– సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు
నవతెలంగాణ జైపూర్
ఎగువ నుండి వచ్చి చేరుతున్న వరద నీటితో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల శివారులో గోదావరి నది పొంగిపొర్లుతుంది. బుధవారం రాత్రి నుండి మొదలైన వరద ఉధృతి గురువారం సాయంత్రం వరకు క్రమేపీ పెరుగుతూ వచ్చింది. గురువారం రాత్రి ఏకంగా గోదావరి వరద ఆర్ అండ్ బి రోడ్డు మీదికి వచ్చి చేరింది. కిష్టాపూర్ నుండి పౌనూరు వరకు గోదావరి తీర ప్రాంత పంట పొలాలను వరద ముంచెత్తింది.
వరద ఉధృతి పెరుగుతూ నివాస గృహాలకు సమీపంగా వస్తుందని తెలిసి అధికారులు సంఘటన స్థలానిక చేరుకున్నారు. శ్రీరాంపూర్ సిఐ వేణు చందర్ స్థానిక తహసిల్దార్ వనజా రెడ్డి ఎంపీడీవో సత్యనారాయణ ఎస్సై శ్రీధర్ వరద ఉధృతిని పరిశీలించారు. తీర ప్రాంతాల వారు వరద ఉధృతిని గమనిస్తూ జాగ్రత్త పడాలని హెచ్చరించారు.
విషయం తెలుసుకున్న చెన్నూరు ఎమ్మెల్యే రాష్ట్ర కార్మిక ఘనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని అవసరమైన సందర్భంలో జిల్లా కలెక్టర్ కు సమాచారం అందించాలని తీర ప్రాంత ప్రజలకు సూచన చేశారు.