అందరమూ నడుస్తాం…ఆ నడకలో అడుగు ముందుకే వేస్తాం…ఎవరైనా వెనకడుగేస్తూ నడిచేవారుంటారా..? ఉంటే అది నడకవుతుందా..? కనుక నడకెప్పుడూ ముందుకే సాగుతుంది. కాకపోతే ముందుకు సాగుతున్నవాళ్లను ‘ఆగండి’ అని ఆపేవాళ్లూ, అది విని ఆగిపోయేవాళ్లూ ఉంటారు! కానీ, ఆగకుండా ముందుకు నడిచేవాళ్లదే ఈ ప్రపంచం అంటాడు శ్రీశ్రీ. అందుకే….
”పదండి ముందుకు..పదండి తోసుకు..పోదాం పోదాం పైపైకి” అన్న ఆయన పొలికేక ఈ నేలపై మహాప్రస్థానమై సాగుతోంది. నేటి వర్తమానానికీ, రేపటి భవిష్యత్తుకూ వైతాళిక గీతమై మోగుతోంది. సామాన్యుణ్ణి మాన్యునిగా మలుస్తూ, శ్రీశ్రీని మహాకవిగా నిలుపుతోంది. సారస్వత లోకంలో అతడినొక మహామనీషిగా చాటుతోంది.
‘పులి చంపిన లేడి నెత్తురు.. ఎగరేసిన ఎర్రనిజెండా
రుద్రాలిక నయన జ్వాలిక.. కలకత్తా కాళిక నాలిక
కావాలోరు నవకవనానికి”
అంటూ తెలుగు కవిత్వాన్ని వెలుగుల తీరాలకు నడిపించాడు శ్రీశ్రీ. కవిత్వంలోనే కాదు, జీవితంలోనూ ఎర్రజెండాను వీడనివాడు శ్రీశ్రీ. ఆయన కేవలం కవి, విశ్లేషకుడు, విమర్శకుడు మాత్రమే కాదు.. నిఖార్సయిన మార్క్సిస్టు కూడా! అందుకే తన సమకాలికులైన ఎందరో మహామహుల మధ్య ఆయనదొక ప్రత్యేక స్థానం. ‘నా హృదయం పరిశుభ్రమే కాక పవిత్ర లక్ష్య పూరితం కూడా’ అనగలిగిన చిత్తశుద్ధి, ‘ఈ శతాబ్దం నాది’ అని చెప్పుకొగలిగిన ఆత్మవిశ్వాసం ఆయన సొంతం. కనుకనే జన సామాన్యంలోకి తన భావప్రసారాన్ని చండిపచండంగా పరవళ్లు తొక్కించగలిగాడు.
భావ ప్రసారానికి సాహిత్యాన్ని మించిన సాధనం లేదు. సాహిత్యమే లేకపోతే భావాలన్నీ దాదాపు యథాతధ స్థితిలోనే ఉంటాయి. సాహిత్యం ఒక లోతైన అనుభూతినీ అవగాహననూ ఇచ్చి, భావాలను హృదయపు లోతుల్లో పాదుకొల్పగలదు. ”ఇంతవరకూ తత్వవేత్తలందరూ ప్రపంచాన్ని నిర్వచించారు. చెయ్యవలసింది దాన్ని మార్చడం” అంటాడు మార్క్స్. ఈ మార్పుకు వర్గపోరాటమే చోధకశక్తి అని చెప్పడంతోపాటు, ఈ సిద్ధాంత వ్యాప్తికి సాహిత్యం ఓ అతి ముఖ్యమైన ఉపకరణమని కూడా భావించాడాయన. అందుకే తన విశ్లేషణలకు గాథే, షేక్స్‌పియర్‌లాంటి మహామహుల రచనలను ఉపయోగించుకున్నాడు. ఈ నేలమీద సామ్యవాద సిద్ధాంతాన్ని స్థాపించిన మార్క్స్, ఎంగెల్స్‌గానీ, దాని రాజకీయ కార్యాచరణాపరులైన లెనిన్, మావో, హోచిమిన్, చే వంటి నేతలుగానీ గొప్ప సాహిత్యాభిరుచితోపాటు స్వయంగా సాహిత్యానుభవం కూడా కలిగిన వాళ్లు. తాత్విక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విషయాల్లో గొప్ప మేధావులై, అన్ని రంగాలకూ ఒక సమగ్రమైన ప్రపంచ దర్శనాన్ని నిర్ధారించినవాళ్లు. దానినే మనం ‘మార్క్సిస్టు ధృక్పథం’ అంటున్నాం. ఆ చూపును నిర్మించడంలో వీరందరికీ సాహిత్యం కూడా ఒక ప్రధానమైన అంశం అన్నది మరువరాదు. కనుకనే మానవాళికి ఓ అద్భుతమైన ప్రాపంచిక దృక్పథంగా మార్క్సిజం పురోగమించింది. ఆ వెలుగులోనే శ్రీశ్రీ కవిత్వం కూడా దిక్కులను తాకింది.
