టీజీఏఆర్‌ఐఈఏ ప్రధాన కార్యదర్శి మధుసూదన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గురుకుల విద్యాసంస్థల్లో 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు ఈనెల 24 వరకు న్యాయం చేయాలని టీజీఏఆర్‌ఐఈఏ ప్రధాన కార్యదర్శి ఏ మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈనెల 25న 150 మంది గురుకుల ఉపాధ్యాయులు హైదరాబాద్‌లో బస్సుయాత్ర నిర్వహిస్తారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో 317 జీవో బాధితుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మధుసూదన్ మాట్లాడుతూ ఎస్సీ గురుకుల సొసైటీలో 317 జీవో అమల్లో జరిగిన వక్రీకరణలు, సంబంధం లేని జోన్‌లో కూడా ఉపాధ్యాయులను బదిలీ చేసి అవకతవకలు జరిగాయని చెప్పారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను కలిసి సొసైటీల్లో జరిగిన అన్యాయం, అక్రమాల గురించి వివరిస్తామని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు, ముగ్గురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గురుకుల కార్యదర్శిని కలుస్తామని చెప్పారు. 317 జీవో వల్ల స్థానికత కోల్పోయి ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయం గురించి వివరిస్తామని అన్నారు. 371-డీ ఆర్టికల్‌కు రాష్ట్రపతి ఉత్తర్వులు-2018 వ్యతిరేకమని వివరించారు. దాని ఆధారంగా ఇచ్చిన 317 జీవో వల్ల చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్థానికత కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఏఆర్‌ఐఈఏ ప్రధాన కార్యదర్శిఎస్ గణేష్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు జనార్ధన్, బిక్షం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
25న గురుకుల ఉపాధ్యాయుల బస్సుయాత్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES