Friday, September 26, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపుష్ప విలాపం

పుష్ప విలాపం

- Advertisement -

పూదోటలపై అధికవర్షాల ప్రభావం
మొక్కలపైనే మురుగుతున్న పూలు
యూరియా కొరతతో ఇక్కట్లు
పండుగల వేళ భారీగా ధరలు
బతుకమ్మ పూలు భారమని మహిళల ఆవేదన

కె. శ్రీనివాసరెడ్డి

”ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమీ కాయొప్పునే గౌరమ్మ..
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..
తంగేడు చెట్టుకింద ఆట సిల్కాలారా.. పాట సిల్కాలారా.. కలికి సిల్కాలారా
కందుమ్మ గుడ్డలు రానువోనడుగులు.. తిరు ఉద్రాషలు తారు గోరింటలు
ఘనమైన పొన్నపువ్వే గౌరమ్మ.. గజ్జల వొడ్డానమే గౌరమ్మ..”
పూల ఔన్నత్యాన్ని చాటే పాట ఇదీ. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మహిళలు ఆలపించే ఈ గీతం పుష్ప సౌందర్యాన్ని వివరిస్తోంది. కానీ ఆ పూల తోటలు సాగు చేసే రైతుల దుస్థితి దీనికి భిన్నంగా ఉంది. అటు అధిక వర్షాలు, ఇటు యూరియా కొరత, నానో ద్రావణం సరిగా పనిచేయక, సబ్సిడీలు లేక రైతులు విలపిస్తున్నారు. ఆ ప్రభావం వినియోగదారులపైనా పడుతోంది. పూలను ఆరాధించే బతుకమ్మ, దేవీ నవరాత్రులు, దసరా, దీపావళి పండుగల వేళ.. ధరలు అందనంత దూరంలో ఉన్నాయి. ఏ పువ్వు కొనాలన్నా కిలో రూ.100కు పైమాటే. అధిక వర్షాలతో దిగుబడి సరిగ్గా రాక ఇటు రైతులు, అటు వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సగానికి పడిపోయిన బంతి, చామంతి ఇతర పూల దిగుబడులు..
ఎడతెగని వర్షాలతో బంతి, చామంతి, ఇతర పూల పంటల దిగుబడులు సగానికి పడిపోయాయి. ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే బంతి, ఐదు క్వింటాళ్లు వచ్చే చామంతి దిగుబడులు గణనీయంగా తగ్గాయి. రాష్ట్రంలోనే కాదు పొరుగునున్న మహారాష్ట్ర, కర్నాటకలోనూ వర్షాలు ఎక్కువగా కురవటంతో పూలతోటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్‌, మెదక్‌, నల్లగొండ, నిజామాబాద్‌, హైదరాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో బంతి, చామంతి పూల తోటలు ఎక్కువగా సేద్యం చేస్తున్నారు. చీడపీడలను తట్టుకునే రకాలు అందుబాటులోకి వచ్చినా అధిక వర్షాలతో పూలు నల్లబారుతున్నాయి. వర్షాలు, గాలులకు మొక్కలు నేలకొరిగి బూజు వచ్చి పూలు మురుగుతున్నాయి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద వరి, ఇతరత్ర పంటలు సాగు చేస్తుండగా బోరుబావుల కింద డ్రిప్‌ సిస్టం ద్వారా ఉద్యాన పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. డ్రిప్‌ పరికరాలకు ప్రభుత్వం నుంచి 75శాతం వరకు రావాల్సిన సబ్సిడీ అనేక చోట్ల సక్రమంగా ఇవ్వటం లేదని రైతాంగం ఆరోపిస్తోంది. 45 రోజుల్లో చేతికి వచ్చే బంతి.. ఆ తర్వాత మరో 50 రోజుల పాటు దిగుబడినిస్తాయి. ప్రభుత్వం సహకరిస్తే పూల తోటల ద్వారా రైతులు మంచి ఆదాయం గడించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. కానీ ఆశించిన ప్రోత్సాహం లేకపోవడంతో ఏటేటా పూల సాగు రైతుల పరిస్థితి దయనీయంగా మారుతోంది.

యూరియా కొరత.. నానో పనిచేయక..
యూరియా కొరత ప్రభావం పూల సాగు రైతులపైనా పడింది. యూరియా కోసం క్యూలో వేచివుండటం వల్ల సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టలేకపోతున్నామని రైతులు అంటున్నారు. నానో యూరియా ద్రావణాన్ని డ్రిప్‌ల ద్వారా మొక్కలకు సఫ్లరు చేస్తున్నా.. సమర్థవంతంగా పనిచేయటం లేదనే అభిప్రాయం రైతుల నుంచి వస్తోంది. యారియాను రెండురోజుల పాటు డ్రమ్ముల్లో నానబెట్టి డ్రిప్‌ ద్వారా అందిస్తే సత్ఫలితాలు వచ్చేవని చెబుతున్నారు. ఎకరాలతో నిమిత్తం లేకుండా ఒక్కో పాస్‌బుక్‌పై ఒక్కో కట్ట యూరియాను మాత్రమే ఇస్తుండటంతో రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. నాలుగైదువేల ఎకరాలున్న క్లస్టర్‌కు 200 బస్తాలు మాత్రమే యూరియా వస్తోందని రైతాంగం ఆవేదన చెందుతోంది. తీరని వెతల మధ్య సాగుచేసినా దిగుబడి రాక.. గిట్టుబాటు ధరలు లేక పూల రైతాంగం ఆవేదన చెందుతుండగా.. రిటైల్‌ మార్కెట్లో పూల ధరలు మండుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