ఎంతటి మేధావులైనా సాహిత్యానుభూతిలో గాఢత లేనప్పుడు భావాలను బాగా వివరించగలరేమోగానీ హృదయాలను పండించలేరు. ఈ కారణంగానే భావ వ్యాప్తికి సాహిత్యరంగాన్ని ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగించాలని మార్క్సిస్టు సిద్ధాంతం చెపుతుంది. సాహిత్యంలోని ఆ గాఢతను, అనుభూతిని ఎంతగానో పొందితే తప్ప మార్క్స్‌కు షేక్స్‌పియర్, లెనిన్‌కు గోర్కీ అంత ఇష్టమైన రచయితలు కాజాలరు. మార్క్సిస్టు భావాల పదునుకు, అక్షరాల అనుభూతి తోడయ్యింది గనుకనే ప్రపంచంలో మార్క్సిజం కేవలం రాజకీయ, ఆర్థిక, సామాజిక తత్వశాస్త్రంగానే కాక ‘కళాతత్వశాస్త్రం”గా కూడా అభివృద్ధి చెందింది. దాన్నే మనం ‘మార్క్సిస్టు సౌందర్య శాస్త్రం’ (marxist easthatics) అంటున్నాం.
సాహిత్యంలో కథ, కవిత్వం, నవల, నాటకం, పాట, పద్యం, వినోదం, విజ్ఞానాన్నందించే రకరకాల రచనలన్నీ వివిధ ప్రక్రియలు. వీటిలో రెండంశాలు అతి ప్రధానమైనవి. ఒకటి వస్తువు, రెండవది శిల్పం(సారం రూపం). ఏ ప్రక్రియలోనైనా ఈ రెండింటిలో ఏది ప్రధానం అన్నది తేల్చుకోగలిగితేగానీ ఉత్తమ సాహిత్య సృష్టికి అవకాశముండదు. కేవలం శిల్పానికే ప్రాధాన్యతనిచ్చే ప్రాచీన సాహిత్యంగానీ, అదే ఒరవడిలో నేటి పెట్టుబడిదారీ వ్యవస్థను సుస్థిరం చేయచూస్తున్న పాశ్చాత్య సాహిత్యంగానీ అనుభూతి ప్రధానమైన ఆకర్షణలతోనే నిండి ఉంటాయి తప్ప వాటిలో అభ్యుదయానికి నడిపించే అంతస్సారమేమీ ఉండదు. ఎందు కంటే మార్క్స్ చెప్పినట్టు ఈ ప్రపంచాన్ని మార్చే దృష్టే లేకపోతే ఆ సాహిత్యంలో శిల్పమే ప్రధానమై కూర్చుంటుంది! అందుకే సామ్యవాద సాహిత్యమెప్పుడూ వస్తువుకు ప్రాధాన్యమిస్తుంది. అంటే దీనర్థం శిల్పానిది రెండవ స్థానమని కాదు, ఈ రెండింటిని సమపాళ్లలో మేళవించగలిగితేనే అది ఉత్తమ సాహిత్యమూ ప్రజా సాహిత్యమూ అవుతుంది. అప్పుడు మాత్రమే అది ఉత్తమ అనుభూతులతోపాటు ఉత్తమ అభిరుచులను, ఆలోచనలను నిర్మించగలుగుతుంది. అటువంటి సాహిత్య సృష్టి మాత్రమే భావజాలరంగంలో శక్తివంతంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది.
