ఉభయ సభల సమావేశంలో గవర్నర్
ఏడాదిలో రూ.33 వేల కోట్లు నగదు బదిలీ చేసినట్లు వెల్లడి
వాకౌట్ చేసిన వైసిపి
అమరావతి : ‘రాష్ట్రంలో 2019 తరువాత వ్యవస్థాగత పాలనా వైఫల్యాలు తలెత్తాయి. రాష్ట్ర అభివృద్ధి స్తంభించింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రమైంది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి. కీలక రంగాలు తీవ్ర తిరోగమనం బాట పట్టాయి. చేదు అనుభవాలతో విసిగి వేసారిన ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గత 19 నెలలుగా తీసుకున్న చర్యలతో రాష్ట్రం పునరుద్దరణ దశ నుండి ప్రగతి వైపు ప్రయణిస్తోంది.’ అని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమైనాయి. ఈ సందర్భంగా ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించిన గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సమావేశానికి హాజరైన వైసిపి సభ్యులు గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన కాసేపటికే సభ నుండి వాకౌట్ చేశారు. వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డితో పాటు, ఆ పార్టీ సభ్యులు సభ ప్రారంభం కాకముందే సమావేశ మందిరానికి చేరుకున్నారు. జాతీయగీతాలాపన అనంతరం గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన వెంటనే తమ సీట్ల వద్ద లేచి నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. వైసిపికి ప్రతిపక్ష హోదా కల్పించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో గవర్నర్ ఏం మాట్లాడుతున్నారన్నది దాదాపుగా వినపడని పరిస్థితి నెలకొంది. దీంతో సభలోకి మార్షల్స్‌ను పిలవాలన్న ఆలోచననూ అధికారపక్షం చేసింది. కొందరు మార్షల్స్ సభలోకి రావడం కూడా కనిపించింది. ఈ దశలో గవర్నర్ ప్రసంగం ప్రారంభించిన 11 నిమిషాల్లోనే వైసిపి సభ్యులు నినాదాలు చేస్తూ సభ నుండి వాకౌట్ చేశారు. అనంతరం శాసన సభ బయట ప్లకార్డులతో నిరసన తెలిపారు. వైసిపి వాకౌట్ అనంతరం ప్రసంగాన్ని కొనసాగించిన రాష్ట్ర గవర్నర్ సంక్షేమాన్ని అభివృద్ధితో సమతుల్యం చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తూ ఏడాదికి దాదాపు 33 వేల కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటి)ని అమలు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని అన్నారు. 2047 నాటికి రూ. 55 లక్షల తలసరి ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా నిరంతరం అధిక వృద్ధి రేటుపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. 2025లో ప్రారంభిం చిన పి4 పబ్లిక్, ప్రైవేటు, పీపుల్, పార్టనర్ షిప్ విధానం ఈ దిశలో ప్రభుత్వ వ్యవస్థలను సామాజిక భాగస్వామ్యంతో అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. జనాభా మార్పులను గురిస్తూ ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పా రు. ఆర్ధిక వ్యవస్థల్లో మహిళల భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ‘స్వయం’ (ఎస్‌ఇఎల్‌ఎఫ్) కార్య క్రమంలో ఈ ఏడాది లక్ష మంది మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తోందన్నారు. వచ్చే ఏడాది ఈ సంఖ్యను 5 లక్షలకు విస్తరించే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు.
దక్షణ ప్రాంత నదీ వ్యవస్థలను అనుసంధానిస్తాం…
దక్షణ ప్రాంత నదుల అనుసంధాన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు గవర్నర్ చెప్పారు. దీనిలో భాగంగానే నల్లమల సాగర్‌ను ప్రతిపాదించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్‌లోపు పూర్తి చేయాలనే ధృడ సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు. హంద్రీ నీవా సుజల స్రవంతి పనులు వేగవంతం చేసినట్లు చెప్పారు. గోదావరి పుష్కరాల కోసం మౌలిక సదుపాయాలు, యాత్రీకుల సౌకర్యాలు, నదీ తీరాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమైనట్లు చెప్పారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించినట్లు తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు వ్యవస్థల అభివృద్ధిని ప్రభుత్వం వేగవంతం చేస్తోందన్నారు. సిఐఐ సదస్సులో 16.13 లక్షల ఉద్యోగాల కల్పనకు రూ.13.25 లక్షల కోట్ల పెట్టుబడులతో 610 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పారు. 14 ఎస్‌ఐపిబి సమావేశాల ద్వారా 8.36 లక్షల ఉద్యోగాల కల్పన సామర్ధ్యం ఉన్న రూ 8.74 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో దేశంలో పండ్ల ఉత్పత్తిలో రాష్ట్రం 15 శాతం వాటా కలిగి ఉందన్నారు. ఉభయ సభల సంయుక్త సమావ్శేం ప్రారంభం కావడానికి ముందు అసెంబ్లీకి వచ్చిన రాష్ట్ర గవర్నర్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, శాసన మండలి ఛైర్మన్ కోయ్యే మోషేన్‌రాజు, శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్వాగతం పలికారు.
ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి వైపు
- Advertisement -
- Advertisement -



