ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయండి
సీఎం రేవంత్‌రెడ్డిని కోరిన బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలనీ, నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. గురువారం హైదరాబాద్‌లోని అసెంబ్లీలో బీసీ ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యింది. నాలుగు ప్రధాన డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసింది.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా తాము అధికారంలోకి రాగానే మహాత్మా జ్యోతిబాపూలే పేరుతో బీసీ సబ్ ప్లాన్ చట్టం చేస్తామని, ప్రతి ఆర్థిక సంవత్సరంలో బీసీల సంక్షేమానికి 20వేల కోట్లు కేటాయించి ఐదేండ్లకు లక్ష కోట్లు రూపాయలు బీసీల అభివృద్ధికి ఖర్చు చేస్తామని, ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా ర్యాంకుతో నిమిత్తం లేకుండా పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో స్పష్టంగా హామీ ఇచ్చిన విషయాన్ని సీఎంకు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
60 శాతం జనాభా ఉన్నబీసీలకు బడ్జెట్‌లో 3.8 శాతం నిధులు కేటాయించి అందులో ఒక శాతం లోపే ఖర్చుపెట్టడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ, ఎంబీసీ, సంచార జాతుల ఫెడరేషన్, బీసీ కులాల ఫెడరేషన్లకు అడపదడపా నిధులు కేటాయించిన వాటిని ఖర్చు చేయట్లేదని ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రెండేండ్లు, కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల పాటు ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో పెట్టాయని వివరించారు. దీంతో రాష్ట్రంలో 22 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బీసీ సబ్‌ప్లాన్‌కు ఈ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలనీ, బీసీల సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం రూ.20 వేల కోట్లకు పెంచి ఖర్చుచేయాలని విన్నవించారు.
ర్యాంకులతో నిమిత్తం లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు అమలు చేయాలని కోరారు. నాలుగేండ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7, 500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ భేటీలో సీఎంతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మైనింగ్ కార్పొరేషన్ చైర్మెన్ ఈరవతి అనిల్, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మెన్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్ చారి, ప్రొఫెసర్ ఏం.బాగయ్య, ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, తాటికొండ విక్రంశీగౌడ్, ఎం. శేఖర్ సగర, డాక్టర్ నీలకంటేశ్వరరావు, మడత వెంకట్ గౌడ్, వల్లపు శివకుమార్, అనంతోజు బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.
బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



