- – మినీ కేంద్రాల టీచర్ల వేతనాలు పెంపు
- – 55 మందికి ప్రయోజనం
- – కేంద్రాల్లో హెల్పర్ల సదుపాయం
నవ తెలంగాణ మల్హర్ రావు
అంగన్వాడీలకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది.మహాదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో 13, భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 55 మినీ అంగన్వాడీ కేంద్రాలు అప్డ్ కానున్నాయి.మండల పరిదిలో పివినగర్ లో ఒక్కటిమాత్రమే ఉంది. దీంతో ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు పెరగనున్నాయి. తమను మేజర్ అంగన్వాడీలుగా గుర్తించాలని, సహాయకులను నియమించాలని గత కొన్నేళ్లుగా టీచర్లు ఆందోళనకు చేస్తుండగా, తాజాగా ప్రభుత్వం ఈనిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
జిల్లాలో మొత్తము 644 కేంద్రాలు ఉండగా ఇందులో మేజర్ 589, మినీ కేంద్రాలు55,మహాదేవపూర్ ప్రాజెక్టు పరిధిలో 214 మేజర్,13 మినీ,మండల పరిధిలో 37 మేజర్,ఒకటి మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. పెద్ద సెంటర్లలో టీచర్లకు తోడు హెల్పర్లు (సహాయకులు) ఉన్నారు. చిన్న కేంద్రాల్లో మాత్రం కేవలం టీచర్లను మాత్రమే నియ మించారు. ఈ సెంటర్లకు హెల్పర్లను నియమించక పోవడంతో టీచరే అన్ని పనులు చేయాల్సి వచ్చేది. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతో పాటు పిల్లలు, బాలింతలు, గర్భిణులకు వంట చేసి పెట్టాలి.
ప్రతి రోజు వారి వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయడంతో పాటు రికార్డులు రాయాలి. చిన్నారుల కొలతలు సేకరించాలి. దీంతో పాటు తల్లిపాల విశిష్టత, పౌష్టికాహారం విషయమై గృహ సందర్శన చేసి పిల్లల తల్లులకు అవగాహన కల్పించాలి. ఇలా టీచర్లు పని ఒత్తిడితో నిత్యం సతమతమతం అవు తున్నారు. తమ కేంద్రాలను మేజర్ సెంటర్లుగా గుర్తించి, వేతనాలు పెంచాలని గత కొంతకాలంగా వారు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఎట్టకేలకు వీరి మొరను ప్రభుత్వం ఆలకించింది. మినీ సెంటర్ల టీచర్లను ప్రధాన అంగన్వాడీ టీచర్లుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీరికి పెరిగిన వేతనాలు రూ.13,650 వెంటనే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా మినీ అంగన్ వాడీ టీచర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్నాళ్లకు గుర్తించారు.
– కొలకానీ రజిత, మినీ అంగన్ వాడి టీచర్ – పివి నగర్
మినీ అంగన్వాడీ కేంద్రాల్లో తమకు వేతనాలు తక్కువగా ఉండటంతో పాటు హెల్పర్ల సదుపాయం లేక చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా పెద్ద సెంటర్లకు దీటుగా పనిచేశాం. దీంతో పని భారం పెరిగింది. ఇన్నాళ్లకు ప్రభుత్వం మా మొర ఆలకించింది.
ఇక అన్ని పెద్ద కేంద్రాలే… రాధిక మహాదేవపూర్ సిడిపిఓ
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో 55 మినీ అంగన్ వాడీ కేంద్రాలు అప్ గ్రేడ్ కానున్నాయి. ఈ మేరకు వీటిలో పనిచేసే టీచర్లకు లబ్ది చేకూరుతుంది. వీరికి వేతనాలు పెరగడంతో పాటు ప్రతి కేంద్రానికి హెల్పర్ సదుపాయం కలగునుంది. ఇక మినీ కేంద్రాలన్ని పెద్ద కేంద్రాలుగా మారుతాయి.