తెలుగునాట ఆ కర్తవ్యాన్ని అద్వితీయంగా నిర్వహించాడు శ్రీశ్రీ. ”ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం… నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం” అన్న అభివ్యక్తిలోనూ, ప్రభువెక్కిన పల్లకీని కాక అది మోసిన బోయులనుగాంచిన చూపులోనూ ఆయన వర్గదృష్టితోపాటు వస్తు శిల్పాల మేళవింపు స్పష్టంగా కనిపిస్తుంది. ‘దేశ చరిత్రలు’, ‘ప్రతిజ్ఞ’ అందుకు కొన్ని మచ్చుతునకలు మాత్రమే. పాబ్లో నెరుడా కవితానువాదంలోనూ ఈ మేళవింపును అద్భుతంగా పండించాడు శ్రీశ్రీ.
‘ఆ చుక్కల చారల అమెరికన్ జెండా అర్థమేంటో తెలుసా? చుక్కలు అసలు చారలు వడ్డీ’ అంటూ దాని పెట్టుబడిదారీ స్వభావాన్ని బట్టబయలు చేస్తాడు.
అదే సందర్భంలో…
‘సుత్తీ కొడవలికి అర్థం చెప్పనా? సుత్తి సూర్యుడు..కొడవలి చంద్రుడు’ అని హృద్యంగా చెపుతాడు.
అలా ఆయన తన ప్రతి రచనలోనూ అద్భుతమైన వస్తు, శిల్పకళా నైపుణ్యాలతో మార్క్సిజాన్ని అత్యున్నత మానవతా వాదంగా ఆవిష్కరిస్తాడు. అందుకు కారణం ఆయన మార్క్సిజాన్ని మనసావాచా నమ్మాడు. మానవ పరిణామాన్ని, మొత్తం పరిణామవాదాన్ని గతితార్కిక చలన సూత్రాల ద్వారా దర్శించగలిగాడు. ఆకలి కడుపులోని చీకటి కోణాలను కండ్లారా చూడగలిగాడు. ఈ దార్శనికతే ఆయనను వస్తువులో జనతా తాత్వికునిగా, శిల్పంలో ఘనమైన భావుకునిగా నిలిపింది. ”నేను మార్క్సిస్టును.ఎaతీఞఱరఎ ఱర a aత్‌ీఱషశ్రీవ శీట టaఱ్‌ష్ట్ర షఱ్‌ష్ట్ర ఎవ. ఈ దేశంలోని సమస్యలన్నిటినీ మార్క్సిస్టు సిద్ధాంతం ద్వారానే పరిష్కరించుకోగలుగుతామని నా విశ్వాసం” అని ప్రకటించాడు. మార్కిస్టు దృక్పథంలో మనల్ని తికమక పెట్టే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందంటాడు. సత్యాన్ని దర్శించగలమని నమ్ముతాడు. తన సాహిత్యమంతా ఆ దృష్టి పథం నుంచి వచ్చిందేనంటాడు. అందుకే ప్రపంచ సాహిత్యంలో ‘అమ్మ’ నవల శ్రామికవర్గ పోరాటాలకు ఎంతటి ఉత్తేజమిచ్చిందో… తెలుగునాట ఆయన ‘మహాప్రస్థానం’ అంతటి స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది. దేశీయ మూలాలను, అంతర్జాతీయ ఆధునిక, అభ్యుదయ ధోరణులను ఆకలింపు చేసుకుని, భావజాల రంగంలో అద్భుత కళా ఖండాలను సృష్టించాడు. మహాకవిగా ముందు తరాలకు మార్గనిర్ధేశంగావించాడు. ‘× aఎ a ళస్త్రష్ట్ర్‌వతీ షఱ్‌ష్ట్ర జూవఅ. నా ఆయుధం కలం. అదెప్పుడూ అభ్యుదయ శక్తులకే అంకితం’ అంటూ తానెప్పుడూ ప్రజల పక్షపాతినేనని చాటుకున్నాడు.
