Thursday, January 29, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిమరోసారి గాంధీ హత్య!

మరోసారి గాంధీ హత్య!

- Advertisement -

సత్యం, అహింస సిద్ధాంతాలతో భారత స్వతంత్ర పోరాటాన్ని నడిపిన మహోన్నత యోధుడు మోహన్‌ దాస్‌ కరంచంద్‌ గాంధీ. బ్రిటిష్‌ వలసవాదాన్ని తీవ్రంగా నిరసించాడు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, దేశ సమైక్యత, సమగ్రతల కోసం ప్రజలందరినీ ఒకతాటిపై నిలిపాడు. జాతిపితగా, మహాత్ముడుగా పిలవబడ్డాడు. నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచాడు. కొల్లాయి కట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటుతూ స్వాతంత్ర పోరాటానికి కార్యోన్ముఖులను చేశాడు. సహాయ నిరాకరణ, క్విట్‌ ఇండియా ఉద్యమం, సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, చంపారన్‌ ఉద్యమం వంటి కీలక ఉద్యమాలు చేపట్టి భారత స్వాతంత్ర పోరాటాన్ని ముందుకు నడపడంలో ఆయన పాత్ర ప్రముఖమైనది.

గాంధీ హిందూ మతంపై నమ్మకం ఉన్నవాడైనప్పటికీ ఆయన సాంస్కృతిక మత దృక్పథం సంకుచితమైనది కాదు, సార్వత్రికమైనది. ”భారతీయ సంస్కృతి పూర్తిగా హిందువులది, మహమ్మదీయులది కాదు. మరెవరిది కాదు, అది అన్ని మతాల సమ్మిళితం”అని పేర్కొన్నాడు. ”భారతీయులు వారి సంస్కృతితో బలమైన సంబంధాలు కలిగి ఉండాలి. కానీ అదే సమయంలో ప్రపంచ సంస్కృతులు అందించే మంచిని స్వీకరించాల”ని కోరాడు. ఒకానొక సందర్భంలో ”అన్ని దేశాల సంస్కృతులు స్వేచ్ఛగా మా ఇంటిలోకి ప్రసరించాలి, కానీ అవి బలంగా వీచి నా కాళ్లను లాగి వేయడాన్ని అంగీకరించను. ఇతరుల ఇళ్లలో అనుమతి లేకుండా ప్రవేశించేవాడిగా, బిచ్చగాడిగా లేక బానిసగా ఉండాలని కోరుకోను” అని. దీన్నిబట్టి ఆయన దృక్పధాన్ని అర్థం చేసుకోవచ్చు.
గాంధీజీ జాతీయ ఉద్యమంలో వివిధ వర్గాలు ప్రజల, కార్మికులు, యువతను అత్యంత ప్రభావితం చేశాడు.

నిరంతరం మత సామరస్యత, దేశఐక్యత, లౌకికతత్వం కోసమే కృషి చేశాడు. దేశ విభజనను గట్టిగా వ్యతిరేకించాడు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండాలని విశ్వసించాడు. హిందువులు, ముస్లింలు ఇతర అన్ని కులాలు, మతాలు కలిసి ఒకే దేశంగా ఉండాలని పట్టుబట్టాడు. ఎవరు అవునన్నా కాదన్నా భారత స్వాతంత్ర ఉద్యమం మొదలు నేటివరకు భారతదేశం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తుల్లోగాంధీజీ ఒకరు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి దేశాన్ని విముక్తి చేసిన గాంధీజీ 1948 జనవరి 30న ఒక హిందూ మతోన్మాది అయిన గాడ్సే చేతిలో హత్య గావించబడ్డాడు. గాడ్సే పక్క ఆరెస్సెస్‌వాది అని తర్వాత విచారణలో తేలింది. స్వాతంత్రోద్యమ కాలం నుంచి మొదలుకుంటే నేటివరకు కూడా ఆరెస్సెస్‌, హిందూ మహాసభలు గాంధీజీని లక్ష్యంగా చేసుకొని చరిత్ర పుటల నుండి ఆయన పేరును, ప్రభావాన్ని తొలగించేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నవి.

అవకాశం దొరికి నప్పుడల్లా గాంధీజీపై, ఆయన భావాలపై దాడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా బీజేపీ అధికారం చేపట్టిన ఈ పదకొండేళ్ల నుండి ఇది మరింత పెరిగింది. గాంధీజీ పేరు పలకడంలో, మహాత్మా అని పిలిచే విషయంలో ఏదో ఒక రాద్దాంతం చేస్తూనే ఉంది. తాజాగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మార్చి, వీబీ జీ రాంజీ పథకంగా మార్చడమంటే గాంధీ ప్రతిష్టను దిగజార్చడం తప్ప మరొకటి కాదు. ఇది గాంధీకే కాదు మొత్తం దేశ స్వాతంత్య్ర పోరాటానికే పెద్ద అవమానకరం. గాంధీ పేరుతో వచ్చిన ఉపాధి హామీ చట్టం ద్వారా ఈ దేశంలో కోట్లాదిమంది వివిధ వర్గాల పేద ప్రజలు, వ్యవసాయ కార్మికులు లబ్ధి పొందుతున్నారు. మహాత్మా గాంధీ పేరును తొలగించి పథకంగా మార్చి, నిధులు తగ్గించి పేదల పొట్టగొట్టే చర్యలకు పూనుకుంది కేంద్రం.

భారత స్వాతంత్రోద్యమంతో ఏమాత్రం సంబంధంలేని ఆరెస్సెస్‌, సంఘ్‌ పరివారం పోరాట చరిత్రను వక్రీకరించి తమకు అనుకూలంగా మలుచుకునేందుకు యత్నిస్తోంది. మహాత్మాగాంధీతో పాటు అంబేద్కర్‌, భగత్‌సింగ్‌ సామాజిక వేత్తలు, జాతీయోద్యమ యోధుల చరిత్ర పాఠ్యాంశాలను తొలగించడం, మార్చివేయడం చేస్తోంది. దేశంలో కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజల్లో విద్వేషం రగిలిస్తోంది. గాంధీని చంపిన గాడ్సేను గొప్ప దేశభక్తుడు అంటూ ప్రచారం చేస్తూ, విగ్రహాలు ప్రతిష్టిస్తున్నది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగాలు చేసిన నిజమైన దేశభక్తులను అవమానిస్తున్నది. అందుకే, శాంతి సహజీవనం సామరస్యం కోసం పాటుపడిన గాంధీజీ సిద్ధాంత భావజాలంపై జరుగుతున్న దాడి నుండి దేశాన్ని కాపాడుకోవాలి. లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. ఇదే మహాత్మాగాంధీకి అర్పించే నిజమైన నివాళి.

కోట రమేష్‌
9618339490

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -