కాంబాట్ క్షిపణుల కొనుగోలుకు రక్షణ శాఖ సుముఖత
ఫ్రాన్స్, భారత్ డీల్‌పై ప్రతిపక్షాలు, పౌరసమాజం అభ్యంతరాలు
న్యూఢిల్లీ : రూ.3.60 లక్షల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీఏసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో 114 రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వీటిలో చాలా విమానాలను ‘మేక్ ఇన్ ఇండియా’ కింద భారత్‌లోనే తయారు చేయనున్నారు. అదే విధంగా, సుదూర లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే ‘కాంబ్యాట్ క్షిపణుల’ కొనుగోలుకు అనుమతి లభించింది.
నిఘా, టెలికమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ఉపయోగించే ఎయిర్‌షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లకు డీఏసీ ఆమోదం తెలిపింది. యాంటీ ట్యాంక్ మైన్స్, పీ-8ఐ విమానాలు, మెరైన్ గ్యాస్ టర్బైన్ జనరేటర్లు వంటి కీలక యుద్ధ పరికరాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణశాఖ తెలిపింది. అయితే రాఫెల్ విమానాల కోనుగోలు విషయంలో ప్రతిపక్షాలు ,పౌరసమాజం అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే.



