ఇజ్రాయిల్‌తో డీల్ కోసం వెంపర్లాట
రేపటి నుంచి మోడీ టెల్ అవీవ్ పర్యటన
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయిల్‌లో పర్యటిస్తారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొన్న తరుణంలో, భారత విదేశాంగ విధానం ఒత్తిడికి గురవుతున్న సమయంలో ఆయన ఈ పర్యటనకు వెళుతున్నారు. వాస్తవానికి ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మన దేశంలో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయన ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు. గత ఏడాది ఆయన ఇలాగే మూడు పర్యాయాలు తన భారత్ పర్యటనను రద్దు చేసుకోవడం గమనార్హం. దానికి భద్రతా పరమైన ఆందోళనలు, దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితులను కారణంగా చూపారు. ఇప్పుడు కూడా అక్కడ అందుకు భిన్నమైన వాతావరణం లేదు. అలాంటప్పుడు మోడీ ఆ దేశంలో ఎందుకు పర్యటిస్తున్నారు? ఈ పర్యటన అజెండాను భారత్ నిర్ణయించడం లేదు. దూకుడుగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్ నాయకత్వం అభీష్టానికి అనుగుణంగానే భారత ప్రభుత్వం స్పందిస్తోంది.
వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తికి విఘాతం
తాను ప్రతిపాదించిన పొత్తుల షడ్బుజిలో భారత్ కేంద్ర బిందువుగా ఉంటుందని నెతన్యాహూ ఇటీవల ఓ ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ కూటమిలో ఇజ్రాయిల్, భారత్, గ్రీస్, సైప్రస్‌తో పాటు ఎంపిక చేసిన అరబ్, మధ్యధరా దేశాలు భాగస్వాములుగా ఉంటాయని ఆయన చెప్పారు. భారత్‌ను నెతన్యాహూ కేవలం ద్వైపాక్షిక భాగస్వామిగానే చూడడం లేదు. ఇరాన్‌ను ఎదుర్కోవడానికి, అలాగే పాలస్తీనాను అణచివేయడానికి తాను రూపొందించిన ప్రాంతీయ నిర్మాణంలో మన దేశాన్ని ఓ మూల స్తంభంగా చూపుతున్నారు. అస్థిరంగా ఉన్న తన నూతన మధ్యప్రాచ్య క్రమానికి చట్టబద్ధతను, భద్రతా పరమైన హామీలను ఇవ్వాలని ఆయన మన దేశాన్ని కోరుతున్నారు. ఇందుకు మోడీ అంగీకరించిన పక్షంలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న మన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుంది.
ఎందుకీ మద్దతు?
ఇజ్రాయిల్ పర్యటన సందర్భంగా అక్కడి చట్టసభలో మోడీ చేసే ప్రసంగాన్ని బహిష్కరిస్తామని పలువురు సభ్యులు, ప్రతిపక్ష నేతలు ఇప్పటికే హెచ్చరించారు. అదే జరిగితే భారత్ ప్రతిష్ట దిగజారిపోతుంది. ఇజ్రాయిల్‌తో ఇంతగా సంబం ధాలు పెట్టుకోవాల్సిన అవసరం మనకు ఏముందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతర్జాతీయంగా, దేశీయంగా నెతన్యాహూపై వ్యతిరేకత వ్యక్తమవుతు న్నప్పటికీ ఆయనకు కొమ్ము కాయడానికే మోడీ నిర్ణయించుకున్నారని అర్థమవుతోంది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్డు నెతన్యాహూను యుద్ధ నేరస్థుడిగా ప్రకటించింది. అలాంటి వ్యక్తిని ఆలింగనం చేసుకోవడమేమిటని పలువురు నిలదీస్తున్నారు. బ్రిక్స్‌కు అధ్యక్షత వహిస్తున్న సమయంలో ఇలాంటి చర్యలకు దిగడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయిల్ విస్తరణను వ్యతిరేకిస్తున్న దేశాలలో భారత్ కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన పత్రంపై అది సంతకం చేయలేదు. దీనిని బట్టి చూస్తే పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు వస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానానికి కూడా భారత్ దూరంగానే ఉంది.
