Tuesday, November 11, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీవో 34ను అమలు చేయాలి

జీవో 34ను అమలు చేయాలి

- Advertisement -

ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య
నవతెలంగాణ-సంగారెడ్డి
వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలనే జీవో 34ను అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని తెలిపారు. సోమవారం వికలాంగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎన్‌పీఆర్‌డీ సంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం-34 ద్వారా మహిళా, శిశు, సంక్షేమ శాఖ, వికలాంగుల సంక్షేమ శాఖ మధ్య జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగులను సర్దుబాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించాలని 2022 డిసెంబర్‌ 2వ తేదీన ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. వికలాంగుల సంక్షేమం, నిర్వహణ కోసం జిల్లా స్థాయి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ను తిరిగి నియమించాలని డిమాండ్‌ చేశారు.

వికలాంగుల శాఖను ప్రత్యేకంగా కొనసాగించాలని గత ప్రభుత్వం హయాంలో ఎన్‌పీఆర్‌డీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహించమన్నారు. పోరాటాలకు తలొగ్గిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీవో 34ను విడుదల చేసిందని గుర్తుచేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జీవోను అమలు చేయడంలో తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.బస్వరాజు, కె.నర్సింలు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు అవుతున్నా అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా వికలాంగులకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. పింఛన్లు రూ.6000లకు పెంచుతామని హామీ ఇచ్చి పెంచకుండా ఎందుకు కాలయాపన చేస్తుందని ప్రశ్నించారు. పైగా 2 లక్షల మంది చేయూత పింఛన్లను రద్దు చేశారని వాపోయారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు లలిత, రాంచందర్‌, సంగమేష్‌, సహాయ కార్యదర్శులు శంకర్‌ నాయక్‌, శివరాజు, జిల్లా నాయకులు నావజ్‌, సుమలత, సుభాష్‌, భారత్‌, వీరేశం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -