– నేడు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు
నవతెలంగాణ- బంజారాహిల్స్
సీనియర్ రాజకీయ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కావూరి సాంబశివరావుకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు సంతానం. విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్‌కు సాంబశివరావు వరుసకు తాత అవుతారు.
కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగి ఐదుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1984, 1989, 1998లో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి, 2004, 2009లో ఏలూరు నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ మంత్రివర్గంలో కేంద్ర జౌళి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజనకు నిరసనగా ఆయన కేంద్ర మంత్రి పదవికి, కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. అనంతరం బీజేపీలో చేరినా వయోభారం, అనారోగ్య కారణాలతో ఇటీవల రాజకీయాల్లో చురుకుగా లేరు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



