Saturday, February 14, 2026
E-PAPER
Homeజాతీయంమణిపూర్‌ కేసులపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి

మణిపూర్‌ కేసులపై స్టేటస్‌ రిపోర్ట్‌ ఇవ్వండి

- Advertisement -

బాధితులకు చార్జిషీట్‌ కాపీలు ఇవ్వాలి
సీబీఐని ఆదేశించిన సుప్రీం
న్యూఢిల్లీ :
మణిపూర్‌లో 2023 మేలో తలెత్తిన జాతుల మధ్య హింసాకాండ సందర్భంగా మహిళలపై లైంగికదాడులు, సామూహిక లైంగికదాడులతో సహా వివిధ హేయమైన నేరాల్లో నిందితులైన వ్యక్తులను దోషులుగా నిర్ధారించడానికి తగిన సాక్ష్యాధారాలను సంస్థ సేకరించిందో లేదో తెలియచేస్తూ ఒక నివేదికను అందజేయాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం కేసుల చార్జిషీట్‌ల కాపీలను బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులతో సీబీఐ పంచుకోవాలని చీఫ్‌ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని బెంచ్‌ శుక్రవారం పేర్కొంది. ఈ క్రిమినల్‌ కేసుల్లో పురోగతిని నిశితంగా పర్యవేక్షించే బాధ్యతలను మణిపూర్‌, గౌహతి హైకోర్టుల చీఫ్‌ జస్టిస్‌లకు అప్పగించాలని సుప్రీం ప్రతిపాదించింది. అవసరమైతే బాధితులకు నాణ్యతతో కూడిన లీగల్‌ ఎయిడ్‌ను అందించాలని కోరింది. మణిపూర్‌ ఘర్షణల్లో లైంగిక దాడులకు గురైన యువతుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వృందా గ్రోవర్‌ ఇందుకు సంబంధించి జరుగుతున్న జాప్యాలను ప్రస్తావించిన తర్వాత సుప్రీం ఈ విచారణలను వేగవంతం చేసింది.

జాతుల మధ్య హింసాకాండ తలెత్తిన రోజుల్లో సామూహిక లైంగికదాడికి గురైన ఒక యువతి ఆ మానసిక వేదనతో, అస్వస్థతతో ఈ ఏడాది జనవరిలో మరణించింది. గ్రోవర్‌ ఆ కేసును ప్రముఖంగా ప్రస్తావించారు. ఇలాంటి కేసులు సీబీఐకి 11వరకు బదిలీ అయ్యాయని ఆమె తెలిపారు. తమపై మోపిన అభియోగాలేమిటో బాధితులు తెలుసుకునే హక్కు చట్ట ప్రకారం వుందని కానీ ఈ విషయంలో తాము పూర్తిగా చీకటిలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు. అధికారులు చాలా యథాలాపంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ స్పందిస్తూ ప్రతి ఒక్కరూ న్యాయం పొందేలా చూడాల్సిన బాధ్యత వుందని వ్యాఖ్యానించారు.
మణిపూర్‌లో హింసకు సంబంధించిన సున్నితమైన, హేయమైన కేసులను అసోంకు బదిలీ చేసి అక్కడ విచారించాలని సుప్రీం పేర్కొంది. అవసరమైతే ప్రత్యేక బెంచ్‌ ఏర్పాటు చేయడం ద్వారా విచారణను అసోం చీఫ్‌ జస్టిస్‌ పర్యవేక్షించగలరని పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -