ముంబయి : లోక్‌సభ మాజీ స్పీకర్, కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 90 ఏండ్ల శివరాజ్ పాటిల్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో తన స్వగృహం ‘దేవ్‌ఘర్’లో శుక్రవారం ఉదయం మృతి చెందినట్టు పాటిల్ కుటుంబ సభ్యులు తెలిపారు. పాటిల్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నారు. 1935, అక్టోబర్ 12న చకూర్ గ్రామంలో శివరాజ్ పాటిల్ జన్మించారు. 1966లో లాతూర్ మునిసిపాలిటీ అధ్యక్షులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రెండుసార్లు మహారాష్ట్ర అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ అసెంబ్లీ స్పీకర్‌గానూ పని చేశారు. తరువాత 1980లో లాతూర్ లోక్‌సభ నుంచి తొలిసారిగా ఎన్నికయ్యారు. ఇక్కడి నుంచి వరసగా 2004 వరకూ ఎనిమిదిసార్లు ఇదే స్థానం నుంచి విజయం సాధించారు. 1991 నుంచి 1996 వరకూ 10వ లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు.
2004 నుంచి 2010 వరకూ రాజ్యసభ సభ్యుడిగానూ ఎంపికయ్యారు. వివిధ కేంద్ర శాఖలకు మంత్రిగా పని చేసిన పాటిల్ 2004 నుంచి 2008 వరకూ కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు. 2008 నవంబర్ 30న ముంబయిలో ఉగ్రదాడులు తరువాత ఆ పదవికి రాజీనామా చేశారు. 2010 నుంచి 2015 వరకూ పంజాబ్ గవర్నర్‌గా పని చేశారు. పాటిల్‌కు కుమారుడు శైలేష్ పాటిల్, కోడలు అర్చన, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. సమాజ సంక్షేమం కోసం ఇష్టంతో పనిచేశారని పేర్కొన్నారు. శివరాజ్ పాటిల్ మరణంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. రాజ్యసభ కూడా శివరాజ్ పాటిల్‌కు నివాళలర్పించింది. గౌరవనీయమైన పార్లమెంటేరియన్, సమర్థవంతమైన నిర్వాహకుడ్ని కోల్పోయిందని రాజ్యసభ చైర్మెన్ సీపీ రాథాకృష్ణన్ తెలిపారు. పాటిల్ జ్ఞాపకార్థం రాజ్యసభ సభ్యులంతా రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు.
దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
నైతిక విలువలు, హుందాతనంతో రాజకీయాలు నెరిపిన పెద్ద మనిషి శివ్‌రాజ్‌పాటిల్ మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.. కేంద్ర మాజీ మంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్ శివ్‌రాజ్‌పాటిల్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి ప్రస్థానం ప్రారంభించిన పాటిల్ ఏడు సార్లు ఎంపీగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్ర హౌం శాఖ మంత్రిగా, పంజాబ్ గవర్నర్‌గా సేవలందించారని సీఎం తెలిపారు.
లోక్‌సభ మాజీ స్పీకర్ శివరాజ్ పాటిల్ కన్నుమూత
- Advertisement -
- Advertisement -