పూలు కొనేటట్టులేదు..
ఈ ఏడాది అధికవర్షాల ప్రభావం బతుకమ్మ పూలపైనా పడింది. ఏ పూలు చూసినా కిలో రూ.100కు తక్కువనే మాటలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతియేటా వంద ఎకరాలకు పైగా పూల తోటలు సేద్యం చేస్తారు. ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా 50 ఎకరాల వరకు మాత్రమే సాగు చేశారు. అధిక వర్షాలతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం రూరల్‌, చింతకాని, కామేపల్లి, బోనకల్‌, తిరుమలాయపాలెం, కూసుమంచి, కొణిజర్ల, ముదిగొండ మండలాలు, భద్రాద్రి జిల్లాలో పినపాక, బూర్గంపాడు, భద్రాచలం తదితర మండలాల్లో స్వల్పంగా వేసిన పూల తోటలు కూడా దెబ్బతిన్నాయి. ఆయా మండలాల్లోని కొన్ని గ్రామాల్లో సాగు చేసే బంతి, మల్లెపూల తోటలు కూడా వర్షం బారినపడ్డాయి. ప్రతియేటా చేలు, బీళ్లు, గుట్టలపై విరగబూసే తంగేడు పూలు కూడా ఈ ఏడాది వానల దెబ్బకు పూత కరువైంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, విజయవాడ, కర్నూల్‌ తదితర ప్రాంతాల నుంచి పూలు దిగుమతి చేసుకుంటున్నారు. గతేడాది కిలో రూ.వంద లోపు పలికిన పూలన్నీ ఈ ఏడాది వంద పైమాటే. క్రితం సంవత్సరం కిలో రూ.80 ఉన్న బంతిపూలు ఇప్పుడు రూ.100, రూ.150 ఉన్నాయి.

చామంతి ఇప్పుడు రూ.250 వరకు ధర పలుకుతుండగా, కొన్నిచోట్ల రూ.450కి కూడా విక్రయిస్తున్నారు. 50 గ్రాములు రూ.30కి అమ్ముతున్నారు. మల్లెపూలు మూర రూ.30 ఉండేది ఇప్పుడు రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల నుంచి కొందరు తంగేడు పూలు సేకరించుకు వచ్చి నగరాలు, పట్టణాల్లో విక్రయిస్తున్నారు. నాలుగు మండలున్న చిన్న కట్టను రూ.50కి విక్రయిస్తున్నారు. తామరపూలు ఒక్కటి రూ.10కి పైనే. బతుకమ్మ పేర్చే వెదురు బుట్ట అడుగు రూ.100 ఉండగా పది అడుగుల వరకూ ఉన్నది రూ.వెయ్యి చొప్పున అమ్ముతున్నారు. టేకు, గునుగు పూలకు రంగులద్ది కట్ట రూ.30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు. మిగతా పూలన్నీ కూడా ధరల మంట మండుతున్నాయని వినియోగదారులు అంటున్నారు. కొందరు పూల ధరలు భరించలేక రూ.150 వెచ్చించి రెడీమేడ్‌ కాగితం బతుకమ్మలు సైతం కొనుగోలు చేస్తున్నారు. విక్రేతలు కూడా కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవని వాపోతున్నారు.

వర్షాలు కురుస్తుండటంతో వెంటనే కోస్తున్నాం : మంగపతి, ముచ్చర్ల ఎక్స్‌రోడ్‌, కామేపల్లి మండలం
వర్షాలు కురుస్తుండటంతో బంతి పూలు దిబ్బతింటున్నాయి. పూసిన పువ్వు పూసినట్టే కోస్తున్నాం. నాకున్న అరెకరానికి రోజుకు నలుగురు కూలీలను పెట్టి ఒక్కొక్కరికి రూ.600 చొప్పున ఇస్తూ కోయిస్తున్నా. కిలో రూ.100 చొప్పున ఇస్తున్నా. పావు కిలో పూలు అదనంగా పెడుతున్నా. తోట దగ్గర, మార్కెట్లో ఒకే రేటు అని అంటున్నారు. దిగుబడి, ధరలు లేక ఇబ్బంది పడుతున్నాం.

పూలు కొనలేకపోతున్నాం.. కె.ప్రత్యూష, ఖమ్మం
పూల ధరలు మండిపోతున్నాయి. ఏ పువ్వు కొందామన్నా రూ.100కు పైనే చెప్పుతున్నారు. చివరకు మూర మల్లెపూలు కూడా రూ.50కి పైనే పడుతున్నాయి. బతుకమ్మ ఆడాలనే ఉత్సాహాన్ని పూల ధరలు నీరుగారుస్తున్నాయి. పూజకు వినియోగించే సామగ్రి ధరలు కూడా భారీగా పెరిగాయి. ఇలా ధరలు ఉంటే పండుగలు ఆనందంగా ఎలా చేయగలుగుతాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -