ఫిబ్రవరి నాటికి గణనీయ మార్పులు
అమెరికా వాణిజ్య మంత్రి లుత్నిక్
న్యూయార్క్ : హెచ్1బీ వీసాలు ‘లాటరీ’ వంటివని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ వ్యాఖ్యానించారు. దాని ద్వారా నిపుణులైన ఉద్యోగులను దేశానికి ఎందుకు రప్పించుకోవాలని ఆయన ప్రశ్నించారు. దానిలో అర్థమేలేదని అన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరికి ముందు హెచ్1బీ వీసా ప్రక్రియలో గణనీయమైన మార్పులు జరుగుతాయని చెప్పారు. చౌకగా లభించే టెక్ కన్సల్టెంట్లు అమెరికాకు వచ్చి వారి కుటుంబాలను కూడా తీసుకురావాలని అనుకోవడం తప్పని న్యూస్ నేషన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ‘వీసా ప్రక్రియలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. వారు మార్పుల గురించి మాట్లాడు తుంటారు. లాటరీ ఎలా పొందాలి అని.
అయితే అది ఇప్పటికీ లాటరీగానే ఉండిపోవాలా? అదంతా ఫిబ్రవరి నాటికి పరిష్కారం అవుతుంది’ అని అన్నారు. అమెరికాకు వచ్చే నిపుణుల కోసం లాటరీ తీయడం వింత అని టెక్ కంపెనీల అధిపతులు తనతో అన్నారని లుత్నిక్ చెప్పారు. నిపుణులను లాటరీ ద్వారా ఎందుకు దేశంలోకి తెచ్చుకోవాలని ఆయన ప్రశ్నించారు. వీసాలు 7-10 రెట్లు అధికంగా సబ్‌స్రైబ్ అయ్యాయని, అందులో 74 శాతం టెక్ కన్సల్టెంట్లేనని అన్నారు. హెచ్1బీ వీసాలు టెక్ కన్సల్టెంట్ల కోసమా అని ప్రశ్నించారు. విద్యావేత్తలు, వైద్యులకు కేవలం నాలుగు శాతం వీసాలు మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు.