Friday, March 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅధ్యయనం లేకుండానే మూడు కార్పొరేషన్ల ఏర్పాటు

అధ్యయనం లేకుండానే మూడు కార్పొరేషన్ల ఏర్పాటు

- Advertisement -

అంతా అశాస్త్రీయం
ప్రజాప్రతినిధులను పట్టించుకోలేదు
కేవలం నెల రోజుల్లో ప్రక్రియ పూర్తి చేశారు
అసెంబీలో పట్టణ, పురపాలక పద్దుపై ఎమ్మెల్యే వివేక్‌ విమర్శ
ఉపసంఘం వేశాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌


నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల ఏర్పాటు అంతా అశాస్త్రీయంగా జరిగిందని ఎమ్మెల్యే కె.పి వివేకానంద విమర్శించారు. అధ్యయనం లేదు, కనీసం ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోలేదు, కేవలం నెల రోజుల వ్యవధిలో ప్రక్రియ అంతా ముగించారని ఆరోపించారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అధికార వికేంద్రీకరణ చేయమంటే, రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార కేంద్రీకరణ చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ అధక్షతన గురువారం సమావేశమైన అసెంబ్లీ, పట్టణ,పురపాలన పద్దుపై చర్చ చేసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ ముంబయి, చెన్నరు, ఢిల్లీ వంటి నరగరాలకు సంబంధించి భౌతిక పరిస్థితులను పరిశీలించారా ? అంటూ ప్రశ్నించారు.

అంతర్జాతీయ నగరాలను కూడా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. ప్రజల దగ్గరకు పరిపాలన చేరాలనే లక్ష్యంతోనే గత బీఆర్‌ఎస్‌ సర్కారు జీహచ్‌ఎంసీ శివార్లల్లో 20 మున్సిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు వాటిని రద్దు చేసి మూడు కార్పొరేషన్లు చేయడం దారుణమన్నారు. ముంబయిలో ట్రాఫిక్‌తోపాటు ఇతర సమస్యల నేపథ్యంలో 30 ఏండ్ల క్రితం నవీముంబయిని ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాలను కల్పించారని గుర్తు చేశారు. జీహెచ్‌ఎంసీతోపాటు సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లను పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండానే ఉనికిలో తెచ్చారని అన్నారు. దీంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడనున్నారని చెప్పారు. కనీసం ప్రజాప్రతినిధులను అభిప్రాయాలు కూడా తీసుకోలేదని గుర్తు చేశారు. ఫూచర్‌ సీటికి కేసీఆర్‌ సేకరించిన 14 వేల ఎకరాలను సేకరించారని చెప్పారు. మరో 16 వేల ఎకరాలు ఎలా సేకరిస్తారని ప్రశ్నించారు.

దానికి డబ్బు ఎలా తెస్తారో చెప్పాలని అడిగారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రక్రియ రియాల్టీ దందా కోసమేనని వ్యాఖ్యానించారు. హైడ్రా పేర హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారనీ, పేదల ఇండ్లను కూల్చేస్తున్నారని చెప్పారు. ఈవిషయంలో హైదరాబాద్‌తోపాటు మేడ్చల్‌ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు ఏమీ చెప్పడం లేదన్నారు. హైడ్రా ఏంటో అర్థం కావడం లేదని వివరించారు. ఇష్టానుసారం మాట్లాడుతూ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని వివరించారు. చర్చలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చోక్యం చేసుకుంటూ మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం వేశామన్నారు. నాలుగు రకాల పరిపాలన అవసరం లేదని భావించి పలు చర్యలు తీసుకున్నామన్నారు. అడగలేదనే అక్కసు తప్ప బీఆర్‌ఎస్‌ ఆరోపణలు, విమర్శల్లో పసలేదని వ్యాఖ్యానించారు. జీహెచ్‌ఎంసీలో ప్రత్యేకంగా సమావేశం పెట్టారనీ, నియంతృత్వ ధోరణి మానుకోవాలని సూచించారు.

అంతకు ముందు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఫ్యూచర్‌ సిటీ ముఖ్యమంత్రి ఆలోచన అన్నారు. గతంలో హైటెక్‌ సిటీని, సైబరాబాద్‌ నిర్మాణం చేసింది చంద్రబాబు అని గుర్తు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్‌, ఎయిర్‌పోర్టును పూర్తిచేసింది రాజశేఖర్‌రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు భారత్‌ సీటీని అవకాశాలకు చిరునామాగా మారనుందన్నారు. తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించి లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ను కొంత పుంతలు తొక్కించడానికి సర్కారు అనేక చర్యలు తీసుకుంటున్నదని గుర్తు చేశారు. క్యూర్‌, ప్యూర్‌, రేర్‌తో ప్రభుత్వం ముందుకుపోతున్నదని చెప్పారు. హైదరాబాద్‌ను గ్లోబల్‌ డెస్టినేషన్‌ మార్చే ప్రక్రియ నడుస్తున్నదని చెప్పారు. చర్చలోకి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ వస్తూ హైడ్రా విషయంలో ఎమ్మెల్యే వివేకానంద చేసిన వెటకారపు వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -