తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగించి అప్రతిష్ట మూటకట్టుకున్న కేసీఆర్ గద్దె దిగిన తర్వాత చాలారోజులకు బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం నిర్వాకం సరిగా లేదని, తన పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో వెలుగొందారని, కాంగ్రెస్ ప్రత్యేకంగా వెలగబెడుతున్నది ఏమీ లేదని సెలవిచ్చారు. ఆయన మాత్రం ఏం వెలగబెట్టాడో మాత్రం చెప్పలేదు. పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తానని, దళితులకు మూడెకరాల భూమిస్తానని, నిరుద్యో గులకు ప్రతి నెలా రూ.3వేల పారితోషికం ఇస్తానని, ఉద్యమకారులను గుర్తించి ఆదరిస్తానని అధికారం లోకి రాకముందు వచ్చిన తర్వాత ఇంకా అనేక వాగ్దానాలు చేశారు. ముఖ్యంగా నిరుద్యోగ యువతను మోసం చేశారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ప్రారంభిస్తామని నిర్లక్ష్యం చేశారు. పేదలకు రేషన్‌కార్డులివ్వడం మాట పక్కకే పెట్టారు. ఎనభై వేల పుస్తకాలు చదివి, గోకర్ణ గజకర్ణ టక్కు టమారా విద్యలను ప్రదర్శించిన నేత కేసీఆర్‌గా ఘనత వహించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి రెండుసార్లు అధికారం పొంది ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నిర్లక్ష్యం చేసి ఇప్పుడు అసెంబ్లీకి కూడా ముఖం చూపకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు.
ఇది ఇలా ఉంటే.. ఇక లొటుకు సంసారానికి ఇల్లుటం వచ్చిన అల్లుని లాగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పు మోస్తున్నానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. నెలనెలా వడ్డీలు కట్టడానికే సరిపోతున్నదని వాపోతున్నారు.అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చరా? అనే సందేహం ప్రజల్లో నెలకొంది. మాట మాట్లాడితే అప్పుల గురించే చెబతున్న సీఎం తెలంగాణ అంతకుముందు అప్పుల్లో ఉన్నది తెలియదా? ప్రజలపైన అదనపు పన్నుల భారం వేయద్దని చెప్పడం మంచిదే. కానీ సంక్షేమ పథకాల్ని కొనసాగించడం, వాటికి నిధుల్ని సమకూర్చుకోవడం కూడా అవసరమే కదా. దీన్నిగనుక ప్రస్తుత ప్రభుత్వం విస్మరిస్తే మొదటికే మోసం వస్తుంది. అప్పు పుడతలేదని చెబుతున్న సీఎం, ఆర్థిక వనరుల్ని పెంపొందించే దిశగా ప్రణాళికలు ఎందుకు రూపొందించడం లేదు. భూములమ్మాలని ప్రయత్నించి కోర్టు జోక్యం చేసుకోవడంతో రావడంతో వెనక్కితగ్గారు. ఆర్థిక సమస్యలు తీరాలంటే భూములమ్మడమే పరిష్కారమా? ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పేదల సంక్షేమం, వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్నికల సందర్భంలో దిగజారిన రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని గమనించకుండానే హామీలన్నీ మేనిఫెస్టోలో చేర్చారంటే ఎవరైనా నమ్ముతారా? ప్రభుత్వం అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించలేకపోవచ్చు. కానీ పేద మధ్యతరగతి ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి కదా. తెలంగాణ వస్తే కేసీఆర్ ఏదో చేస్తారని ఆశించిన ప్రజలకు, యువతీ యువకులకు, నిరుద్యోగులకు ఉద్యమకారులకు నిరాశే మిగిల్చి ప్రజల ఆగ్రహాన్ని మూటకట్టుకొని పాలన ముగించుకున్నారు. ఆ పాలనకు చరమగీతం పాడిన విధంగా కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టి ఏడాదిన్నర కావస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి తప్ప కొత్తగా ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రజల్లో చర్చ నడుస్తున్న మాట వాస్తవం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన తెల్లరేషన్ కార్డులు ఇంతవరకు లబ్దిదారులకు అందలేదు. కాల యాపన జరగకుండా, అవినీతికి అవకాశం లేకుండా మంజూరు చేయాల్సిన అవసరం ఉన్నది. 55 ఏండ్లకు మించిన వారికి కొత్త పెన్షన్లు కోరుతున్నారు. వృద్ధాప్య పెన్షన్ రెండు వేల నుండి 4వేల వరకు పెంచి ఇస్తే లక్షలాది పింఛన్ దారులకు మేలు జరుగుతుంది. ఇలాంటి మౌలిక అవసరాలపై దృష్టి పెట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ హామీలను ఎగ్గొట్టే పన్నాగమైతే కాదు కదా?
