మొదటి రోజు శైలపుత్రి అవతారంలో దర్శనం..
నవతెలంగాణ – ముధోల్
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఏర్పాటు చేసిన మండపంలో అమ్మవారు మొదటి రోజు భక్తులకు శైలపుత్రి అవతారంలో దర్శనమిచ్చారు. సతీ దేవి యోగాగ్నిలో తనువును త్యాజించిన పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికగా అవతరించినందుకే శైలపుత్రి అనే పేరు వచ్చింది. అమ్మవారి కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో విరాజిల్లుతుంది.
తలపై చంద్రవంకను అమ్మవారు ధరించారు. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో భక్తులు దర్శించుకున్నారు. వేద పండితులు, అర్చకులు మంగళ వాయిద్యాలు వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నైవేద్యంగా కట్టే పొంగలి సమర్పించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఉమ్మడి రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర- కర్ణాటక తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు రోడ్డు, రైలు మార్గాల ద్వారా అధిక సంఖ్యలో హాజరయ్యారు. అమ్మవారి చెంత ప్రవహించే పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు సైతం రాత్రి పూట నిర్వహించనున్నారు.
ప్రారంభమైన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES