జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లోని అనాథశ్రమంలో విచారించి అరెస్ట్ చేసిన ఎన్‌ఐఏ బృందం
హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో హాజరు
చంచల్‌గూడ జైలుకు తరలింపు
నవతెలంగాణ-జఫర్‌గడ్
సామాజిక ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్యను జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లోని అనాథశ్రమంలో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండల కేంద్రంలో గాదె ఇన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమానికి వచ్చిన ఎన్‌ఐఏ అధికారులు.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియల్లో ఇన్నయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడినందుకు అరెస్టు చేసినట్టు దర్యాప్తు సంస్థ అందించిన నోటీసులో పేర్కొన్నారు. గాదే ఇన్నయ్య చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతూ, మావోయిస్టు విప్లవాన్ని కొనసాగించేలా ఉపన్యాసమిస్తూ, సంస్మరణ సభలో అక్కడి సమూహాన్ని ప్రేరేపించారని.. అందుకే అరెస్ట్ చేసినట్టు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు.
అరెస్టు అప్రజాస్వామికం సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్‌రాజా
తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలో ఎన్‌ఐఏ పోలీసులు గాదె ఇన్నయ్యపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం భౌతికంగా నిర్మూలిస్తున్నదనీ, మావోయిస్టులు చర్చలకు సిద్ధపడినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలత చూపట్లేదని విమర్శించారు. ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిస్తున్న మేధావులు, ప్రజాస్వామిక వాదులపైనా కక్షపూరిత వేధింపులకు పాల్పడటం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇన్నయ్యపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.



