Wednesday, May 21, 2025
Homeఎడిట్ పేజిధాన్యం విలవిల!

ధాన్యం విలవిల!

- Advertisement -


ధాన్యం రాశి విలవిలబోయింది
కుప్పకొచ్చిన గింజ
నలిగిపోతుంటే
రేటు రాని కాలాన్ని పట్టుకుని
వెక్కిళ్లు పెట్టి అంగలార్చింది
తడిసిపోయి తంటాలు
పడుతుంటే
తల తిప్పి చూడని తీరును
చూసి లోలోపల కుమిలిపోయింది

రైతు ముఖంలో ఆందోళన
నానాటికీ పెరిగిపోతూ
కనిపిస్తుంటే
దుక్కి దున్నిన నాగలి
కన్నీటి పర్యంతమై
రగిలిపోయింది
చేతికొచ్చిన పంట నోటికి
రాకపోయేసరికి
పంట చేలు పడి పడిఏడ్చింది
వేసిన సత్తువ కాలువ
పాలవుతుంటే
నేలతల్లి తల దించుకుని
బాధపడింది
కూలీ నాలి పోను
కూసింతైనా చేతికి అందని
ఫలాన్ని చూసి
గోరుచుట్టూ రోకలిపోటైంది
మన్ను మీదేసుకున్న కష్టానికి
వెన్ను విరిగిన రేటును చూశాక
ముద్దనోటి కాడికి
రాకుండా పోయింది
సద్దుమనిగిన రైతు బతుకులో
పొద్దు పొడవకుండానే పోయింది

గింజల్ని విదిలించిన కంకి
పగలబడి నవ్వుతూ వుంటే
ధాన్యరాశి తలదించుకుని
కూర్చుంది
గిట్టుబాటు ధర కరువైన
పంట నష్టం ఊబిలో
కూరుకుపోతుంటే
రైతు జీవనంలో వెలుగు
మాయమైంది
ధాన్యం విలవిలలాడింది

నరెద్దుల రాజారెడ్డి,
9666016636

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -