ఈ-కార్ రేసింగ్ కేసుపై ఏసీబీ దృష్టి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, శాసనసభ్యుడు కే తారకరామారావు( కేటీఆర్)ను విచారించడానికి ఎట్టకేలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతిచ్చారు. ఈ మేరకు గురువారం గవర్నర్ సంతకంతో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ-కార్ రేసింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్, రెండో, మూడో నిందితులుగా హెచ్‌ఎండీఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, సీఈఓ బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు ఫార్ములా-ఈ కంపెనీ నిర్వాహకుల పైన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం విదితమే. ముఖ్యంగా రూ.54.88 కోట్లను ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిర్వాహకులకు రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి కానీ, ఆర్బీఐ నుంచి కానీ ఎలాంటి అనుమతులను పొందకుండా చెల్లింపులు చేశారని వీరిపై ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఈ నిధులను హెచ్‌ఎండీఏ నుంచి మంజూరు చేశారనీ, ఇందుకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మునిసిపల్ వ్యవహారాల శాఖ మంత్రి అయిన కేటీఆర్ అనుమతిచ్చారని ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి, ఏసీబీ అధికారులకు ఇచ్చిన వివరణలో తెలియజేశారు.
ఈ కేసు విచారణను చేపట్టిన ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలతో పాటు కేటీఆర్‌ను నాలుగుమార్లు విచారించారు. చివరికి కోర్టులో చార్జిషీటు వేసి వీరిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర విజిలెన్స్ విభాగానికి నివేదికను పంపించారు. ఆ నివేదికను పరిశీలించిన విజిలెన్స్ అధికారులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిస్తూ మరోవైపు నిబంధనల ప్రకారం కేటీఆర్‌పై చార్జిషీటు వేసి ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అనుమతిని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. దాదాపు రెండు నెలల క్రితం తనకు అందిన ప్రతిపాదనను గవర్నర్‌కు పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు.. కేటీఆర్‌పై చార్జిషీటు వేసి ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతిని కోరారు. ఆనాటి నుంచి గవర్నర్ అనుమతి కోసం అధికారులు చకోర పక్షుల్లా ఎదురు చూశారు. ఎట్టకేలకు గవర్నర్ అనుమతి లభించడంతో కేటీఆర్‌తో పాటు అరవింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి, ఫార్ములా ఈ-కార్ రేసు ప్రతినిధులపై న్యాయపరంగా చర్యలు తీసుకోవడానికి నడుం బిగించారు.
అయితే అరవింద్ కుమార్ సివిల్ సర్వెంట్ కావటం, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా కేంద్రంలోని డీఓపీటీ నుంచి కూడా అనుమతి రావాల్సి ఉన్నది. దీనిపై డీఓపీటీకి లేఖ రాసిన ఏసీబీ అధికారులు.. ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ విషయానికి సంబంధించి డీఓపీటీ నుంచి ఇంకా అనుమతి రావాల్సి ఉన్నది. దీనిపై ఏసీబీ డైరెక్టర్ జనరల్ చారుసిన్హా తన సీనియర్ అధికారులతో సంప్రదింపులు జరిపారు. మరోవైపు ఇప్పటికే ఈ-ఫార్ములా కార్ రేసింగ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేటీఆర్‌తో పాటు ఇతర నిందితులపై పీఎంఎల్‌ఏ కేసులను నమోదు చేయడమేగాక వారిని కూడా విచారించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో తమ అనుమతి లేకుండా విదేశాలకు రూ.54.88 కోట్లకు పైగా నిధులను తరలించినందుకు గానూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్బీఐ రూ.7 కోట్ల జరిమానాను కూడా విధించిన విషయం విధితమే. తాజా పరిణామాల పట్ల బీఆర్‌ఎస్ వర్గాల్లో కేటీఆర్ పట్ల ఏసీబీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, అరెస్ట్ చేస్తారా, చేస్తే ఎప్పుడు చేస్తారనే ఉత్కంఠ నెలకొన్నది.



