జుట్టుపోలుగాడు : ముల్లుపోయి కత్తి వచ్చే ఢాం ఢాం ఢాం
కత్తిపోయి డోలు వచ్చె ఢాం ఢాం ఢాం
నూరుపోయి నూటపాతికొచ్చె ఢాం ఢాం ఢాం
కేతిగాడు : ఓరి జుట్టుపోలుగా! కల్లుతాగిన కోతిలా ఆ గెంతులేంది? చిందులేందిరా..?
జుట్టుపోలుగాడు : సంబరం మావా సంబరం. ఇక మనకు ఏడాదికి నూరు రోజుల పని కాదు. నూటపాతిక రోజులెహె.
కేతిగాడు : ఆ నూర్రోజులున్నప్పుడే మనకు సరిగా పన్లేదు. పన్జేసినా పైసలు చక్కంగా అందలా. అవన్నీ మర్చిపోయినావా ఏంది?
జుట్టుపోలుగాడు : అందుకే మన పెధాని మోడీ ఆ పధకంలోని మహాత్మాగాంధీ పేరును కూడా పీకేసినాడు.
కేతిగాడు : అయితే ఏంటట?
జుట్టుపోలుగాడు : ఇక ఇక్కడ్నుండి మూడ్రోజులకోరోజు పని ఫుల్ గ్యారంటీ. మావా ఈ పథకం పేరేంటో తెలుసా జీ.రాం.జీ.
కేతిగాడు : ఓర్నీ ఆర్భాటం కూలా. మోడీ అకస్మాత్తుగా అర్జంటుగా ఏది తీసుకొచ్చినా అందులో ఏదో తిరకాసుంటుందిరా.
జట్టుపోలుగాడు : నీకెప్పుడూ మా మోడీ అంటే అస్సలు పడదు. ఎడ్డెం అంటే తెడ్డెం అంటావ్.
కేతిగాడు : పదా బంగారక్కా. విషయం వివరంగా చెప్తేగాని నీకు బోధపడదు.
బంగారక్క : ఆగండాగండి. మీ గొడవంతా వింటూనే వున్నాను. ఈ తిరకాసులో రెండు విషయాలున్నాయి.
జుట్టుపోలుగాడు : ఇది తిరకాసేనంటావా అక్కా.
బంగారక్క : ముమ్మాటికీ. ముందు మోడీకి గాంధీ అంటే అస్సలు పడదు. పైకి గాంధీ బొమ్మలకు, పటాలకు మొక్కుతున్నా… లోపల గాంధీని హత్యచేసిన గాడ్సేని మొక్కుతుంటాడు. గాంధీహత్యను సమర్ధిస్తాడే తప్ప అస్సలు వ్యతిరేకించడు.
జుట్టుపోలుగాడు : నిజమా? మోడీలో ఈ షేడ్ కూడా వుందాక్కా?
బంగారక్క : నిజమే. కావాలంటే వెతుక్కో. గాంధీ హిందువులకు అన్యాయం చేశాడని, ఆ ఆరెస్సెస్ వాళ్ల సిద్దాంతం.
కేతిగాడు : అందుకే ఈ పథకాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీని మరోసారి హత్యచేశారని కాంగ్రెసోళ్లు అంటున్నారు.
జుట్టుపోలుగాడు : బిజెపోళ్లో అంటే కాంగ్రెసోళ్లకు పడదు గనుక అలా అంటున్నారు. అక్కడక్కడా ఉద్యమం కూడా చేస్తున్నారు.
బంగారక్క : చేయరా మరి. మనం కూడా చేయాలి. ఇది మనదేశంలో కోటానుకోట్లాది మంది మనలాంటి కూలిజనానికి సంబంధించిన పథకం.
జుట్టుపోలుగాడు : నూరు బదులు నూటపాతిక రోజులు పనిస్తే మంచిదేగా.
బంగారక్క : అలా ఎప్పటికీ జరగదు. ఎందుకంటే గతంలో రూపాయికి 90 పైసలు ఆ డబ్బులు కేంద్రం పెట్టుకునేది. పదిపైసలే రాష్ట్రం ఖర్చు. ఇప్పుడది నలభైపైసలు రాష్ట్రాలు పెట్టుకోమని కేంద్రం అంటుంది. పైగా సాగుపనుల సీజన్‌లో 60 రోజుల పాటు ఈ ఉపాధి పనిని పూర్తిగా బంద్ చేస్తారు.
కేతిగాడు : ఒరే జుట్టుపోలిగా విను… మూడ్రోజులకో ఉపాధి పని అని గెంతులేశావుగా…
బంగారక్క : అంతేకాదు, ఆ పథకంలో మాకు పన్లేదు బాబు అంటే నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిది. ఆ చట్టం అలా వుంది. ఇప్పుడవన్నీ గంగలో కలిసిపోయేలా ఆ పథకాన్ని బిజెపి ప్రభుత్వం ఆదరాబాదరాగా రద్దు చేసింది.
కేతిగాడు : అంటే మన పని హక్కు పోయిందన్నమాట.
బంగారక్క : అన్నమాటేంటి? ఉన్నమాటే. ఆ పథకం ప్రకారం గ్రామీణ భారతంలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా నూరు రోజుల పని కల్పించడం కేంద్రం బాధ్యత. ఇప్పుడు కేంద్రం తాను అనుకున్న రాష్ట్రాల్లోనే ఈ ఉపాధి పని కల్పిస్తుంది. అప్పుడిక నూటపాతిక రోజుల పని మాటెక్కడిది?
కేతిగాడు : ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు గాంధీపేరు పోయె. ఇటు పేదోళ్ల పని హక్కు పోయె.
బంగారక్క : మరో లోతైన విషయం. దాదాపు పన్నెండు కోట్లమందికి పైగా ఈపథకం మనలాంటి పేదోళ్లకు అమలవుతుంది. వీరిలో ఎక్కువమంది ఆదివాసులు, దళితులు, మైనార్టీలు. అందులో సగం మంది మహిళలు. భారతదేశంలో ఏ ఒక్కరూ పనిలేక ఆకలిబాధతో మరణించకూడదనే ఉద్దేశంతో ఇరవై ఏళ్ల క్రితం ఈ పథకం వచ్చింది.
కేతిగాడు : చూశావురా… పేదల పని హక్కుగా వచ్చిన చట్టాన్ని పార్లమెంటులో సరైన చర్చలేకుండా రద్దుచేసింది కేంద్రం.
బంగారక్క : అందుకే ఇది మన రాజ్యాంగం మీద జరిగిన దౌర్జన్యదాడి అని కూడా పెద్దలంటున్నారు.
జుట్టుపోలుగాడు : (కాస్త జుట్టుపీక్కుంటూ) బిజెపి ఎందుకిలా పేదలతో ఆడుకుంటుంది?
బంగారక్క : కాకులను కొట్టి గద్దలకు పెట్టడం అంటే ఇదే. ఈ డబ్బుల్ని కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా దారి మళ్లిస్తున్నారు. ముఖ్యంగా పేద మహిళలకు ఆర్థిక సాధికారత లేకుండా దెబ్బ తీస్తున్నారు. తెలిసిందా.
– కె.శాంతారావు, 9959745723



