Wednesday, October 1, 2025
E-PAPER
Homeమానవిదసరా రుచులు

దసరా రుచులు

- Advertisement -

దసరా అంటేనే విందు, వినోదాల సంబరం. పండక్కి పది రోజుల ముందు నుంచే అందరూ వివిధ రకాల పిండి వంటలు తయారు చేయడం మొదలుపెడుతుంటారు. ఎవరి ఇష్టం వచ్చిన వంటలు వాళ్లు చేసుకొని తృప్తిగా తింటారు. అయితే ఎప్పుడూ చేసుకునే కజ్జికాయలు, లడ్డూలు, బూరెలు, పాయసం, గారెలు, బిర్యానీలు కాకుండా ఈ దసరాకు వెరైటీగా ఏదైనా స్పెషల్‌ రెసిపీలను ట్రై చేయండి. అలాంటి వంటలే ఈరోజు మీకోసం…

అంగూరీ రస్‌మలై
కావాల్సిన పదార్థాలు: బ్రెడ్‌ స్లైసులు-రెండు, పనీర్‌ తురుము – అరకప్పు, పాలపొడి – అరకప్పుపైన మరో రెండు చెంచాలు, పంచదార పొడి – ఎనిమిది చెంచాలు, అరకప్పు – కాచి చల్లార్చిన పాలు, చిటికెడు – యెల్లో ఫుడ్‌కలర్‌, పాలమీగడ లేదా క్రీం – రెండు చెంచాలు, సన్నగా తరిగిన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – రెండు చెంచాలు.
తయారీ విధానం: ముందుగా చాకుతో బ్రెడ్‌ స్లైసుల అంచులు కట్‌ చేయాలి. తర్వాత ముక్కలుగా తుంచి మిక్సీ జార్‌లో వేసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పనీర్‌ను సన్నగా తురుముకుని పక్కనుంచాలి. అలాగే మిగతా పదార్థాలన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో బ్రెడ్‌ పొడి, పనీర్‌ తురుము, రెండు చెంచాల పాలపొడి, నాలుగు చెంచాల పంచదార పొడి వేసుకుని చపాతీ పిండిలా చేసుకోవాలి.

ఆ పిండి ముద్దలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక ప్లేట్‌లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకుని అందులో పాలు, మిగిలిన పాలపొడి, పంచదార పొడి, యెల్లో ఫుడ్‌ కలర్‌ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. చివరగా అందులో క్రీం కూడా వేసుకుని మరోసారి బాగా కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు వెడల్పాటి మరో గిన్నె తీసుకుని అందులో ముందుగా చేసి పెట్టుకున్న బ్రెడ్‌-పనీర్‌ ఉండలు ఉంచాలి. వాటిపై ముందుగా రెడీ చేసుకున్న పాల మిశ్రమాన్ని పోసి, డ్రైఫ్రూట్స్‌ పలుకులతో గార్నిష్‌ చేసుకోండి. అంతే యమ్మీ యమ్మీగా నోరూరించే ‘అంగూరీ రస్‌మలై’ రెడీ.

బెల్లం అప్పాలు
కావాల్సిన పదార్థాలు: బియ్యప్పిండి – రెండు కప్పులు, గోధుమపిండి – రెండు కప్పులు, బొంబాయి రవ్వ – కప్పు, బెల్లం తురుము – నాలుగు కప్పులు, ఉప్పు – రెండు చిటికెళ్లు, నెయ్యి – అర కప్పు, యాలకుల పొడి – టీస్పూను, నూనె – వేయించడానికి తగినంత
తయారీ విధానం: ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో బియ్యప్పిండి, గోధుమపిండి, బొంబాయి రవ్వ, కొద్దిగా ఉప్పు, యాలకుల పొడి వేసుకొని బాగా కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్‌ మీద ఒక మందపాటి గిన్నెలో ఐదు కప్పుల నీరు, బెల్లం తురుము వేసుకుని కలుపుతూ మరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకుని మరో గిన్నెలోకి బెల్లం నీటిని వడకట్టుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టి బెల్లం వాటర్‌ పోసుకుని మరిగించుకోవాలి. పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాల్సిన అవసరం లేదు. బెల్లం నీళ్లు బాగా వేడెక్కి మరుగుతున్నప్పుడు స్టవ్‌ను లో ఫ్లేమ్‌లో ఉంచి ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యప్పిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి మొత్తం పాకంలో బాగా కలిశాకా స్టవ్‌ ఆఫ్‌ చేసి దింపి మూతపెట్టి కొద్దిగా చల్లారే వరకు పక్కనుంచాలి.

పావుగంట తర్వాత అందులో నాలుగైదు టీస్పూన్ల నెయ్యి వేసుకుని చేతితో పిండిని కాస్త ప్రెస్‌ చేసినట్టు చేస్తూ ఐదారు నిమిషాల పాటు చపాతీ పిండిలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. తర్వాత స్టవ్‌ మీద కడాయిలో డీప్‌ ఫ్రైకి సరిపడా నూనె పోసి హీట్‌ చేసుకోవాలి. ఆయిల్‌ కాగే లోపు చేతికి కాస్త నెయ్యి రాసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో నుంచి కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసుకుని అప్పాలుగా వత్తుకోవాలి. ఆయిల్‌ వేడయ్యాక మంటను తక్కువ చేసి అప్పాలను వేసుకుని మీడియం ఫ్లేమ్‌లో రెండు వైపులా మంచి కలర్‌ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పాలు రెండు వైపులా మంచిగా కాలిన తర్వాత ఒక్కొక్కటి తీస్తూ మరో గరిటెతో లైట్‌గా ప్రెస్‌ చేసి ఓ బౌల్‌లోకి తీసుకోవాలి. అంతే సూపర్‌ టేస్టీగా ఉండే ‘బెల్లం అప్పాలు’ మీ ముందు ఉంటాయి.
పొంగలి

