- Advertisement -
- సుప్రీంలో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదన
- రాష్ట్రపతి ప్రస్తావనపై కొనసాగుతున్న విచారణ
న్యూఢిల్లీ : బిల్లులను తమ వద్దనే అట్టిపెట్టుకోవడంలో గవర్నర్లకు గల విచక్షణాధికారాలకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లు సుప్రీంకోర్టులో బుధవారం వాదించాయి. చట్టాలను చేయడంలో చట్టసభలకు పాత్ర వుంటుంది తప్ప గవర్నర్లకు అందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. గవర్నర్లకు కేవలం నామమాత్రపు అధికారాలే వుంటాయని పేర్కొన్నాయి. గవర్నర్ల ఇష్టానుసారంమీద ప్రజల అభీష్టం లేదా సంకల్పం ఆధారపడి వుండదన్నాయి. బిల్లును తన వద్దనే సుదీర్ఘకాలం అట్టిపెట్టుకోవడం లేదా దాన్ని తొక్కిపట్టి వుంచడమంటే బిల్లును ఆమోదించడానికి నిరాకరించడమేనని ఆ మూడు రాష్ట్రాలు పేర్కొన్నాయి. బిల్లులను పరిశీలించేటపుడు గవర్నర్ వంటి ఉన్నత రాజ్యాంగ అధికారి చిత్తశుద్ధితోనే వ్యవహరిస్తారని కేంద్రం భావించినట్లైతే రాష్ట్రాల శాసనసభల పట్ల కూడా అదే మర్యాద పాటించాలని, ఆ సభలు కూడా ఉన్నత రాజ్యాంగ వ్యవస్థలేనని ఆ మూడు రాష్ట్రాలు వాదించాయి.
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లుల విషయంలో న్యాయస్థానాలు గవర్నర్లు, రాష్ట్రపతికి కాలపరిమితులను విధించగలవా అంటూ రాష్ట్రపతి పంపిన ప్రస్తావనపై సుప్రీం కోర్టులో ఏడవరోజైన బుధవారం కూడా ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగించింది.
ఈ విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ తరపున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, బిల్లును ఆమోదించడానికే గవర్నర్‌కు బిల్లును పంపుతారని అన్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కావాలంటే రాష్ట్ర చట్టాన్ని రద్దు చేయవచ్చని లేదా కోర్టుల్లో దాన్ని సవాలు చేయవచ్చన్నారు. అయినా ప్రజల సంకల్పాన్ని, వారి అభీష్టాన్ని గౌరవించాల్సి వుందని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు.
హిమాచల్ ప్రదేశ్ తరపున వాదనలు వినిపిస్తున్న కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది ఆనంద్ శర్మ మాట్లాడుతూ, రాష్ట్రపతి లేదా గవర్నర్లు కనీసం పార్లమెంట్‌ను లేదా అసెంబ్లీలను సమావేశపరచడం కూడా చేయరని అన్నారు. ఆ ప్రక్రియ అంతా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రారంభిస్తారని ఆయన చెప్పారు.
కర్ణాటక తరపున గోపాల్ సుబ్రమణియం మాట్లాడుతూ, ఒకే రాష్ట్రంలో ద్వంద్వ పాలన (గవర్నర్ మరియు రాష్ట్ర ప్రభుత్వం)వుండరాదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు.
కపిల్ సిబల్ తన వాదన కొనసాగిస్తూ, గవర్నర్లకు రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను జవాబుదారీతనం లేనివిగా, అపరిమితమైన అధికారాలుగా భావించరాదన్నారు. రాజ్యాంగ సంస్థలు, అధికారులు ఎవరైనా రాజ్యాంగ పరిమితులకు లోబడే పనిచేయాల్సి వుంటుందని అన్నారు. 361వ అధికరణ ప్రకారం గవర్నర్ల చర్యలను కోర్టుల్లో సవాలు చేయలేరని, 200వ అధికరణ ప్రకారం గవర్నర్ తన వద్దనే బిల్లును శాశ్వతంగా అట్టిపెట్టుకోవచ్చంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనల నేపథ్యంలో కపిల్ సిబల్ పై వాదన కొనసాగించారు. ‘సాధ్యమైనంత త్వరగా’ బిల్లును ఆమోదించాలంటే ‘వెంటనే లేదా తక్షణమే’ అని అర్ధమని సిబల్ చెప్పారు. బిల్లులు వేచి వుండలేవని ఆయన వ్యాఖ్యానించారు.
- Advertisement -