సామాజిక వ్యవస్థలో కవి, రచయిత ఓ స్టేటస్‌ని మాత్రమే కోరుకుంటే వాడు కవి రచయిత కాలేడు. ఉత్త భట్రాజు మాత్రమే అవుతాడు. వందిమాగదుడవుతాడు. అధికారంలో ఉన్నవాళ్ల అడుగులకు మడుగులొత్తేవాడవుతాడేగానీ, కవీ రచయిత కాడు కాలేడు అంటాడు. కవీ రచయిత ఎప్పుడూ ప్రజల పక్షమే నిలబడాలంటాడు. కష్టజీవికి ఇరువైపుల నిలిచేవాడే కవి అని తేల్చి చెపుతాడు. ప్రజల సమస్యలను తన సమస్యలుగా చేసుకోవాలి. ఈ వ్యవస్థ యొక్క అగ్లీ ఫేస్ ఆఫ్ అగ్లీ ఎస్టాబ్లిష్‌మెంట్ అగ్లీనెస్‌ని బయటపెట్టాలి. దాని పరువు తీసెయ్యాలి. ఆ విధమైన రచనలు చేయాలంటాడు. మార్క్సిస్టు దర్శనానికి బద్దులైన రచయితలకు, పత్రికా రచయితలకు క్రియాశీల కార్యాచరణ ఇదేనని సూచిస్తాడు.
ఆయన్ను పరిస్థితులు కొంత ఆటుపోట్లకు గురిచేసినా అంతిమంగా ఈ కార్యాచరణకే కట్టుబడ్డాడు. సాహిత్యంలోనూ జీవితంలోనూ సామ్యవాదమే తన గమ్యమని నిరూపించుకున్నాడు. ‘నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను’ అని వినమ్రంగా చాటుకున్నాడు. ఈ గేయంలోనూ ఆయన కనబరిచిన వస్తు శిల్ప నైపుణ్యాలు గొప్పగా ఉంటాయి. అవేమిటంటే వ్యక్తి చైతన్యం సమిష్టి చైతన్యంతో మమేకమవడం. నేను ఉంటూనే సమాజం కూడా ఉండటం. ‘నేను సైతం భువన భవనపు భావుటానై పైకి లేస్తాను’ అన్న ముగింపులోనూ గొప్ప స్ఫూర్తినిస్తాడు. అంతేకాదు.. ఆ భావుటా ఏది? అన్న సందేహాలకు తావులేకుండా…
‘కనబడలేదా మరోప్రపంచపు హోమజ్వాలల భుగభుగలు
అగ్నికిరీటపు ధగధగలు.. ఎర్రబావుటా నిగనిగలు..’
అంటూ ఆకాశాన్ని అరుణపతాకాలతో వెలిగిస్తాడు…
శ్రీశ్రీ కోరుకున్న సామ్యవాద వ్యవస్థ నిర్మాణం ఆయన కాలంలో ప్రపంచదేశాల్లో కోటానుకోట్ల ప్రజల ఆకాంక్ష. కానీ నేడు ఆ ఆ కాంక్షకు, ఆశయానికి అనేక ఎదురుదెబ్బలు తగిలిన కారణంగా ప్రపంచమంతా అనేక సంక్షోభాలనెదుర్కొంటున్నది. ముఖ్యంగా నేటి ప్రపంచీకరణ దోపిడీని ఏకీకృతం చేస్తుంటే, మతవిద్వేషం ప్రజలను చీలికలు పేలికలు చేస్తున్నది. ఈ తరుణంలో శ్రీశ్రీ స్ఫూర్తి నేడు ఓ తప్పనిసరి అవసరం. శ్రామికవర్గ సౌభాగ్యం కోసం పరితపించి, తన అద్భుత కవితాశక్తితో సహస్త్ర వృత్తుల సమస్త జనావళికి అక్షరాభిషేకం చేసిన ఆ మహాకవి స్ఫూర్తితో ముందుకు సాగడమే నేటి కర్తవ్యం… పదండి ముందుకు….
(నేడు శ్రీశ్రీ జయంతి)
రమేష్ రాంపల్లి
సుత్తి సూర్యుడు.. కొడవలి చంద్రుడు…
- Advertisement -
RELATED ARTICLES