సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ – మహబూబాబాద్
గ్రామ పంచాయితీ సిబ్బంది ఉద్యోగ భద్రతతో పాటు హక్కుల పరిరక్షణకై నిరంతరం పోరాడుతున్న తెలంగాణ గ్రామ పంచాయితీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర 5వ మహాసభలు అక్టోబర్ 8,9 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో నిర్వహించనున్నట్టు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పాలడుగు భాస్కర్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జగన్నాధం భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మల్టీ పర్పస్ వర్కర్ విధానంతో పంచాయతీ కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, నైపుణ్యం లేని పనులు చేయడం వల్ల అనేకమంది చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రాంతాల్లో ఆదివారం, పండుగలకు సైతం సెలవులు ఇవ్వకుండా వెట్టి చాకిరీ చేయించుకుం టున్నారని విమర్శించారు. వేతనాలు సకాలంలో అందక కార్మికులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ చానెల్ ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులకు కనీస వేతనం రూ.26వేలతో పాటు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర మహాసభల్లో చర్చించి తగిన కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మహాసభల జయప్రదానికి గ్రామ పంచాయితీ సిబ్బందితో పాటు ఉద్యమ శ్రేయోభిలా షులు సహకరించి జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.సుధాకర్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి కుంట ఉపేందర్, జిల్లా ఉపాధ్యక్షులు కందునూరి శ్రీనివాస్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి బండ్ల అప్పిరెడ్డి, నాయకులు ఎండీ మొయినుద్దీన్, ధర్మారపు సుధాకర్, ఎస్.కే లతీఫ్, ప్రసాద్, ఉపేంద్రాచారీ, అశోక్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 8,9 తేదీల్లో గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర మహాసభలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES