి తీసుకోండి. ఆ విధంగా పిండిని సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై అడుగు మందంగా ఉండే కడాయి పెట్టి నాలుగు టేబుల్‌ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయండి. వేడివేడి నెయ్యిలో పావు కప్పు చొప్పున ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు వేసి దోరగా ఫ్రై చేయండి. చక్కగా వేయించుకున్న డ్రైఫ్రూట్స్‌ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు కడాయిలో చక్కెర, కొన్ని నీళ్లు వేసి కరిగించండి. చక్కెర పూర్తిగా కరిగిన తర్వాత లేత ఉండ పాకం వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. పాకం చక్కగా వస్తేనే చలిమిడి రుచిగా ఉంటుంది. ఆ విధంగా పాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి, గ్రైండ్‌ చేసుకున్న తడి బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. స్టవ్‌ ఫ్లేమ్‌లో అడ్జస్ట్‌ చేసి చలిమిడి కాస్త దగ్గరపడే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చలిమిడి కాస్త జారుగా మారే వరకు కలుపుతూ ఉడికించి స్టవ్‌ ఆఫ్‌ చేయాలి. ఇప్పుడు ఇందులో ముందుగా నెయ్యిలో వేయించుకున్న ఎండుకొబ్బరి, జీడిపప్పు వేసి బాగా కలపాలి. చలిమిడి ఆరిన తర్వాత గట్టి పడుతుంది. చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్‌ చేసుకోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -