మనసుకు నచ్చిన పని చేయడంలో ఉన్న ఆనందం, తాము నేర్చుకున్న కళను నలుగురికి నేర్పించడంలో పొందే సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఆ అనుభూతిని తన సొంతం చేసుకుంటున్నారు రూబీ గుప్తా. సాధారణంగా మహిళలు పెండ్లి తర్వాత తమ ఇష్టాలను పక్కన పెడతారు. కానీ ఈమె మాత్రం పెండ్లి తర్వాతనే తన అభిరుచులకు పదును పెట్టారు. కుటుంబ బాధ్యతలతో కాలు బయటపెట్టలేకపోయినా ఇంట్లోనే ఉంటూ కళలను ప్రోత్సహిస్తూ, ముందు తరాలకు దాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
రూబీ సొంత ఊరు ఉత్తరప్రదేశ్‌లోని హసన్ పూర్. తల్లి మీనా గుప్తా, తండ్రి సత్యనారాయణ గుప్తా. వారికి ముగ్గురం సంతానం. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. వీరి విద్యాభాసం మొత్తం హసన్‌పూర్‌లోనే అయింది. రూబీ బి.ఫార్మాసి తర్వాత ఎం.ఫార్మాసి అన్నామలై యూనివర్సిటీ నుండి చేశారు. తర్వాత ఘాజియాబాద్‌లోని కృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎండ్ టెక్నాలజీలో ఐదేండ్లు ఉద్యోగం చేశారు. డా.ఫాల్గుణితో ప్రేమ వివాహం తర్వాత భర్త ఉద్యోగ రీత్యా సౌత్ కొరియా వెళ్లిపోయారు. అక్కడే ఈమె కూడా రీసెర్చ్‌ర్‌గా ఏడాది పాటు చేశారు. రూబీకి చిన్నప్పటి నుండి ఆర్ట్ అంటే ప్రాణం. సౌత్ కొరియాలో ఉన్నప్పుడు వారాంతపు రోజుల్లో తనకు ఎంతో ఇష్టమైన ఆర్ట్ మీద దృష్టిపెట్టారు.
సృజనాత్మకతకు పదును పెడుతూ
రూబీ పెదనాన్న కైలాష్ చంద్ బైరగి మంచి ఆర్టిస్ట్. ఆయన దగ్గర బాగా చనువు ఉండటంతో వారి దగ్గర డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకునేవారు. కానీ తల్లిదండ్రులకు ఆర్ట్ కంటే చదువు మీదనే ఎక్కువ దృష్టి పెట్టమని వత్తిడి చేసే వారు. అందువల్ల చదువు పూర్తి చేసి వివాహం అయిన తర్వాత తనకు ఇష్టమైన ఆర్ట్‌ను తిరిగి ప్రారంభించారు. విభిన్న రకాల ముగ్గులు పెట్టడంతో పాటు తనలోని సృజనాత్మకతకు పదును పెట్టడం మొదలు పెట్టారు. ఈ లోపు గర్భవతి కావడం, సౌత్ కొరియా నుండి స్వీడన్‌కి బదిలీ కావడం కవల ఆడపిల్లలు పుట్టడం అంతా జరిగిపోయింది. అక్కడ ఏడాది ఉన్న తర్వాత భర్తకు హైదరాబాద్ ఐఐటిలో ఉద్యోగం రావడంతో 2015లో భారతదేశానికి తిరిగొచ్చారు. అలా రూబీ ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
సమ్మర్ క్యాంప్‌తో మొదలై
హైదరాబాద్‌లో ఒక టౌన్ షిప్‌లో వీరు నివాసం ఉండేవారు. వేసవి సెలవుల్లో పిల్లలకు సరదాగా సమ్మర్ క్యాంప్ లాంటిది పెట్టి వాళ్లకు ఏదైనా నేర్పిస్తే బాగుంటుందని చుట్టుపక్కల వాళ్లందరూ అంటుంటే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగో తన కవల పిల్లలు చిన్న వాళ్ళు. వాళ్ళని వదిలేసి ఉద్యోగానికి వెళ్ళటం చాలా కష్టమైన పని. అందుకే ఇంట్లోనే ఉంటూ ఇలా పిల్లలకు కళలు నేర్పిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. అలా వేసవి సెలవుల్లో తమ టౌన్‌షిప్ పిల్లలకు ఆర్ట్, డ్రాయింగ్, క్రాఫ్ట్ నేర్పించడం మొదలుపెట్టారు.
గ్రాఫైట్ డ్రాయింగ్‌లో…
సమ్మర్ క్యాంప్ మొదలుపెట్టిన తర్వాత దానికి మంచి స్పందన వచ్చింది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా నేర్చుకోవడం మొదలుపెట్టారు. రాను రాను నేర్చుకునే వారి సంఖ్య కూడా పెరిగింది. దాంతో ఆమెలో ఆత్మ విశ్వాసం పెరిగింది. నిబ్ పెయింటింగ్, వాటర్ కలర్స్, ఎబోసింగ్, క్లే వర్క్స్, ఎ క్రిలిక్ పెయింటింగ్… ఇలా అనేక రకాల తరగతులు నిర్వహించేవారు. రూబీ గ్రాఫైట్ డ్రాయింగ్‌లో నిష్ణాత్మురాలు. రకరకాల షేడ్స్ ఆమెకు ఎంతో ఇష్టం. ‘భిన్నమైన షేడ్స్ వేస్తున్నప్పుడు ఒక బొమ్మకో, పువ్వుకో, ప్రకృతికో ప్రాణం పోస్తున్నట్లు ఉంటుంది. అది నాకు మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. అంటారు’ ఆమె.
క్లే గణేశ్ తయారీ
2018లో శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించిన క్లే గణేశ్ తయారీలో ఆమె శిక్షణ తీసుకున్నారు. అప్పటి నుండి ఆమె కూడా క్లే గణేశ తయారీ శిక్షణా తరగతులు నిర్వహించడం మొదలు పెట్టారు. దానికి కూడా మంచి స్పందన వచ్చింది. చాలా చోట్ల నుండి తమకు మట్టి గణపతుల తయారీలో శిక్షణ ఇవ్వమంటూ ఆమెను ఆహ్వానించే వారు. అలా ఇన్ఫోసిస్ నుండి కూడా ఆహ్వానాన్ని అందుకని అక్కడ కూడా శిక్షణ తరగతులు నిర్వహించి ప్రశంసా పత్రం అందుకున్నారు.
నచ్చిన బాటలో నడిస్తే తృప్తి
రూబీ గ్రాఫలజిస్ట్ కూడా. చేతి రాతను బట్టి మనుషుల మనస్తత్వాన్ని అంచనా వేస్తారు. ఇప్పటి వరకు నాలుగు వేల మందికి పైగా చేతి రాతల అనాలసిస్ చేయారు. పిల్లల చేతిరాత పైన కూడా బాగా దృష్టిపెడతారు. తనకు నచ్చిన బాటలో నడవటం తనకెంతో సంతృప్తిని ఇస్తుందంటున్నారు. అలాగే తన భర్త ప్రోత్సహం కూడా చాలా ఉందని చెబుతున్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం తన బాధ్యతగా భావించి మట్టి గణపతుల పట్ల అవగాహన కల్పిస్తూ, ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటున్న రూబీ గుప్తా ఎందరికో స్ఫూర్తి దాయకం.
– పాలపర్తి సంధ్యారాణి