నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో క్రూరమృగాల దాడిలో పశువులను కోల్పోయిన రైతులు ఇకపై వేగంగా, నేరుగా పరిహారాన్ని పొందనున్నారు. అటవీ శాఖ చెల్లింపుల ప్రక్రియను సరళీకృతం చేసింది. గతంలో చెక్కుల రూపంలో చెల్లించిన పరిహారాన్ని ఇప్పుడు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయనుంది. దీనివల్ల రైతులకు సమయం ఆదా కావడంతో పాటు, ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు.ఈ నూతన విధానానికి నాగర్‌కర్నూల్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు.
ఇప్పటికే ఈ జిల్లాలో రూ. 2.50 లక్షలను బాధితులకు చెల్లించారు. గతంలో పరిహారం చెక్కుల రూపంలో అందడానికి రెండు వారాల సమయం పట్టేది. ఇప్పుడు ఈ ప్రక్రియ కేవలం ఒక వారంలోనే పూర్తవుతుంది. దీనివల్ల నిరుపేద రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. రైతు తన పశువు క్రూరమృగం దాడిలో చనిపోయిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలి. ఆ వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి, నివేదికను రూపొందిస్తారు. రైతు తన వివరాలు, పశువైద్యుడి ధ్రువపత్రం, బ్యాంకు ఖాతా వంటి సమాచారాన్ని మీసేవ కేంద్రం ద్వారా నమోదు చేయాలి.
జిల్లా అధికారులు నివేదికను పరిశీలించి ఆమోదం తెలిపిన వెంటనే పరిహారం డబ్బులు నేరుగా రైతు బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. ఈ కొత్త విధానం అవినీతికి తావు లేకుండా, సరైన సమయంలో రైతులను ఆదుకోవడానికి సహాయపడుతుంది. పెద్ద పులులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాల దాడులు ఎక్కువగా జరిగే జిల్లాల్లోని రైతులకు ఇది పెద్ద ఊరట.