ఖమేనీ కదలికలను పసిగట్టిన ఇజ్రాయిల్
టెహ్రాన్ : అమెరికా-ఇజ్రాయిల్ సేనల వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఖమేనీ కదలికలను అమెరికా, ఇజ్రాయిల్ ఎలా పసిగట్టాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇరాన్ ట్రాఫిక్ కెమెరాలను ఇజ్రాయిల్ అనేక ఏండ్లుగా హ్యాక్ చేస్తోంది. అదే సమయంలో మొబైల్ ఫోన్ వ్యవస్థలలో చొరబడుతోంది. తద్వారా అలీ ఖమేనీ కదలికలను, ఆయన భద్రతకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అదునుకోసం వేచి చూసింది. చివరికి వైమానిక దాడిలో ఆయనను హతమార్చింది. రాజధాని టెహ్రాన్‌లో అమర్చిన దాదాపు అన్ని ట్రాఫిక్ కెమేరాలను హ్యాక్ చేయడం జరిగిందని ఇజ్రాయిల్ మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు, ఆపరేషన్‌లో భాగస్వాములైన ఇతరులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక తెలిపింది. ట్రాఫిక్ కెమెరాల ఫుటేజ్‌లను టెల్ అవీవ్, దక్షిణ ఇజ్రాయిల్‌లోని సర్వర్లకు చేరవేశారని చెప్పింది.
ముఖ్యంగా ఓ కెమెరా యాంగిల్‌ను అత్యంత విలువైనదిగా గుర్తించారు. అంగరక్షకులు తమ వామనాలను ఎక్కడ నిలుపుతారు, పాశ్చర్ వీధిలోని ప్రాంగణంలోకి ప్రతి రోజూ ఎలా వెళతారు వంటి దృశ్యాలను అది రికార్డు చేసింది. ఖమేనీ రోజువారీ కార్యక్రమాలను అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు నిశితంగా అధ్యయనం చేసే వారని సీఎన్‌ఎన్ వార్తా సంస్థ తెలిపింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు, ఆయన ఎవరెవరిని కలుసుకుంటారు, ఒకవేళ దాడి జరిగితే ఆ సమాచారాన్ని ఆయనకు ఎలా చేరవేస్తారు, ఆయనను ఎక్కడికి తప్పిస్తారు వంటి సమాచారం యావత్తూ ఇజ్రాయిల్‌కు చేరింది. ఖమేనీతో సీనియర్ రాజకీయ నేతలు, సైనికాధికారులు ఎక్కడ సమావేశమయ్యేదీ కూడా ఇజ్రాయిల్ తెలుసుకుంది. ఖమేనీ సహా ఇరాన్ అధికారులు శనివారం ఉదయం ఓ ప్రాంగణంలోని వేర్వేరు ప్రదేశాలలో సమావేశం కావాల్సి ఉంది.
ఆ ప్రాంగణంలోనే ఖమేనీ కార్యాలయాలు ఉన్నాయి. రాత్రి సమయంలో దాడులు జరపాలని ఇజ్రాయిల్, అమెరికాలు ముందుగా అనుకున్నప్పటికీ వాటిని ఉదయం వేళకు మార్చారు. ఇజ్రాయిల్ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఆరు గంటలకు యుద్ధ విమానాల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను ఆ ప్రాంగణంలోకి జారవిడిచారు. కేవలం 60 సెకన్ల వ్యవధిలోనే వైమానిక దాడులు మూడు లక్ష్యాలను తాకాయి. ఖమేనీని, రివల్యూషనరీ గార్డ్స్ అధినేత సహా 40 మంది సీనియర్ అధికారులను అంతం చేశాయి. ఖమేనీ మరణానంతరం మరింతగా రెచ్చిపోయిన అమెరికా దళాలు 1,250 లక్ష్యాలపై దాడులు చేశాయి. 11 నౌకలను ధ్వంసం చేశాయి. మరో 10 యుద్ధ నౌకలను సముద్రంలో ముంచేశాయి. హార్ముజ్ జలసంధి వద్ద 780 నౌకలు ఆగిపోయాయి. ఆరుగురు అమెరికన్ సైనికులు చనిపోయారు. ట్రంప్ బెదిరింపులు ఆగడం లేదు.