కావాల్సిన పదార్థాలు: లావుగా ఉండే గోధుమరవ్వ – కప్పు, పెసరపప్పు – అరకప్పు, నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు, ఆవాలు – చెంచా, ఎండుమిర్చి – రెండు, జీలకర్ర – ఒక చెంచా, మిరియాలు – రెండు చెంచాలు, ఉప్పు – టేస్ట్‌కి సరిపడా, ఇంగువ – చిటికెడు, పసుపు – అర చెంచా, కరివేపాకు – రెండు రెబ్బలు, అల్లం తరుగు – టేబుల్‌ స్పూన్‌, పచ్చిమిర్చి – మూడు, జీడిపప్పు పలుకులు – పావు కప్పు, నీళ్లు – నాలుగు కప్పులు.

తయారీ విధానం: ముందుగా రెండు వేరు వేరు గిన్నెల్లో పెసరపప్పు, గోధుమరవ్వను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కనుంచాలి. ఇప్పుడు స్టవ్‌ మీద కుక్కర్‌ గిన్నెను ఉంచి నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తుంపలు, కచ్చాపచ్చాగా మిరియాలు, జీడిపప్పు పలుకులు వేసుకుని కలుపుతూ కాసేపు వేయించాలి. తర్వాత ఇంగువ, కరివేపాకు, సన్నని అల్లం తరుగు వేసుకుని కరివేపాకు చిటపటలాడే వరకు వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి తరుగు, పసుపు వేసి కలిపి పచ్చిమిర్చి కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. పోపు వేగిందనుకున్నాక పెసరపప్పు, గోధుమరవ్వను అందులో వేసి రెండు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి. తర్వాత ఆ మిశ్రమంలో గోధుమరవ్వ తీసుకున్న కప్పుతో నాలుగు కప్పులు నీళ్లు పోసి, రుచికి తగినంత ఉప్పు వేసి కలపాలి. అనంతరం కుక్కర్‌ మూత పెట్టి మూడు విజిల్స్‌ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చక్కగా ఉడికిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కుక్కర్‌లో ప్రెషర్‌ మొత్తం పోయాక మూత తీసి కలిపి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే నిమిషాల్లోనే రుచికరమైన ‘గోధుమరవ్వ కారా పొంగలి’ రెడీ.

చికెన్‌ చట్నీ పులావ్‌
మారినేషన్‌ కోసం: కిలో – చికెన్‌, రెండు చెంచాలు – కారం, రెండు చెంచాలు – పసుపు, రెండు చెంచాలు – అల్లంవెల్లుల్లి పేస్ట్‌, రుచికి తగినంత – ఉప్పు, పెరుగు – తగినంత.
తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో బాస్మతి బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టాలి. తర్వాత చికెన్‌ను మారినేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం ఒక వెడల్పాటి గిన్నెలో శుభ్రంగా కడిగిన చికెన్‌ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్ట్‌, పెరుగు వేసి అన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. గిన్నెపై మూత ఉంచి అరగంటపాటు పక్కనపెట్టుకోవాలి. ఆలోపు చట్నీని రెడీ చేసుకోవాలి

చట్నీ కోసం: కప్పు – పచ్చికొబ్బరి ముక్కలు, ఆరేడు – పచ్చిమిర్చి, ఆరు స్పూన్లు – వేయించిన పల్లీలు, అంగుళం ముక్క – అల్లం, రెండు గుప్పెళ్లు – పుదీనా, రుచికి సరిపడా – ఉప్పు.
చట్నీ తయారి: మిక్సీ జార్‌లో సన్నని పచ్చికొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, వేయించిన పల్లీలు, అల్లం ముక్కలు, పుదీనా, ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి. అనంతరం చికెన్‌ చట్నీ పులావ్‌ని రెడీ చేసుకోవాలి.

పులావ్‌ కోసం: అర కిలో – బాస్మతి బియ్యం, నాలుగు టేబుల్‌ స్పూన్లు – నెయ్యి, రెండు – బిర్యానీ ఆకులు, నాలుగు – లవంగాలు, అంగుళం ముక్క – దాల్చిన చెక్క, రెండు – స్టార్‌ ఫ్లవర్‌, కప్పు – సన్నని ఉల్లిగడ్డ తరుగు, సన్నని కొత్తిమీర తరుగు – కొద్దిగా.

తయారీ: ఒక పాన్‌ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగి వేడయ్యాక లవంగాలు, దాల్చినచెక్క, బిర్యానీ ఆకులు, స్టార్‌ ఫ్లవర్స్‌ వేసి వేయించాలి. అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ తరుగు వేసి రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో మ్యారినేట్‌ చేసి పక్కనుంచిన చికెన్‌ మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి. లో టూ మీడియం ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ కాసేపు వేయించాలి. చికెన్‌ ముక్కలు కొంచెం మగ్గాక ముందుగా రెడీ చేసుకున్న పుదీనా చట్నీ వేసి కలపాలి. తర్వాత పాన్‌పై మూత ఉంచి ఐదారు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అనంతరం నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని నీరు వడకట్టి అందులో కలుపుతూ మరో నిమిషం పాటు వేయించాలి. అందులో తగినన్ని నీళ్లు పోసి కలిపి సన్నని సెగ మీద పులావ్‌ మంచిగా కుక్‌ అయ్యే వరకు ఉడికించాలి. పులావ్‌ చక్కగా ఉడికి మంచి సువాసన వస్తున్నప్పుడు పైన సన్నని కొత్తిమీర తరుగుతో గార్నిష్‌ చేసుకుని దింపుకోండి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -