వందలాదిగా వీసా అపాయింట్‌మెంట్లు రద్దు
ట్రంప్ దెబ్బకు భారతీయ కుటుంబాలకు చిక్కులు
సోషల్ మీడియా ఖాతాల స్క్రూటినీ నిబంధనతో ఇబ్బందులు
న్యూఢిల్లీ : అమెరికాకు రావాలనుకునేవారి సోషల్ మీడియా అకౌంట్‌లను సునిశితంగా పరిశీలించాల్సిందేనని ఇటీవల అమెరికా విదేశాంగ శాఖ కొత్తగా తీసుకువచ్చిన విధానంతో వందలాది భారతీయ హెచ్-1బీ వీసాదారులు, వారి కుటుంబాలు భారత్‌లో చిక్కుకు పోయాయి. ఈ పరిస్థితి మూకుమ్మడిగా వీసా నియామకాల రద్దుకు, రీ షెడ్యూలింగ్‌కు దారి తీసింది. దీనివల్ల అనేకమంది ఉద్యోగాలు ప్రతిష్టంభనలో పడ్డాయి, వారి కుటుంబ జీవితాలకు అంతరాయం కలిగింది. హెచ్-1బీ వీసాలపై వున్న వందలాదిమంది భారతీయులు వారితో పాటూ హెచ్-4 మీద ఆధారపడిన వారి భాగస్వాములు, వారిపిల్లలు అందరూ కూడా భారత్‌లోనే వుండిపోయారు. కొన్ని కేసుల్లో, కుటుంబాలు విడిపోయాయి. కొంతమంది కుటుంబ సభ్యులు అమెరికాలో వుంటే మరికొంతమంది కుటుంబ సభ్యులు భారత్‌లో వుంటున్నారు. వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి, అంతులేని జాప్యం కొనసాగుతోంది.
ఈ గందరగోళం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సోషల్ మీడియా పోస్టుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో వారి ఆవేదన స్పష్టంగా వెల్లడవుతోంది. ఉద్యోగాలు ఎంతోకాలం వుండకపోవచ్చు, పాఠశాలలకు అటంకాలు కలుగుతున్నాయి. పిల్లలు వారి కుటుంబాల నుండి వేరుపడుతున్నారు. ఈ నెల మధ్య నుండి చివరి వరకు గల ఇంటర్వ్యూలన్నింటినీ అమెరికా కాన్సులేట్లు రద్దు చేశాయి. చాలా అప్పాయింట్‌మెంట్లను వచ్చే ఏడాది మార్చికి వాయిదా వేశారు. మరికొన్నింటి జూన్ వరకు వెళ్ళిపోయాయి. ఇంతటి పెను మార్పులకు కారణం అమెరికా విదేశాంగ శాఖ తీసుకువచ్చిన కొత్త విధానమే. డిసెంబరు 15నుంచి హెచ్-1బీ, హెచ్-4 దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అదనపు ప్రక్రియతో ప్రతి రోజు చేయాల్సిన ఇంటర్వ్యూల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
మూకుమ్మడి రద్దులు కూడా చోటు చేసుకున్నాయి. మీ వీసా అప్పాయింట్‌మెంట్ రీ షెడ్యూల్ అయిందని మీకు ఈ మెయిల్ వచ్చినట్లైతే మీకు కొత్త అప్పాయింట్‌మెంట్ తేదీనివ్వడంలో మిషన్ ఇండియా మీకు సాయపడుతుంది అంటూ భారత్‌లోని అమెరికా ఎంబసీ ఎక్స్‌లో పోస్టు పెట్టింది. దానికి వచ్చిన ప్రతిస్పందనలు చూస్తుంటే సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాల్లో పరిస్థితులు తేటతెల్లమవుతున్నాయి. ”దయచేసి ఈ మార్పులు చేయడానికి ముందుగా, భారత్‌కు వచ్చిన వారు తిరిగి వెనక్కి వెళ్ళే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఒకరు అభ్యర్ధించారు. ఇక్కడ ఇరుక్కుపోవడం వల్ల తమ ఉద్యోగాలకు సంబంధించి, అమెరికా పౌరులైన పిల్లల చదువుకు సంబంధించి చాలా తీవ్రమైన సవాళ్ళు ఎదురవు తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. త్వరగా కాన్సులార్ అప్పాయింట్‌మెంట్లు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రతి ఒక్కరిదీ కన్నీటి కథే !
”వారాల తరబడి ప్రయత్నాలు చేసిన తర్వాత సెప్టెంబరులో హెచ్-1బీ వీసా స్లాట్ బుక్ చేసుకున్నా, డిసెంబరు 18న అపాయింట్‌మెంట్. ఇప్పుడు అది అకస్మాత్తుగా మార్చి 30కి వెళ్ళిపోయింది. జనవరి ప్రారంభానికల్లా మేం అక్కడ వుండాలి, మా పిల్లలు స్కూలుకి వెళ్ళాలి, త్వరగా సాయం చేయండి అంటూ మరొకరు వేడుకున్నారు. ఇమ్మిగ్రేషన్ డాట్ కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్ ఖన్నా స్పందిస్తూ ఈ పరిస్థితిని అత్యంత దారుణమైనదిగా అభివర్ణించారు. కొత్త అప్పాయింట్‌మెంట్ తేదీకి వారు రాలేని పక్షంలో రీషెడ్యూల్ చేసుకోవడానికి ఒకే ఒక అవకాశం వుంటుందని, ఈలోగా ఫీజు చెల్లించిన సమయం ఏడాది దాటిపోతే ఇక అది మురిగిపోయినట్టే అవుతుందని చెప్పారు. ఈ పరిస్థితి వల్ల చాలామంది హెచ్-1బీ వర్కర్లు వారి ఉద్యోగాలను కోల్పోతారని ఇమ్మిగ్రేషన్ అటార్నీ ఎలెన్ ఫ్రీమన్ హెచ్చరించారు. ఈలోగా భారత్ నుండి పనిచేసేందుకు లేదా సుదీర్ఘమైన శలవు తీసుకున్నట్లుగా పరిగణించాలని యజమానులను కోరాల్సి వుందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో, ఒత్తిళ్ళల్లో ఎంప్లాయర్లు ఎవరూ కూడా అంతకాలం వేచి వుండలేరన్నారు.
చెల్లింపుల పరిస్థితేంటి ?
ఈలోగా అమెరికాలో కారు చెల్లింపులు, నీరు, విద్యుత్ వాడకం వంటి యూజర్ చార్జీలు, అపాయింట్‌మెంట్ లీజులు ఇవన్నీ కూడా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితులు ఎదురవుతాయన్నారు. వాటివల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై, ప్రజలపై అంతులేని ఇబ్బందులు పడతాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్క వీసా రద్దు వెనక గల మానవీయ కోణాలు, కథనాలు ఇవి.



