Friday, November 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంనెతన్యాహును క్షమించండి

నెతన్యాహును క్షమించండి

- Advertisement -

ఇజ్రాయిల్‌ అధ్యక్షుడిని కోరిన ట్రంప్‌

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహుకు ఎప్పుడూ బాసటగా నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌.. మరోసారి తన వైఖరిని ప్రపంచానికి పునరుద్ఘాటించారు. అవినీతి, మోసం కేసుల్లో బెంజమిన్‌ నెతన్యాహును క్షమించాలని ఇజ్రాయిల్‌ అధ్యక్షుడు ఐజాక్‌ హెర్జోగ్‌కు ట్రంప్‌ ఒక సంచలన లేఖను రాశారు. ఇది ఇప్పుడు ఇజ్రాయిల్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. ఒక దేశాధ్యక్షుడు మరొక దేశాధ్యక్షుడికి ఈ విధంగా లేఖ రాసి అక్కడి నాయకుడికి క్షమాభిక్ష కోరిన ఘటన ఇదే మొదటిదని విశ్లేషకులు చెప్తున్నారు. ”ఇప్పుడు ఇజ్రాయిల్‌ శాంతికి దారి తీస్తున్న సమయం. నెతన్యాహు దృష్టి.. ఈ కేసులతో మరలిపోవద్దు. ఆయన యుద్ధకాలంలో శక్తివంతమైన నాయకుడు. ఇప్పుడు శాంతి కోసం మార్గం చూపిస్తున్నారు” అని తన లేఖలో ట్రంప్‌ రాసుకొచ్చారు.

నెతన్యాహుపై ఆరోపణలు, జరుగుతున్న విచారణ రాజకీయ ప్రేరేపితం, అన్యాయమైనవిగా ఆయన అభివర్ణించారు. ఇక ట్రంప్‌ లేఖకు హెర్జోగ్‌ కార్యాలయం స్పందించింది. క్షమాభిక్ష కోరాలంటే.. నిబంధనల ప్రకారం అధికారికంగా దరఖాస్తు చేయాలని వివరించింది. కాగా తనకు మద్దతుగా నిలిచిన ట్రంప్‌నకు సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా నెతన్యాహు ధన్యవాదాలు తెలియజేశారు. కాగా ట్రంప్‌ లేఖతో ఇజ్రాయిల్‌ రాజకీయాల్లో అలజడి చెలరేగినట్టయ్యింది. ఒక విదేశీ నాయకుడు ఇంత ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం చాలా అరుదైన విషయం. దీంతో ఇప్పుడు హెర్జోగ్‌ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో అన్నదే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో ట్రంప్‌ అతిజోక్యం పెరిగిపోతున్నదని అంతర్జాతీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో విషయంలోనూ ట్రంప్‌ ఈ విధంగానే వ్యవహరించాడని వారు గుర్తు చేస్తున్నారు. ఒక దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ట్రంప్‌ జోక్యం ఉంటున్నదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -