Thursday, December 25, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ సమ్మిట్‌లతో సామాన్యులకు ఉపయోగం లేదు

గ్లోబల్‌ సమ్మిట్‌లతో సామాన్యులకు ఉపయోగం లేదు

- Advertisement -

‘ఉపాధి హామీ’కి గాంధీ పేరు తొలగింపు అవమానించడమే
కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలి
రాబోయే ఎన్నికల్లో స్నేహ పార్టీలను కలపుకునిపోవాలి : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని


నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం నేరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు విమర్శించారు. వీబీ జీ రామ్‌ జీ పేరు పెట్టడం గాంధీని అవమానించడమేనని అన్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌, ఫుట్‌బాల్‌ ఆటల్లాంటి వాటివల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మాయా ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అన్నవి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మిథ్యగా మారిందని చెప్పారు. దేవుడిని దేవుడిలా, చరిత్రను చరిత్రలాగా చూడాలి తప్పితే చరిత్రహీనులుగా మిగిలిపోకూడదని అన్నారు.

జీ రామ్‌ జీ పేరుతో పథకం స్వరూపం, నిధుల కేటాయింపులను మార్చిందని చెప్పారు. వ్యవసాయ కూలీలపై కడుపు మంటతో బీజేపీ వారి కడుపు కొడుతోందని అన్నారు. దేశ భక్తులమని చెప్పుకుంటున్న వాళ్లు దేశ భక్తులా… ప్రజలను భక్షించే రాక్షసులా?అని ప్రశ్నించారు. మోడీ దుష్ట పాలన సాగిస్తున్నారని విమర్శించారు. రెండేండ్లు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం తప్పులు చేయకుండా రెండేండ్లు కేసీఆర్‌ ఎందుకు సూచనలు ఇవ్వలేదని అడిగారు. కేసీఆర్‌ డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేస్తున్నదని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు నెలకు రూ.2,500, తులం బంగారం, పెన్షన్‌ రూ.నాలుగు వేలు ఇవ్వాల్సిందేనని కోరారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను తగ్గించడం సరైంది కాదన్నారు.

91 సర్పంచ్‌ స్థానాలు గెలుపు
గ్రామపంచాయతీ ఎన్నికల్లో సీపీఐ బలపరిచిన 91 మంది సర్పంచ్‌లు గెలుపొందారని కూనంనేని చెప్పారు. 104 ఉప సర్పంచ్‌, 950 నుంచి వెయ్యి వరకు వార్డులు గెలిచారని వివరించారు. కమ్యూనిస్టుల ప్రభావం ఉండబోదు అన్న చోట కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులతో జరుగుతాయనీ, పంచాయతీ ఎన్నికల్లో చేసిన తప్పులను చేయొద్దని కోరారు. పిలిచి మాట్లాడాలనీ, స్నేహ పార్టీలను కలుపుకునిపోవాలని సూచించారు. సీపీఐ, సీపీఐ(ఎం) మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు.

జనవరి 18న సీపీఐ వందేండ్ల వేడుకలు
ఈనెల 26న నిర్వహించతలపెట్టిన సీపీఐ వందేండ్ల వేడుకల సభను వాయిదా వేస్తున్నామని కూనంనేని అన్నారు. వచ్చేనెల 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. విదేశాల నుంచి, ఇతర వామపక్ష పార్టీల నుంచి సౌహార్ధ సందేశం ఇవ్వడానికి వస్తారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానిస్తామని అన్నారు. వచ్చేనెల 18,19,20,21 తేదీల్లో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరుగుతాయన్నారు. గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయమని అన్నారు. ఎన్‌ఐఏకి అడ్డూఅదుపు లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలూ ఏకతాటిపైకి రావాలన్నారు. చంద్రబాబు, కేంద్రంపైనా పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఈటి నరసింహ, రాష్ట్ర కార్యర్శివర్గ సభ్యులు బాలనర్సింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -