శంషాబాద్‌లో సీఐ, ఎస్‌ఐ
మహబూబాబాద్‌లో ఎంఈఓ, ఉపాధ్యాయుడు
నవతెలంగాణ-శంషాబాద్/గూడూరు
లంచం తీసుకుంటూ ప్రభుత్వ అధికారులు ఏసీబీకి చిక్కిన ఘటనలు మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బుధవారం చోటుచేసుకున్నాయి. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి నకిలీ సర్టిఫికెట్లతో నకిలీ పాస్‌పోర్ట్టు తయారుచేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. పరిశీలించిన అధికారులు ఫేక్ పాస్‌పోర్టు ఉండటంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై వచ్చాడు. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా అవుట్ పోస్ట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంపత్తి కనకయ్య, ఎస్‌ఐ సిద్దేశ్వర్ అతన్ని వేధించారు. ఈ కేసులో చార్జిషీట్ వేయాలంటే రూ.15 లక్షలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే అతని కుటుంబ సభ్యులను సైతం బాధ్యులను చేస్తామని బెదిరించారు. అయితే బాధితుడు అతని వద్ద అంత డబ్బులు లేవని చెప్పడంతో రూ. 5లక్షలు ఇవ్వాలని ఒత్తిడిచేశారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో రూ.2లక్షలు తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. బాధితుని నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి డబ్బులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు ఎంఈఓ జె.రవికుమార్, మరో ఉపాధ్యాయుడు చంద్రమౌళి రిటైర్మెంట్ బెనిఫిÛట్ పత్రాలు ఇచ్చే క్రమంలో రూ.15వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. మండలంలోని అయోధ్యపురం స్కూల్ కాంప్లెక్స్ పరిధి గుండెంగ గ్రామం భాగ్యతండాకు చెందిన ఉపాధ్యాయుడు దయ్యాల రవీందర్ ఈ నెల రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ బెనిఫిట్ పత్రాల కోసం ఎంఈఓ రవికుమార్‌ను సంప్రదించగా రెండు నెలలుగా తిప్పించుకున్నాడు. ఈ క్రమంలో రూ.50వేలు లంచం ఇవ్వాలని రవీందర్‌ను డిమాండ్ చేయగా ఏసీబీని ఆశ్రయించాడు. కాగా, బుధవారం రవీందర్, చంద్రమౌళికి రూ.15000 ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి వరంగల్ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ సాంబయ్య తెలిపారు.
లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



