నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే పలు కార్యక్రమాలపై నియోజకవర్గంలో పర్యటిస్తూ స్థానిక జుక్కల్ చౌరస్తా వద్ద తన కారును ఆపి స్థానిక రైతులతో ముచ్చటించారు. అధికారులు సకాలంలో స్పందిస్తున్నారా,? బోనస్ రూ.500 ఖాతాలో పడుతున్నాయా.? అని అడగగా అధికారులు సరిగా పట్టించుకోవడంలేదని బోనస్ డబ్బులు గతంలో వేసిన పంటవే బోనస్ ఇప్పటివరకు రాలేదని వారు ఆవేదన వెల్లుబుచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన సన్నరకం వడ్ల బోనస్ డబ్బులు అందేదెప్పుడోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
గత యాసంగి సీజన్ బోనస్ డబ్బులు పెండింగ్ లో ఉండగా, మూడు నెలలుగా బోనస్ డబ్బుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతుల ఖాతాల్లో మాత్రం బోనస్ డబ్బులు జమ కాక పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోనస్ డబ్బుల కోసం కార్యాలయాల మెట్లు ఎక్కుతూ, అధికారులకు తమ గోడును మొర పెట్టుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