సమతూకం దెబ్బతింటుంది
పాలస్తీనా, ఇజ్రాయిల్ విషయంలో ట్రంప్ వైఖరి జగద్విదితమే. ఆయన ఏర్పాటు చేసిన శాంతి బోర్డు తొలి సమావేశానికి పరిశీలకుడి హోదాలో భారత్ హాజరైంది. ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు భారత్ మద్దతు ఇస్తోందని విదేశాంగ శాఖ చెప్పింది కూడా. ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య కొంత సమతూకం పాటించాలన్న భారత్ విధానంలో మార్పు కన్పిస్తోంది. ట్రంప్ డిమాండ్ మేరకు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు ప్రాజెక్టును వదిలేయాలని భారత్ నిర్ణయించుకుంది. దీంతో ఇరాన్‌లో మనకు పరపతి లేకుండా పోయింది. భారత్ ఇప్పుడు ఇజ్రాయిల్ వైపే ఉన్నదని మోడీ పర్యటన రుజువు చేయబోతోంది. పర్షియన్ గల్ఫ్‌లో యుద్ధం సంభవిస్తే భారత ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ఇంధన ధరలు పెరుగుతాయి.
ఇజ్రాయిల్ సైనిక సాంకేతికత కోసం అర్రులు
ఇజ్రాయిల్ సైనిక సాంకేతిక పరిజ్ఞానంపై భారత్ ఆధారపడడం మోడీ హయాంలో బాగా పెరిగింది. క్షిపణి రక్షణ వ్యవస్థల నుంచి అధునాతన డ్రోన్ల వరకూ భారత సైన్యం ఇప్పుడు ఇజ్రాయిల్ పైనే ఆధారపడుతోంది. ఇజ్రాయిల్ పర్యటన జరపడానికి ముందే రక్షణ సంబంధాలు పెంచుకునేందుకు, ఉమ్మడి తయారీ కార్యక్రమాలను వేగవంతం చేసుకునేందుకు రెండు దేశాలు అవగాహనా ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు రక్షణ ఒప్పందాలే వెన్నెముక అవుతున్నాయి. అయితే ఒక్క రక్షణ అవసరాల కోసమే మనం ఇజ్రాయిల్‌పై ఆధారపడడం లేదు. పెగాసస్ స్పైవేర్ కుంభకోణంలో మోడీ ప్రభుత్వం ఇజ్రాయిల్ సైబర్ పరికరాలను ఉపయోగించిందని రుజువైంది. ఈ ఏడాది ఇంటెలిజెన్స్ బ్యూరో బడ్జెట్‌ను మోడీ ప్రభుత్వం భారీగా పెంచింది. దీంతో విపక్షాలు, విమర్శకులపై నిఘాను మరింతగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
లాభం కంటే నష్టమే ఎక్కువ
భారత్-మధ్యప్రాచ్యం-యూరప్ ఆర్థిక కారిడార్ కోసం భారత్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అదానీ పోర్ట్స్, పోర్ట్ ఆఫ్ మార్సెయిల్ మధ్య కుదిరిన ఎంఓయూ ఈ ప్రయత్నాలకు ఊతమిచ్చింది. యూరప్‌లో భారత్ వ్యూహాత్మక పరిధిని విస్తరించింది. అయితే జోర్డాన్-ఇజ్రాయిల్ వెంబడి నెలకొన్న అస్థిరత, భారత్-అమెరికా మధ్య సుంకాల కారణంగా నెలకొన్న విభేదాల కారణంగా కారిడార్ పురోగతి నిలిచిపోయింది. ఈ ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించడానికి పెద్దగా అవకాశాలు లేవని అంటున్నారు. ఏదేమైనా టెల్ అవీవ్‌లో నెతన్యాహూతో స్నేహహస్తం చాచడానికి మోడీ సిద్ధవవుతున్నారన్నది సుస్పష్టం. దీనివల్ల మనకు ఒనగూడే ప్రయోజనమేమీ లేకపోగా నష్టమే ఎక్కువ అని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
ఉద్రిక్తతల మధ్య..
మోడీ ఇజ్రాయిల్ పర్యటన నేపథ్యంలో అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తిరిగి మొదలైన తరుణంలో ఈ పర్యటన జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే మధ్యప్రాచ్యంలో సైనిక బలగాలను, యుద్ధ విమానాలను, విమాన వాహక నౌకలను మోహరించారు. ఇరాన్‌తో ఒప్పందం కుదరకపోతే యుద్ధం తప్పదని బెదిరిస్తున్నారు. ట్రంప్ సలహాదారులు కూడా సైనిక చర్యకు 90 శాతంఅవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇరాన్‌పై పరిమిత దాడులే జరుగుతాయని అమెరికా చెబుతున్నప్పటికీ దాని ప్రతిపాదనలకు ప్రతిగా ఇరాన్ మరికొన్ని ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొలా సైతం యుద్ధ సన్నాహాలలో ఉంది. ఈ ప్రాంతంలో 90 లక్షల మంది భారతీయులు నివసిస్తూ పనులు చేసుకుంటున్నారు. యుద్ధమే అనివార్యమైతే వారి భద్రతకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది.