రాష్ట్రంలో 30 నుండి 40 లక్షల మంది యువతీ యువకులు నిరుద్యోగులున్నారు.గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేసిన ఉపాధి ఉద్యోగ ఆదాయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. రాజీవ్ యువ వికాస పథకం ప్రకటించి 10 నుండి 12 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్టు సమాచారం. అర్హులైన నిరుద్యోగులందరికీ 50 వేల నుండి నాలుగు లక్షల రూపాయల సబ్సిడీ రుణాలను అందజేసి వారి ప్రగతిని ప్రోత్సహించి అభివృద్ధి వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టడం తక్షణ కర్తవ్యంగా భావించాలి. లక్షలాది మంది యువత కనీసం సాధారణ జీవనం గడపడానికి కూడా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించక నిరాశ నిస్పృహలతో గడుపుతున్నారు. తెలంగాణ సాధించుకుని కేవలం భూస్వాములకు, కార్పొరేట్ వ్యాపార సంస్థల యజమానులకు, నాయకులకు కుటుంబ సభ్యులకు మాత్రమే బంగారు తెలంగాణ దక్కిందని, రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువతకు ఒరిగిందేమీ లేదనే విమర్శలు ప్రజల నోళ్లలో నానుతున్నాయి. నిరంతరం కేవలం ఉచిత బియ్యం పంపిణీ, మహిళలకు బతుకమ్మ చీరలు, విస్తృతంగా మద్యం షాపులు సమకూర్చడం వాళ్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ప్రజలకే కొనుగోలు శక్తి పెరిగేలా వారిని ఆర్థికంగా చేయూతనిచ్చే పథకాలు ప్రవేశపెట్టాలి.నిరాశకు గురైన నిరుద్యో గులు ఉద్యమకారులు పట్టుబట్టి గత ఎన్నికల్లో ప్రభుత్వాన్ని మార్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో కృషి చేసిన విషయాన్ని ప్రస్తుత పాలకులు మార్చిపోతున్నట్టు కనిపిస్తున్నది. గ్రామస్థాయి నుండి రాష్ట్ర రాజధాని, ఢిల్లీ , ఇతర దేశాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థి ,యువత, నిరుద్యోగులు, ఉద్యోగులు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమ వంతు కీలక పాత్ర పోషించిన విషయాన్ని గత సర్కార్ విస్మరించింది. కానీ ఇప్పుడు అదే జరిగితే గనుక యువత ముందు కాంగ్రెస్ దోషిగా నిలబడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడం ముఖ్యం.
గత పదేండ్ల నుండి పేదల ఇండ్ల నిర్మాణం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇందిరమ్మ ఇండ్లు యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసి పూర్తి చేయడం మొదటి ప్రాధాన్యత అంశంగా భావించాలి. ఇందులో ఎటువంటి లోటుపాట్లకు తావివ్వరాదు. రాష్ట్రంలో మిర్చి, పసుపు, వరి మొక్కజొన్న, వేరుశనగ, పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించి వ్యవసాయ ఉత్పత్తి పెంచుతూ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ప్రారంభించాలి.రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ప్రతి జిల్లా మండల స్థాయిలో వ్యవసాయ ఆధారిత చిన్న మధ్య తరహా ఆగ్రో ఇండిస్టీస్ సబ్సిడీ రుణాల ద్వారా ప్రోత్సహించాలి. దీని ద్వారా రాష్ట్ర పేద మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి అసమానతలను తగ్గించడానికి ఎంతో ఉపయోగ పడుతుందన్న విషయం ప్రభుత్వం గ్రహించాలి.ఈ దిశగా తగిన చర్యలు చేపట్టడం రాష్ట్ర భవిష్యత్తుకు, ఆర్థిక వికేంద్రీకరణకు పునాదులు వేయడం వంటిదే. ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణం, తెల్ల రేషన్ కార్డుల పంపిణీ, నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ప్రోత్సాహం, ఉద్యమకారుల గుర్తింపు మొదలగు హామీలు సంపూర్ణంగా అమలుచేసి ఇందిరమ్మ రాజ్యం అమలు చేస్తున్నామని చెబితే ప్రజలు నమ్ముతారు, ఆదరిస్తారు. కానీ గత ప్రభుత్వం వలె కేవలం కార్పొరేట్ సంస్థల అభివృద్ధినే తెలంగాణ అభివృద్ధిగా ప్రచారం చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమాత్రం అమయాకులు కాదు, వారు కల్లబొల్లి కబుర్లను నమ్మరు. అందుకే ఎన్నికలకు ముందిచ్చిన హామీలను అమలు చేయాలి. ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించాలి.లేదంటే గత సర్కార్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందనడంలో సందేహం లేదు.
ప్రొ కూరపాటి వెంకట్ నారాయణ
ప్రజలకిచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తున్నదా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES