Thursday, January 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఇంకా ఎంతకాలం ?

ఇంకా ఎంతకాలం ?

- Advertisement -

కేసు విచారణలో పోలీసుల తీరు ఆక్షేపణీయం
రామారావు హత్యపై సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివరిస్తాం
ఆయన స్పందన చూశాక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం
అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టి రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెస్తాం : రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వామపక్ష నేతలు


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సీపీఐ(ఎం) సీనియర్‌ నేత సామినేని రామారావును హత్యచేసిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని వామపక్ష పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కేసు విచారణలో పోలీసుల తీరు ఆక్షేపణీయమనీ, నిందితులను రక్షించే ప్రయత్నం చేయడం దారుణమని విమర్శించారు. దీని వెనుక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుట్ర రాజకీయాలున్నాయనీ, ఆధిపత్యం కోసమే హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఎత్తిచూపారు. హంతకులను వదిలేసి పోలీసు యంత్రాంగం సీపీఐ(ఎం) కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివరిస్తామనీ, ఆయన స్పందనను బట్టి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టి రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెస్తామని ప్రకటించారు. సామినేని రామారావును హత్యచేసిన హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వామపక్ష పార్టీల రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. హత్య జరిగిన రోజు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖండించారనీ, ఆ తర్వాత నిందితులను కాపాడే యత్నం చేస్తున్నారని విమర్శించారు. మధిర నియోజకవర్గంలో సీపీఐ(ఎం) బలంగా ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడుతున్నదనీ, ఈ కాలంలోనే ముగ్గురు సీపీఐ(ఎం) కార్యకర్తలను చంపేశారని గుర్తుచేశారు. తాజాగా తమ పార్టీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచిన గ్రామాల్లో పోలీసులు అక్రమ కేసులు బనాయించి కార్యకర్తలను వేధించడం, జైళ్లకు పంపడం దుర్మార్గమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమ నాయకుడు, సీపీఐ(ఎం) నేత సామినేని హత్య కేసులో పోలీసులు నిందితులను పట్టుకోకుండా రామారావు కుటుంబ సభ్యులను వేధించడమంటే కేసును పక్కదారి పట్టించడమేనన్నారు. హత్యా రాజకీయాలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. హత్య కేసులో విచారణ పద్ధతిలో పక్షపాతం తగదని సూచించారు.

సీపీఐ(ఎంఎల్‌)మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ..ఉద్యమం పెరుగుతున్నదనే కుట్రతోనే ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల హత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు ఉద్యమ నాయకుడిగా అనేక పోరాటాలు నిర్వహించిన, రెండు పర్యాలు గ్రామ సర్పంచ్‌ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సామినేని రామారావుని హత్య చేయడం దుర్మార్గం అన్నారు. గతంలో తమ పార్టీ నాయకుల్ని కూడా ఇల్లందు ప్రాంతంలో హత్య చేశారనీ, దోషులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం చెందారని విమర్శించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..నీతి, నిజాయితీ, అంకితభావం గల నాయకున్ని చంపేస్తే రాజకీయంగా బలపడుతామని కాంగ్రెస్‌ పార్టీ అనుకోవటం అవివేకమన్నారు. డిప్యూటీ సీఎంపైనా, కాంగ్రెస్‌పైనా హత్యారాజకీయ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడుతూ..భర్తను హత్య చేసిన నిందితులపై రామారావు భార్య ఫిర్యాదు చేసినా పోలీసులు వారిని విచారించడం లేదన్నారు. హంతకులు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రోత్సాహంతో పోలీసులు సీపీఐ(ఎం) నాయకులపైనా, రామారావు కుటుంబ సభ్యులపైనా కేసులు బనాయించి ఎమర్జెన్సీ తలపించే విధంగా నిర్బంధాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా, సీపీఐ(ఎంఎల్‌) రాష్ట్ర కార్యదర్శి ప్రసాదన్న, ఆర్‌ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జానకిరాములు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడె మోక్రసీ రాష్ట్ర నాయకులు ఝాన్సీ, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర నాయకులు ప్రసాద్‌ మాట్లాడుతూ.. రామారావు ప్రజాజీవితం వెలకట్టలేదనీ, ప్రజల్లో అత్యంత ఆదరణ కలిగిన వ్యక్తి కాబట్టే రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ను చంపేశారని విమర్శించారు. రామారావు మృతి సీపీఐ(ఎం)కే కాదు వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అన్నారు. రామారావు హత్యకేసులో కాంగ్రెస్‌ నాయకుల హస్తం ఉంది కాబట్టే పోలీసులు అరెస్టు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు టి.సాగర్‌, బండారు రవికుమార్‌, సీనియర్‌ నేత డీజీ. నర్సింహారావు, మాస్‌లైన్‌ రాష్ట్ర నాయకులు హన్వేశ్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, స్కైలాబ్‌బాబు, లెల్లెల బాల కృష్ణ, పొన్నం వెంకటేశ్వరరావు, డివిజన్‌ కార్యదర్శి గోపాలరావు, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -